నైవేద్యం - నాలుక

తిరుచిరాపల్లిలో పరమాచార్య స్వామి భక్తుడు ఒకరు ఫోటోస్టూడియో పెట్టుకుని నివసించేవారు. అతని ఇంటి పూజగదిలో పరమాచార్య స్వామి వారి చిత్రపటమే ప్రముఖము.
రోజూ ఉదయం లేచిన వెంటనే స్నానాదులు ముగించుకుని, స్వామి వారి చిత్రపటము ముందు ఏదేని ఒక పదార్థము నివేదన చేసిన తరువాతనే తన దినచర్యను ప్రారంభించేవారు. అతని పెదవులపై ఎప్పుడూ పరమాచార్య స్వామి వారి నామము నర్తిస్తూ ఉంటుంది.
ఒక మారు పరమాచార్య స్వామి వారు మన ఆంధ్రదేశంలోని కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. అది ఎండాకాలం కావడం వల్ల ఎండలు ఎక్కువగా ఉన్నాయి. తిరుచిరాపల్లిలోని ఈ భక్తునికి పరమాచార్య స్వామి వారి దర్శనం చేసుకోవాలనిపించింది. అతను ట్రైనుకు బయలుదేరే ముందు ఒక గిన్నెలో పాలు పోసి స్వామి వారికి నివేదన చేసాడు.
భక్తులు చాలా మంది స్వామి వారి దర్శనానికి రావడంతో వారు విడిది చేసిన ప్రాంగణమంతా నిండిపోయింది. జనసందోహంతో ఆ ప్రాంతమంతా జన సముద్రాన్ని తలపిస్తోంది. ఈ భక్తునికి పరమాచార్య స్వామి వారి దర్శనం దొరకలేదు. అతను ఒక ఇసుక కుప్ప పైన నిల్చుని దూరంనుండే మహాస్వామి వారి దర్శనం చెయ్యడానికి ప్రయత్నించాడు.
కాని అక్కడి ఎండలవల్ల అతని పాదాలు కాలాయి. సాయింత్రం కొద్దిగా జనాలు తగ్గిన తరువాత వద్దాం అని తిరిగి వెళ్ళీపోతున్నాడు. అంత దూరం నుండి వస్తే తనకు పరమాచార్య స్వామి వారి దర్శనం దొరకనందుకు మనస్తాపం చెందాడు.
కొద్ది దూరం వెళ్ళాడో లేదో ఎవరో తనను పిలుస్తున్నట్టు అనిపించి వెనకకు తిరిగాడు. స్వామి వారి పరిచారకులొకరు వచ్చి “నీవు తిరుచిరాపల్లి నుండి వచ్చావా?” అని అడిగారు.
”అవును”
“పరమాచార్య స్వామి వారు నిన్ను తీసుకురమ్మన్నారు”
“నన్ను తీసుకురమ్మన్నారా?” ఆ భక్తుడు ఆశ్చర్యపోయాడు.
”నువ్వు ఫోటోలు తీసేవాడివా?”
“అవును”
“అలా అయితే నాతో రా”
అతను ఆ భక్తుణ్ణి తీసుకువెళ్ళి మహాస్వామి వారి ముందు నిలబెట్టాడు. చేతులు జోడించి, కళ్ళ నీరు కారుతుండగా అతను బాహ్యమును మరచి మహాస్వామి వారి ముందు నిలబడ్డాడు.
అతన్ని చూసి మహాస్వామి వారు, “నన్ను చూడడానికి అంత దూరం నుండి వచ్చావు? మరి నన్ను చూడకుండా వెళ్ళడం వల్ల ఏమిటి ప్రయోజనం?” అని అడిగారు.
ఆ భక్తుడు నిచ్చేష్టుడై “చాలా రద్దీగా ఉంది. సాయంత్రం కొద్దిగా తగ్గిన తరువాత వద్దామనుకున్నాను” అని అన్నాడు.
”సరే. భోజనం చేసావా?”
“తిన్నాను పెరియవా”
కొద్ది క్షణాల తరువాత మహాస్వామి వారు అతనితో, “నా నోటి వైపు ఒకసారు చూడు” అన్నారు. పరమాచార్య స్వామి వారు నాలుక బయటికి చాపారు. అది ఎర్రగా వేడి వల్ల కమిలిపోయినట్టు ఉన్నది. తరువాత అతనితో “నా పెదవులు కూడా బొబ్బలొచ్చాయి. ఎందుకో తెలుసా?” అని అడిగారు. ఆ భక్తునికి ఏమి అర్థం కాలేదు.
“నువ్వు వేడి పాలను నాకు నివేదన చేసి గాబరాగా ఇక్కడికి వచ్చేసావు అందుకు” అని అన్నారు.

ఆ భక్తుడు అప్పుడు గుర్తు తెచ్చుకున్నాడు ఉదయం తను వేడి పాలను స్వామి వారికి నివేదన చేసాడు. వెంటనే అతను నేలమీద పడిపోయి, స్వామి వారికి సాష్టాంగం చేస్తూ గట్టిగా ఏడుస్తూ “మహాప్రభో నన్ను క్షమించండి” అని వేడుకున్నాడు.
అతనికి ఉన్న భక్తికి, అతని సమర్పణని స్వీకరించారు స్వామి వారు. ఇటువంటి భక్తి సాత్వికమైనది, మంచిది, సున్నితమైనది. భగవంతుణ్ణి భక్తుడి వద్దకు రప్పించుకునేది ఈ భక్తి మాత్రమే.
--- రా. వెంకటసామి, శక్తి వికటన్ ప్రచురణ
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।