*వేమన*

వేమన చరిత్ర అస్పష్టంగా ఉంది. సుమారు 1652 - 1730 మధ్య కాలములో జీవించి ఉండవచ్చు. బహుళ ప్రచారంలో ఉన్న కథనం ప్రకరం వేమన వివరాలు ఇలా ఉన్నాయి. ఆయన నందననామ 
సంవత్సరము, కార్తిక శుద్ధ పౌర్ణమి రోజున జన్మించారు. ఆయన తన జన్మస్థలాన్ని తనే ఒక పద్యంలో వివరించారు.
*పుట్టిన తేదీ, స్థలం :* 1652 (Estimate by CP Brown)
రాయలసీమ
*మరణం :*
కాటర్లపల్లి
*వృత్తి :* అచలయోగి, కవి, సంఘ సంస్కర్త
'విశ్వదాభిరామ వినురవేమ' అనే మాట వినని తెలుగు వాడు ఉండడు. వానకు తడవనివారు, ఒక్క వేమన పద్యం కూడా రాని తెలుగువారు ఉండరని లోకోక్తి.
చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ద్వారా వేమన పద్యాలు వెలుగులోకి వచ్చాయి. పామరులకు కూడా అర్థమయ్యే భాషలో పద్యాలు చెప్పి ప్రజల్ని మెప్పించిన కవి, వేమన . ఆటవెలదితో 
అద్భుతమైన కవిత్వము, అనంతమైన విలువ గల సలహాలు, సూచనలు, విలువలు, తెలుగు సంగతులు ఇమిడ్చిన మహానుభావుడు, యోగి వేమన.
ఈయన యవ్వనంలో వేశ్యాలోలుడిగా జీవించారు. కొంతకాలానికి విరక్తిచెంది, తపస్సు చేసి యోగిగా మారారు. సమాజానికి హితబోధ చేస్తూ వేలాది పద్యాలు చెప్పారు. చివరికి కడప దగ్గరి పామూరుకొండ గుహలో శార్వరి నామ సంవత్సరం శ్రీరామ నవమి నాడు సమాధి చెందారు.

వేమన సమాధి అని ఇప్పటికీ ప్రసిద్ధమైనది కదిరి తాలూకాలోని కటారుపల్లె. ఇక్కడ వేమన సమాధి ఉంది

*వేమన పద్యాలలో అతని జీవితం*
వేమన పద్యాలలో అతని జీవితానికి సంబంధించిన క్రింది పద్యాలు ముఖ్యంగా ఉదహరిస్తారు.
*నందన సంవత్సరమున;* *పొందుగ కార్తీకమందు బున్నమినాడీ*
*వింధ్యాద్రి సేతువులకును, నందున నొక వీరు డేరుపడెరా వేమా!*

*ఊరుకొండవీడు వునికి పశ్చిమవీధి;*
*మూగచింతపల్లె మొదటి యిల్లు*
*ఎడ్డిరెడ్డికులము యేమని చెప్పుదు;*
*విశ్వదాభిరామ వినురవేమ!*

*లాదనడెవ్వరితోడను; వాదాడగబోడు* *వెర్రివానివిధమునన్*
*భేదాభేద మెరుంగును* *వదాంత రహస్యములను వేమన నుడువున్ ||*
వేమన కొంతకాలం వ్యవసాయం చేసారు. ఎవరికీ పనికిమాలిన వెర్రిపుచ్చకాయలు సాగుచేసి కూలిగా ఆ పుచ్చకాయలే ఇస్తానన్నారు. అతిపేదరికంతో బాధపడుతున్న ఒక కుటుంబం అలా పుచ్చకాయలు తీసికెళ్ళి వాటిని తెరచి చూస్తే అందులో మణులున్నాయట.
తత్వాన్ని బోధించాడు. అందరి యెదుటా యోగి సంప్రదాయంలో మహాసమాధి చెందారు. వేమన ఒక మోతుబరి రైతుబిడ్డ. చిన్నతనంలో తన సావాసగాండ్రకు నాయకునిగా మెలిగారు. పదేండ్ల ప్రాయంలో వేమన చదువుకోసం నగరానికి వెళ్ళాడు. దిట్టలైన గురువులవద్ద చదువుకొన్నాడు. 
సంస్కృతము, గణితము నేర్చుకొన్నారు. నీతిని తెలిసినవారు. రాగాలలోను, వీణానాదంలోను నేర్పరి. సాహసికుడు, స్వచ్ఛందుడు, బుద్ధిమంతుడు.
సాహసి, కళాభిమాని.
అదే కాలంలో దేశంలో నెలకొన్న కరువులు, పాలకుల అక్రమాలు, ఈతిబాధలు అతని ఆలోచనలకు పదును పెట్టాయి. దాని గురించి మరల మరల ప్రస్తావించారు. ఎందరో యోగులను, గురువులను దర్శించారు. వారు చెప్పిన సాధనలు చేశారు. గురువుల మర్మాన్ని తెలుసుకొన్నారు. ప్రాపంచిక జీవితంలో మోసం, కపటం, నాటకం, దంభం గ్రహించిన వేమన, సన్యాసుల బ్రతుకులలో కూడా అవే లక్షణాలున్నాయని తెలుసుకొన్నారు. వారి మోసమును ఎలుగెత్తి ఖండించారు. కులాన్నీ, అధికారాన్నీ, అహంకారాన్నీ, సంపన్నుల దౌష్ట్యాన్నీ నిరసిస్తూ ఊరూరా తిరిగి తత్వాలు చెప్పసాగారు. కొందరు వెర్రివాడని తరిమికొట్టారు. తనను తానే 'వెర్రి వేమన్న' అని అభివర్ణించుకొన్నారు. వేదాంత సారాన్ని తన చిన్న పద్యాలలో పొందుపరచి ఊరూరా ప్రబోధించారు.
ఆత్మ సంస్కారాన్ని, కుల సంస్కారాన్ని, ఆర్థిక సంస్కారాన్ని ప్రబోధించారు. గురువుల కపటత్వాన్ని నిరసించారు.