ఏకాదశ రుద్రులు

శివుడు మనకు పదకొండు అవతారాలతో ఏకాదశ రుద్రులుగా దర్శనమిచ్చును.

ఓంనమస్తేస్తు భగవన్ "విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకా య త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయనమః" అని రుద్రనమకంలో చెప్పబడినది.

దీనిప్రకారం ఏకాదశ రుద్రులపేర్లు 
1. విశ్వేశ్వరుడు, 
2.మహాదేవుడు,
3. త్రయంబకుడు , 
4.త్రిపురాంతకుడు, 
5.త్రికాగ్నికాలుడు, 
6.కాలాగ్నిరుద్రుడు, 
7.నీలకంఠుడు, 
8.మృత్యుంజయుడు, 
9.సర్వేశ్వరుడు,
10. సదాశివుడు మరియు 
11.శ్రీమన్మహాదేవుడు.

ఏకాదశ రుద్రులు మరియు వారిభార్యలైన ఏకాదశ రుద్రాణుల పేర్లు క్రింద ఈయబడినవి.

1.అజపాదుడు- ధీదేవి
2.అహిర్భుద్న్యుడు- వృత్తిదేవి
3. త్రయంబకుడు- ఆశనదేవి
4.వృషాకపి- ఉమాదేవి
5.శంభుడు- నియుత్ దేవి
6.కపాలి- సర్పిదేవి
7.దైవతుడు- ఇల దేవి
8.హరుడు- అంబికాదేవి
9.బహురూపుడు- ఇలావతీదేవి
10.ఉగ్రుడు- సుధాదేవి
11.విశ్వరూపుడు- దీక్షాదేవి

అంబాజీపేట మండలం జగ్గన్నతోటలో ప్రభలతీర్థంలో ఏకాదశ రుద్రులతోకూడిన ప్రభలు సంక్రాంతి పండుగలలో కనుమరోజు భక్తజనులకు దర్శనమిచ్చి తరింపజేయుచున్నారు.

వాటి వివరణ.?
1. విశ్వేశ్వర రుద్రుడు- వ్యాఘ్రేశ్వరం 
(శ్రీబాలాత్రిపుర సుందరీ సమేత వ్యాఘ్రేశ్వర స్వామి):
పూర్వకాలంలో ఒకబ్రాహ్మణోత్తముడు వ్యాఘ్రాన్ని (పులి) శివునిగా భావించి బిళ్వపత్రాలతో అర్చన చేయటంవల్ల ఆపులి శివలింగరూపాన్ని పొందిందని కధనము కలదు. 
వ్యాఘ్రము శివునిగా అవతరించుటచే వ్యాఘ్రేశ్వర స్వామి అని పిలువబడెను.

2. మహాదేవరుద్రుడు- కె. పెదపూడి 
(శ్రీపార్వతీ సమేత మేనకేశ్వర స్వామి):
పూర్వకాలంలో విశ్వామిత్రుని తపోభంగము కొరకు ఇంద్రుడు మేనకను పంపెను. 
విశ్వామిత్రునకు, మేనకకు శకుంతల జన్మించెను. తరువాత మేనక స్వర్గమునకు పోవుదమని ప్రయత్నించగా ఆమె వెళ్ళలేకపోయినది. 
అపుడు ఆమె శివుని ప్రార్ధించగా ఆయన ఒక శివలింగమును మేనకకు ఇచ్చి ఆప్రదేశములో ప్రతిష్ఠింపుమనెను. 
అపుడు మేనక కృష్ణరాయుడు పెదపూడి (కె.పెదపూడి) నందు శివలింగమును ప్రతిష్ఠించి స్వర్గమునకు పోయెనని కధనము కలదు. 
మేనకచే ప్రతిష్ఠింపబడుటచే మేనకేశ్వరస్వామి అని పిలువబడెను.

3. త్రయంబకేశ్వరుడు - ఇరుసుమండ 
(శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత ఆనందరామేశ్వర స్వామి):
రావణుని సంహరించిన తరువాత శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతుడై పుష్పకవిమానంలో అయోధ్యకు వెళ్తుండగా మార్గమధ్యంలో ఇరుసుమండ వద్ద వారి పుష్పకవిమానం కదలకుండా నిలిచిపోయినది. 
అపుడు శ్రీరామచంద్రుడు శివుని ప్రార్ధించి ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించెనని కధనము కలదు. 
అపుడు వారి పుష్పకవిమానము ముందుకు కదలగా వారందరూ ఆనందభరితులైరి. 
రామునిచే ప్రతిష్ఠింపబడినది కావున రామేశ్వరుడని, అందరికీ ఆనందదాయకమగుటచే ఆనందరామేశ్వరుడని పిలువబడెను.

4. త్రిపురాంతక రుద్రుడు- వక్కలంక 
(శ్రీ అన్నపూర్ణా సమేత విశ్వేశ్వర స్వామి):
తారకాసురుని పుత్రులు ముగ్గురు మూడుపురములుగా మారి త్రిపురాసురులుగా పేరొందినారు.
దేవతలందరూ త్రిపురాసురులను సంహరింపుమని శివుని ప్రార్ధించగా వారిని శివుడు సంహరించి వక్కలంక గ్రామము నందు శివలింగరూపంలో ఆవిర్భవించెనని కధనము కలదు. 
అపుడు ఆగ్రామపు బ్రాహ్మణోత్తములచే శివలింగము ప్రతిష్ఠింపబడి విశ్వేశ్వరునిగా పిలువబడెను.

5. త్రికాగ్నికాల రుద్రుడు- నేదునూరు 
(సర్వమంగళా పార్వతీ సమేత శ్రీ చెన్నమల్లేశ్వర స్వామి):
మూడు అగ్నులయందు హోమము చేసిన ద్రవ్యములను స్వీకరించి శివుడు లింగరూపమును పొందుటచే త్రికాగ్ని కాలునిగా పిలువబడి అగస్త్యమహర్షిచే నేదునూరు గ్రామమున ఈశివలింగము ప్రతిష్ఠింపబడినది. 
శ్రీ ఉమాచెన్నమల్లేశ్వర స్వామిగా సర్వజనులచే కొలువబడుచున్నాడు.

6. కాలాగ్ని రుద్రుడు- ముక్కామల (బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ రాఘవేశ్వర స్వామి):
రావణ సంహారం తరువాత అగస్త్య మహాముని అయోధ్యకేగుచున్న రామునిచే ఈప్రదేశమున శివలింగాన్ని ప్రతిష్ఠింపజేసెను. 
కాలాగ్ని రుద్రుడు శ్రీరామునకు దివ్యాస్త్రములను, ఖడ్గమును ప్రసాదించెను. 
రాఘవునిచే ప్రతిష్ఠింపబడుట వల్ల రాఘవేశ్వరస్వామిగా పిలువబడెను.

పాండవ వనవాస కాలంలో శివుడు అర్జునుని పరీక్షింపదలచి కిరాతునివేషంలో అర్జునుని ధైర్యపరాక్రమములను చూచి పాశుపతాస్త్రమును ప్రసాదించెనని, 
ఆయనే ఈ కాలాగ్నిరుద్రుడని మరియొక కధనముకలదు.

7. నీలకంఠ రుద్రుడు- మొసలపల్లి 
( శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత అనంత భోగేశ్వర స్వామి ):
దేవతలు మరియు రాక్షసులు క్షీరసాగర మధన సమయంలో వెలువడిన విషవాయువులను ఎవ్వరికీ హాని కలిగించకుండా చేయుటకు శివుడు తనకంఠమునందు నిక్షిప్తము చేసికొని నీలకంఠుడైనాడు.

ఆగరళకంఠుడే మొసలపల్లి గ్రామమునందు లింగరూపమున ఆవిర్భవించెను. 
తనను కొలిచినవారికి అనంతభోగాలను అందించేవాడు, 
మరియు అనేక భోగులను (పాములను) ఆభరణములుగా ధరించినవాడు అగుటవల్ల 
అనంత భోగేశ్వరస్వామిగా పిలువబడెను.

8. మృత్యుంజయ రుద్రుడు- పాలగుమ్మి (శ్యామలాంబా సమేత శ్రీచెన్నమల్లేశ్వర స్వామి):
శివుడు అర్ధాయుష్కుడైన మార్కండేయుని మృత్యుముఖమునుండి రక్షించి, 
యముని జయించి "మృత్యుంజయుడు" అయ్యెను.

ఈ మృత్యుంజయ రుద్రుడు పాలగుమ్మి 
గ్రామమునందు లింగరూపమున ఆవిర్భవించి చెన్నమల్లేశ్వర స్వామిగా పిలువబడెను.

9. సర్వేశ్వర రుద్రుడు- గంగలకుర్రు అగ్రహారం (ఉమాపార్వతీ సమేత శ్రీవీరేశ్వర స్వామి):
దక్షుని యజ్ఞంలో సతీదేవి తనతండ్రి చేసిన అవమానాన్ని భరించలేక తనకాలితో నేలపై వ్రాయుటవల్ల ఏర్పడిన అగ్నిజ్వాలలందు కాలిబూడిద అయినపుడు శివుడు ఆగ్రహించి ఉగ్రరూపుడై నృత్యముచేసి తనజటాజూటములో ఒక జటను తీసి నేలపై కొట్టుటవల్ల శివాంశ సంభూతుడైన వీరభద్రుడు జన్మించెను. 
వీరభద్రుడు అపుడు దక్షయజ్ఞమును ధ్వంసముచేసెను. 
ఉగ్రరూపుడైన శివుడు వీరేశ్వరస్వామిగా లింగరూపమున గంగలకుర్రు అగ్రహారము నందు వేదపండితులైన బ్రాహ్మణోత్తములచే ప్రతిష్ఠింపబడెను.

10. సదాశివ రుద్రుడు- గంగలకుర్రు 
(సర్వమంగళా పార్వతీ సమేత శ్రీచెన్నమల్లేశ్వర స్వామి):
పూర్వం బ్రహ్మవిష్ణులు తమలో ఎవరుగొప్ప వారని వాదనకు దిగి శివుని వద్దకు వచ్చిరి. 
అపుడు శివుడు ఆద్యంతములు లేని లింగరూపమును ధరించి బ్రహ్మను తన శిరస్సును చూచిరమ్మని విష్ణువును తన పాదములను చూచిరమ్మని పంపెను. 
విష్ణువు శివుని పాదములను కనుగొనలేక తిరిగివచ్చి చూడలేకపోయితినని చెప్పెను. 
కాని బ్రహ్మమాత్రము శివుని శిరస్సును చూడకపోయినను ఒకఆవును, మొగలిపువ్వును సాక్ష్యము తెచ్చుకొని తాను చూచితినని చెప్పెను. శివునికి ఆగ్రహము వచ్చి బ్రహ్మకు పూజాపునస్కారములు లేకుండా శపించి విష్ణువే అగ్రగణ్యుడని చెప్పెను. 
ఆలింగధారియైన సదాశివుడు గంగలకుర్రు గ్రామములో వేదపండితులైన బ్రాహ్మణోత్త ములచే ప్రతిష్ఠింపబడెను.

11. శ్రీమన్మహాదేవ రుద్రుడు- పుల్లేటికుర్రు (శ్రీబాలాత్రిపురసుందరీ సమేత అభినవ వ్యాఘ్రేశ్వరుడు):
పూర్వకాలంలో విష్ణుమూర్తి శివుని సహస్రకమలాలతో సహస్రనామాలతో పూజించెను. దానికి సంతసించిన మహాదేవుడు విష్ణువుకు సుదర్శన చక్రమును బహూకరించెను. ఆమహాదేవుడు పుల్లేటికుర్రు గ్రామమునందు లింగరూపమున ఆవిర్భవించెను. 
పుల్లేటికుర్రు గ్రామానికి "పుండరీకపురము" అని పూర్వకాలంలో పేరు ఉండెడిది. 
పుండరీకము అనగా వ్యాఘ్రము(పులి) అని అర్ధము కలదు. 
వ్యాఘ్రేశ్వరమునందు వ్యాఘ్రేశ్వరస్వామి ఉండుటచేత ఈ గ్రామమునందు శివుడు అభినవ వ్యాఘ్రేశ్వర స్వామి అనుపేరుతో పిలువబడెను.

ఏకాదశ రుద్రులకు సభ్యులందరి తరపున శతసహస్ర వందనములు. సమస్త జనులకు ఏకాదశ రుద్రుల అనుగ్రహ ప్రాప్తిరస్తు..స్వస్తి..!!

ఓం నమః శివాయ..!!?
సర్వేజనాః సుఖినోభవంతు..?

Image may contain: flower