విష్ణువు రాముడిగా అవ‌తారం ఎత్త‌డానికి

అస‌లు కార‌ణాలు ఏమిటో తెలుసా..?

మాన‌వాళిని ర‌క్షించేందుకు ఆయా దేవుళ్లు,
దేవ‌త‌లు ప‌లు అవ‌తారాలెత్తి రాక్ష‌సుల‌ను సంహరించిన‌ట్టు హిందూ పురాణాల్లో ఉంది.
దీని గురించి అంద‌రికీ తెలిసిందే.
అయితే ఆయా అవ‌తారాల్లో ప్ర‌ధానంగా చెప్పుకోద‌గిన వాటిలో రామావ‌తారం కూడా ఒక‌టి.

శ్రీ‌మ‌హావిష్ణువు రాముడిగా జ‌న్మించి రావ‌ణాసురున్ని, ఇత‌ర రాక్ష‌సుల‌ను చంపి మాన‌వాళిని ర‌క్షించాడ‌ని రామాయ‌ణంలో ఉంది.
అయితే విష్ణువు శ్రీ‌రాముడిగా జ‌న్మించ‌డం వెనుక మ‌రికొన్ని క‌థ‌లు కూడా ప్ర‌చారంలో ఉన్నాయి.
వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

శ్రీ‌మ‌హావిష్ణువు శేష‌త‌ల్పంపై పాల‌స‌ముద్రంలో
శ‌య‌నించి ఉండ‌గా ఆయ‌న మందిరానికి
కాప‌లాగా ఇద్ద‌రు ర‌క్ష‌కులు ఉంటారు.
వారే జ‌య‌, విజ‌య‌.

ఈ క్ర‌మంలో ఒకానొక సంద‌ర్భంలో విష్ణువును క‌లిసేందుకు ఓ ముని అక్క‌డికి వ‌స్తాడు.
అయితే జ‌య‌, విజ‌య‌లు అత‌న్ని లోప‌లికి అనుమ‌తించ‌రు.
దీంతో ఆగ్రహించిన ముని వారిద్ద‌రికీ రాక్ష‌సుల‌ను క‌మ్మ‌ని శాపం పెడ‌తాడు.

దీంతో వారు హిర‌ణ్యాక్ష‌, హిర‌ణ్య‌క‌శ్య‌ప అనే ఇద్ద‌రు రాక్ష‌సులుగా మారి దేవ‌త‌ల‌తోపాటు స‌మ‌స్త మాన‌వాళిని అనేక చిత్ర‌హింస‌లు పెడుతుంటారు.
దీంతో విష్ణువు వరాహ అవ‌తారం ఎత్తి హిర‌ణ్యాక్షున్ని, నృసింహ అవ‌తార‌మెత్తి హిర‌ణ్య‌క‌శ్య‌పున్ని హ‌త‌మారుస్తాడు.

కానీ అలా చ‌నిపోయినా జ‌య‌, విజ‌య‌ల‌కు మోక్షం క‌ల‌గదు. దీంతో వారు మ‌ళ్లీ రాక్ష‌సులుగానే జన్మిస్తారు. కాగా ఈ సారి జ‌య‌, విజ‌య‌లు రావ‌ణుడు, కుంభ‌క‌ర్ణులలా పుడ‌తారు.
అలా వారిని చంపేందుకు విష్ణువు రాముడి అవ‌తారం ఎత్తిన‌ట్టు చెబుతారు.

ఒక‌సారి జ‌లంధ‌రుడ‌నే రాక్ష‌సుడు దేవ‌త‌లంద‌రినీ యుద్ధంలో ఓడించి వారిని నానా చిత్ర‌హింస‌లు పెడుతుంటాడు.
దీంతో వారు శివుని వ‌ద్ద‌కు వెళ్లి త‌మ‌ను ర‌క్షించ‌మ‌ని మొర‌పెట్టుకుంటారు.
ఈ క్ర‌మంలో శివుడు జ‌లంధ‌రుడితో యుద్ధం చేస్తాడు
కానీ అత‌న్ని గెల‌వలేక‌పోతాడు.

అందుకు కార‌ణం అత్యంత ప‌తివ్ర‌త అయిన వృంద
అనే భార్య ఉండ‌డ‌మే జ‌లంధ‌రుడి విజ‌యానికి కార‌ణ‌మ‌ని శివుడు తెలుసుకుంటాడు.

దీంతో విష్ణువు జ‌లంధ‌రుడిగా మారువేషంలో వెళ్లి
వృంద ప‌విత్ర‌త‌ను కోల్పోయేలా చేస్తాడు.
ఆ క్ర‌మంలో శివుడు జ‌లంధ‌రుడితో మ‌ళ్లీ యుద్ధం చేసి అత‌న్ని ఓడించి చంపేస్తాడు.
కానీ జ‌లంధరుడు రావ‌ణాసురుడిలో ఓ అంశ‌లా మళ్లీ జ‌న్మిస్తాడ‌ట‌.
అప్పుడు విష్ణువు రామావ‌తారం ఎత్తి రావ‌ణాసురున్ని హ‌త‌మారుస్తాడు.

త్రేతాయుగం ఆరంభానికి కొన్ని వేల ఏళ్ల ముందు
కృత యుగంలో మనువు, అత‌ని భార్య సాత్రూప
అని ఇద్ద‌రు దంప‌తులు ఉండేవార‌ట‌.
వారు శ్రీ‌మహావిష్ణువుకు మొద‌టి నుంచి ప‌ర‌మ భ‌క్తుల‌ట‌. కాగా వారు త‌మ వృద్ధాప్యంలో ఇంటిని విడిచిపెట్టి అడ‌వికి వెళ్లి విష్ణువు కోసం త‌పస్సు చేస్తార‌ట‌.

ఈ క్రమంలో ఒక రోజు విష్ణువు ప్ర‌త్య‌క్ష‌మై
ఏం వ‌రం కావాలో కోరుకోమ‌ని అడ‌గ్గా,
వారు విష్ణువును త‌మ‌కు బిడ్డ‌గా జ‌న్మించాల‌ని అడుగుతార‌ట‌.
దీంతో మ‌నువు ద‌శ‌ర‌థుడిగా జ‌న్మిస్తాడు.
అత‌నికి విష్ణువు కొడుకుగా (రాముడిగా) జ‌న్మించి
వారి వ‌రం తీరుస్తాడు.

ఒకానొక సంద‌ర్భంలో నార‌దుడు త‌పస్సు చేసుకుంటుండ‌గా మ‌న్మ‌థుడు వ‌చ్చి అత‌నిలో
శృంగార భావ‌న‌లు క‌లిగేలా బాణాలు వేస్తాడ‌ట‌.
అయినా నార‌దుడు చలించ‌డ‌ట‌.
ఈ క్ర‌మంలో మన్మథుడిపై ఫిర్యాదు చేసేందుకు
నార‌దుడు శివుడు వ‌ద్ద‌కు వెళ్ల‌గా అప్పుడు శివుడు నార‌దున్ని విష్ణువు ద‌గ్గ‌ర‌కు పంపుతాడు.

విష్ణువు ఎదుట విష‌యం చెప్పిన నార‌దుడి ప్ర‌వ‌ర్త‌న చూసి విష్ణువుకు విసుగు వ‌స్తుంద‌ట‌.
దీంతో నారదుడికి ఎలాగైనా బుద్ధి చెప్పాల‌నుకుని
అత‌ను వెళ్లే దారిలో ఓ సుంద‌ర‌మైన అర‌ణ్యాన్ని, అందులో అద్దాల భ‌వంతుల‌ను,
ర‌క‌ర‌కాల అంద‌మైన చెట్ల‌ను,
పువ్వుల‌ను క‌లిగి ఉన్న తోట‌ను,
ఒక అంద‌మైన యువ‌రాణిని విష్ణువు సృష్టిస్తాడ‌ట.

అలా నారదుడు విష్ణువు వ‌ద్ద నుంచి బ‌య‌ల్దేరి వెళ్తుండ‌గా అత‌ను సృష్టించిన సుంద‌ర‌మైన అర‌ణ్యాన్ని,
అందులోని యువ‌రాణిని చూసి ఆమెను మోహించి
పెళ్లి చేసుకునేందుకు నార‌దుడు సిద్ధ‌మ‌వుతాడ‌ట‌.

అప్పుడు ఆ యువ‌తి నార‌దున్ని చూసి పక ప‌కా న‌వ్వుతుంద‌ట‌.
దీంతో ఆగ్ర‌హించిన నార‌దుడు అస‌లు విషయం తెలుసుకుని తాను మోహించిన యువ‌తిని పెళ్లాడ‌కుండా చేసినందుకు గాను విష్ణువు భార్య‌కు దూర‌మై
విర‌హ తాపాన్ని అనుభ‌వించాల‌ని విష్ణువుకు శాపం పెడ‌తాడ‌ట‌.

దీంతో విష్ణువు రాముడిగా జ‌న్మించి సీత‌కు దూర‌మై
అనేక సంవత్సరాలు విర‌హ తాపంతో గ‌డిపాడని చెబుతారు.

అలా విష్ణువు రాముడిగా జ‌న్మించ‌డం వెనుక ఆయా క‌థలు దాగి ఉన్నాయ‌ని పురాణాలు చెబుతున్నాయి.
శ్రీరామ జయరామ జయ జయ రామ..!!:pray:

లోకా సమస్తా సుఖినోభవంతు..!!:bouquet:

:bouquet:శ్రీ మాత్రే నమః:bouquet:

సేకరణ : శ్రీకళ భక్తి వారి నుండి