మహాస్వామి వారి మాయా వాచీ

పరమాచార్య స్వామి వారు ఒకసారి తిరునల్వేలి వెళ్తూ, పరివారంతో సహా పుదుకోట్టైలోని ఒక చత్రంలో మకాం చేస్తున్నారు. ఆనాటి రాత్రి చంద్రమౌళీశ్వర ఆరాధన తరువాత రాత్రి విశ్రమించడానికి సిద్ధమౌతున్నారు. వారి పరిచారకుడైన నాగరాజన్ అనే యువకుడిని పిలిచి, “అప్పా నాగు! నేను రేపు తెల్లవారిఝామున స్నానార్థమై మూడున్నరకు లేవాలి గుర్తున్నది కదా!” అని అన్నారు.

ఆ యువకుడు నాగు భక్తితో, ”మీ ఆజ్ఞ పెరియవా! మీరు చెప్పినట్లుగా రేపు ఉదయం సరిగ్గా మూడున్నరకు నేను ‘హర హర శంకర జయ జయ శంకర’ అనే నామావళి పాడతాను” అని చెప్పాడు.

నాగు మాటల్లోని భావన గ్రహించి మహాస్వామి వారు నవ్వారు. స్వామి వారు అతనితో, “నాతో ‘నేను మిమ్మల్ని మూడున్నరకు నిద్ర లేపుతాను పెరియవ’ అనడం బాగుండదని నువ్వు జయ జయ శంకర హర హర శంకర అని పాడుతాను అని అన్నావు”.

నాగు ఏమి మాట్లాడాలో తెలియక ఊరకుండిపోయాడు.

”సరే నీకు ఎలా అనిపిస్తే అలా చేయి” అని మహాస్వామి వారు గది లోనికి వెళ్ళారు.

అప్పుడు రాత్రి పదకొండు గంటలు. ఛత్రం మొత్తం నిద్రపోతోంది. స్వామి వారు కూడా విశ్రమించారు. నాగుకి నిద్ర పట్టడంలేదు. అతనికి దిగులు పట్టుకుంది. అక్కడ ఒక్క గడియారం కాని, చేతి వాచి కాని కూడా లేదు. అతని దగ్గరున్నదల్లా తన ఉపనయన సందర్భంగా తన మేనమామ బహూకరించిన ఒక పాత చేతివాచీ మాత్రమే. ఎప్పుడూ స్వామి వారి వద్ద ఉండడం వల్ల అతను ఎప్పుడూ తన చేతికి ధరించేవాడు కాదు. ఒక పాత పెట్టెలో అది విశ్రమిస్తోంది.

“నేను మెలకువగా లేకపోతే మూడున్నరకు పరమాచార్య స్వామి వారిని ఎలా లేపగలను” అనే అలోచనే అతన్ని తరుముతోంది. చివరగా ఒక నిర్ధారణకు వచ్చి, తన పెట్టెలో నుండి ఆ వాచీ తీసుకుని వచ్చాడు. స్వామి వారి గది ముందుకు వచ్చి నేలపై కూర్చుని, శబ్ధం బయటకు రాకుండా విష్ణు సహస్రనామం పఠించడం మొదలుపెట్టాడు. అప్పుడప్పుడు తన వాచీ చూసుకుంటూ, శ్లోకాలను సంపుటీకరణ చేస్తూ చదువుతున్నాడు.

సరిగ్గా మూడున్నరకి నాగు లేచి నిలబడి, కళ్ళు తుడుచుకుని, చేతులు కట్టుకుని మహాస్వామి వారి గదితలుపు వైపు చూస్తూ, చిన్నగా “జయ జయ శంకర హర హర శంకర” అని పాడనారంభించాడు. వెంటనే తలుపులు తెరుచుకున్నాయి. పరమాచార్య స్వామి వారు నవ్వుతూ, సాక్షాత్ పరమశివ తేజస్సుతో బయటకు వచ్చి నాగుకి సుప్రభాత దర్శనం ఇచ్చారు. కేవలం నాగుకి మాత్రమే ఆరోజు ఆ అవకాశం దొరికింది.

స్వామి వారు ఛత్రం ద్వారం దగ్గరికి వచ్చారు. వారి స్నానానికి ఏర్పాట్లు చెయ్యడానికి నాగు పరిగెత్తాడు. క్రమంగా ఛత్రం నిద్రలేచింది. మరుసటి రాత్రి, ఆ మరుసటి రాత్రి నాగు పని రాత్రి మేల్కొని ఉండడం, విష్ణు సహస్రనామ పారాయణం హర హర శంకర జయ జయ శంకర పాడటం మామూలుగా జరిగిపోయాయి. నాలుగవ రోజు రాత్రి తన వాచీని బొడ్డులో దోపుకొని తన నిత్యక్రమాన్ని చేస్తూ అనుకోకుండా నిద్రలోకి జారుకున్నాడు. హఠాత్తుగా గంధర్వ స్వరంతో జయ జయ శంకర హర హర శంకర అని వినపడడంతో మెలకువ వచ్చింది. ఉలిక్కిపడి లేచి చూస్తే ఎదురుగా కరుణాపూరితమైన ప్రసన్న వదనంతో పరమాచార్య స్వామి వారు.

స్వామి వారు వాత్సల్యంతో, “వత్సా! సరిగ్గా మూడున్నర అయింది. అలసట వల్ల నిద్రపోయినట్టున్నావు. రోజంతా పని ఉండడం వల్ల అలసిపోవడం మామూలే” అని చిరునవ్వుతూ, ద్వారం వద్దకు వచ్చారు. నాగు తన వాచీని చూసుకుని సరిగా మూడున్నర అయిందని నిర్ధారించుకున్నాడు.

మహాస్వామి వారు సరిగ్గా మూడున్నరకు లేవడం అతనికి ఆశ్చర్యాన్ని కలుగజేసింది. అతను విన్న ఆ దివ్య గానం ఇంకా చవుల్లో మారుమ్రోగుతోంది. అంతటి మాధుర్యాన్ని ఎప్పుడూ స్వామి వారి వద్ద వినలేదు.

మరుసటి రోజు రాత్రి పదకొండు గంటలు. స్వామి వారు విశ్రమిస్తున్నారు. ఏది ఏమైనా సరే ఈరోజు మెలకువగా ఉండాలని నాగు నిశ్చయించుకున్నాడు. నిద్ర వస్తే కళ్ళు తుడుచుకోవడానికి ఒక చిన్న పాత్రలో నీరు కూడా తెచ్చుకున్నాడు.

అప్పుడు సమయం రెండున్నర. అప్పటి దాకా ఎలాగో నిద్రని ఆపుకున్నవాడు, ఇక ఆపుకోలేక పోయాడు. తనవల్ల ఇక కాక అక్కడే నేలమీద పడుకొని నిద్రపోయాడు.

తలుపులు తెరుచుకున్నాయి. మహాస్వామి వారు మెల్లిగా బయటకు వచ్చారు. పడుకున్న నాగును అతని పక్కన ఉన్న నీళ్ళ పాత్రని చూసారు. అతని అవస్థని అర్థం చేసుకుని నవ్వుకున్నారు.

”హర హర శంకర జయ జయ శంకర. అప్పా నాగు నిద్ర లే!” స్వామి వారు చిన్నగా చెప్పారు. నాగు లేచి ఉలిక్కిపడి చూసాడు. ఎదురుగా చిరునవ్వుతో మహాస్వామి వారు.

”నాగు సరిగ్గా మూడున్నర. ఈరోజు కూడా నువ్వు నన్ను స్నానానికి మేల్కొల్పలేదు” అని ద్వారం వద్దకు వెళ్ళిపోయారు. నాగు సమయం చూసుకుని ఆశ్చర్యపోయాడు.

మద్యాహ్నం పూజ అనంతరం స్వామి వారు ఒక్కరే కూచుని ఉండడం చూసి, నాగు వారి వద్దకు వెళ్ళి సాష్టాంగం చేసాడు. స్వామి వారు “అప్పా నాగు నీ నమస్కారం మూలంగా నా నుండి నువ్వు ఏదో తెలుసుకోగోరుతున్నావని అర్థం అయింది. అడుగు ఏమిటో” అని అన్నారు.

”అవును పెరియవ. నేను ఎంతగా మేల్కొని ఉందామని ప్రయత్నించినా నావల్ల కుదరక నిద్ర పోతున్నాను. మీరు సరిగ్గా మూడున్నరకు నిద్రలేస్తున్నారు. స్వామి వారికి సమయం ఎలా తెలిసిసందని . . . ”

స్వామి వారు అడ్డుపడుతూ, “

ఎదో ఒక కర్ణ యక్షిణి నాకు సమయం చెప్తొందని నీ అనుమానం కదూ”

“అది కాదు పెరియవ. ఊరికే తెలుసుకుందామని”

“ఏ యక్షిణి నాకు సమయం చెప్పడం లేదు. నాకు సరైన సమయం చెప్తున్నది ఒక బస్సు. అవును, మదురై టి.వి. సుందరం అయ్యంగార్ వారి టి.వి.యస్ బస్సు. మొదటిరోజు నువ్వు నీ నామావళితో నన్ను నిద్ర లేపినప్పుడు నేను బయటకు రాగానే ఛత్రం ముందు నుండి ఒక బస్సు వెళ్ళింది. దాని గురించి అడుగగా అది మదురై నుండి పుదుక్కోట్టై వచ్చే మొదటి బస్సు అని తెలిసిసింది. అది ఒక్క క్షణం కూడా ఆలస్యంగా రాదు అని ఆ బస్సు సమయాన్ని బట్టి మన వాచీ సమయాన్ని సరి చేసుకోవచ్చని చెప్పారు. వారు చెప్పింది నిజమే. నాలుగవ రోజు ఆ బస్సు శబ్ధం వల్లే నిద్ర లేచాను. ఇందులో రహస్యమేమి లేదు” అని స్వామి వారు నవ్వి ఊరుకున్నారు. నాగు వారి వంక అలా చూస్తూ ఉండిపోయాడు.

--- శ్రీ రమణి అన్న, శక్తి వికటన్ ప్రచురణ

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।