చెక్క పాదుకలు - బంగారు తొడుగులు

కర్నూలులో ఆచార్యులు మువ్వురూ చాలా వారాలపాటు మకాం చేశారు. మేము మొదటిసారి అక్కడకు వెళ్ళినప్పుడు ఆదిశంకర పాదుకలకు పూజ చేశాము. అప్పుడు ఆ పాదుకలకు వెండి కవచం తోడగబడి ఉంది. కొన్ని రోజుల తరువాత మేము మరలా వెళ్ళినప్పుడు ఆ కవచం లేదు. పాదపూజ వ్యవహారం చూసుకునే శ్రీ చంద్రమౌళీశ్వర శాస్త్రి గారిని నా భార్య పట్టమ్మాళ్ అడిగింది వెండి కవచానికి ఏమైందని. పాదుకలు పాడైపోతున్నందున తాత్కాలికంగా వెండి కవచం పెట్టారు పుదు పెరియవ అని శాస్త్రిగారు చెప్పారు. కాని మహాస్వామివారు వాటికి బంగారు కవచమే తొడగాలని వారే వెండి కవచాన్ని తొలగించారు. తరువాత ఏ అచ్చాదనా లేని ఆ పాదుకలను బాల పెరియవకు చూపించి వాటిపై ఉన్న ఆదిశంకరుల మడిమ, వేళ్ళ గుర్తులు చూపించారు. ఆదిశంకరులు ఈ పాదుకలతో మొత్తం భారతదేశం అంతా ఎంత తిరిగారో తెలియజేయడానికే వాటిని బాల పెరియవకు చూపించారు.

ఆ రోజు ఉదయం మా నాన్నగారు పూజకు రాలేదు. సాయింత్రం మేము బసచేస్తున్న హోటలులో వారికి బంగారు కవచం గురించిన ఆలోచనను తెలిపాను. కాని దాని వల్ల దొంగలకు అవకాశం ఇచ్చినట్టు అవుతుందని, మఠం ఎక్కడికి వెళ్ళినా వాటిని తీసుకునివెడుతూ ఉంటారు కాబట్టి చిన్నగా ఉన్న వాటిని దొంగిలించడం తేలికని వారు నా ఆలోచనని ఇష్టపడలేదు.

మరుసటిరోజు నేను పుదు పెరియవతో మా నాన్న గారి ఆలోచన గురించి చెప్పాను. బంగారు కవచం వల్ల ప్రామాడం జరగవచ్చు అని. దీని విషయమై పరమాచార్య స్వామివారు నిర్ణయం తీసుకున్నారని, ఇక చర్చకు ఆస్కారం లేదని తెలిపారు. దానికి బహుశా 2.25 లక్షలు అవుతుందని తెలిపారు. అప్పట్లో అది చాలా పెద్ద మొత్తం. ఆరోజు రాత్రి నాకు హఠాత్తుగా ఈ మొత్తం వ్యవహారం నేనే చెయ్యాలనే ఆలోచన వచ్చింది. స్వామివారిని అడుగుదామని మా నాన్నగారికి విషయం తెలిపాను. అంత త్వరగా అంత మొత్తంలో డబ్బులు సమకూర్చడానికి అవుతుందా అని అడిగారు మా నాన్నగారు. ఎలాగో సర్దుబాటు చేస్తానని చెప్పాను.

మరుసటిరోజు పుదు పెరియవను కలిసి మొత్తం ఖర్చు నేను భరిస్తానని, మీరు అంగీకరిస్తే అది మా కుటుంబానికి దక్కిన భాగ్యంగా భావిస్తామని తెలిపాను. వారు ఖచ్చితమైన అంగీకారం తెలుపలేదు. చాలామంది భక్తులు డబ్బు, బంగారం సమర్పించడానికి సిద్ధంగా ఉన్నారు, కాని నా కోరిక మేరకు పరమాచార్య స్వామివారికి ఒకసారి చెబుతాను అన్నారు. మహాస్వామివారు ఏమి చెబుతారో అని రోజంతా వేచిచూసాము. మరుసటి రోజు ఉదయం పరమాచార్య స్వామివారు ఒప్పుకున్నారని పుదు పెరియవ మాకు తెలిపారు. డబ్బు పంపమని తెలిపారు. అంతటి అదృష్టం కలిగినందుకు మాకు చాలా సంతోషం వేసింది.

కాని అత్యంత ఆసక్తికరమైన సంఘటన నెలరోజుల తరువాత జరిగింది.

నా దగ్గర చికిత్స తీసుకునే పెద్దవయస్సు ఆవిడ ఒకరోజు నా క్లినిక్ కు వచ్చారు. తను కేవలం నన్ను చూడటానికే వచ్చానని, చికిత్సకు రాలేదని, ఒక విషయం చెప్పడానికి వచ్చానని తెలిపారు. ఆవిడ నాతో ఇలా చెప్పారు, “మూడు నెలల క్రితం నేను కర్నూలుకు వెళ్లాను. ఆదిశంకరుల పాదుకలకు బంగారు తొడుగు చేయిస్తున్నారని విన్నాము. వెంటనే నేనూ ఇతర మహిళలు కొందరు గాజులు, గొలుసులు తీసి మహాస్వామివారికి సమర్పించాము. కాని మహాస్వామివారు ఈ మొత్తం వ్యవహారాన్ని ఒక్క వ్యక్తికే అప్పగించబోతున్నానని, ఆ వ్యక్తీ ఎవరో ఇప్పుడు చెప్పనని మాతో చెప్పారు”.

కొన్నిరోజుల తరువాత నేనూ, మా తల్లితండ్రులు కలిసి కర్నూలు వెళ్ళాము. అప్పటిదాకా మొత్తం నేనే చూసుకోవాలన్న ఆలోచన నాదే అనే అజ్ఞానంలో ఉన్నాను. కాని ఇప్పుడు అర్థం అయ్యింది, మాహాస్వామివారే ఈ పనికి వ్యతిరేకించిన మమ్మల్ని మొత్తం కార్యం మోసుకునేలాగా చేశారు.

మా తల్లితండ్రులు, తాతముత్తాతల పుణ్యం వల్ల, నా పూర్వజన్మ సుకృతం వల్ల నాకు ఇంతటి పుణ్యకార్యం చెయ్యగలిగే అదృష్టం కలిగింది. ఇది పరమాచార్య స్వామివారి అవ్యాజ కరుణ.

--- ప్రొ. యస్. కళ్యాణరామన్, న్యూరోసర్జన్, చెన్నై. “మూమెంట్స్ ఆఫ్ ఎ లైఫ్ టైం” నుండి.

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।