మహాస్వామి – ముస్లిమ్ భక్తుడు

కంచి కామకోటీ పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు పండరీపురంలో మకాం చేస్తున్నారు. వారి దర్శనం కోసం మేము అక్కడికి బయలుదేరాము. మేము ఎక్కిన రైలు పండరీపురం చేరుకుంది. చంద్రభాగా నది ఆవలి ఒడ్డున ఒక చిన్న మఠంలో బస చేస్తున్న పరమాచార్య స్వామి వారి దగ్గరికి వెళ్ళడానికి ఎలాగా అని అలోచిస్తూ నిలుచున్నాము.

ఆ రోజుల్లో టాక్సీలు అవి ఏవి లేవు. అప్పుడు ప్రాయాణ సాధనం గుర్రపుబండి మాత్రమే. నా కళ్ళు ఒక టాంగా వాడి మీద పడ్డాయి. చూడడంతోనే అతను మహమ్మదీయుడు అని తెలిసిపోవడం వల్ల స్వామి వారి గురించి అతనికి తెలిసి ఉండదని వేరొక టాంగా కోసం వెతికాను. అక్కడ అతను తప్ప ఎవరూ లేక పోవడంతో వెళ్ళి అతనితో, “శంకరాచార్య స్వామి వారు ఎక్కడ బసచేసి ఉన్నారో నీకు తెలుసా?” అని అడిగాను. అతను “కంచి పెరియవనా? వారు తెలియకేం చాలా బాగా తెలుసు. మిమ్మల్ని అక్కడికి తీసుకుని వెళ్తాను. ఆయన మాకు అల్లా” అని బదులిచ్చాడు. నేని కొంచం ఆశ్చర్యపోయి, సరే పదమన్నాను.

మేము స్వామి వారున్నచోటికి చేరుకున్నాము. ఆ టాంగావాలా మాతో డబ్బు తీసుకోవడానికి నిరాకరించాడు. అతను సరాసరి పరమాచార్య స్వామి వారు కూర్చుని ఉన్న చోటికి మమ్మల్ని తీసుకుని వెళ్ళాడు. అతను ఆనందంతో, తల్లి దగ్గరికి నెలల బిడ్డ వెళ్ళిన చందంగా స్వామి వారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. అది అతనికి ఈ జన్మకు లభించిన హక్కు కాబోలు, పరమాచార్య స్వామి వారు కూడా ఏమి మాట్లాడలేదు. స్వామి వారికి మమ్మల్ని పరిచయం చేసాడు. తరువాత తను మాతో, ”వీరు వచ్చిన నాటినుండి మా జీవితాలు ధన్యమయ్యాయి. తాగుడు మొదలైన వ్యసనాలను త్యజించాము” అని అన్నాడు. అతను కళ్ళారా చూసిన ఒక సంఘటనని మాతో పంచుకున్నాడు.

చంద్రభాగా నది ఎగువ ప్రాంతంలో వర్షాలు ఎక్కువై నదికి వరదలు వచ్చాయి. ప్రమాదపు అంచులో నది ప్రవాహం ఉంది.

ఆరోజు స్వామి వారు వారు నిద్రలేచారు. వరద ఉధృతి ఎక్కువగా ఉంది వెళ్ళొద్దని అందరూ బ్రతిమాలుకున్నా స్వామి వారు స్నానానికై నదికి వెళ్ళారు. నదిలోకి వెళ్ళి వారి దండాన్ని ఒకచోట నిలబెట్టారు. ఆశ్చర్యకరంగా వరద నీరు ఆ దండం దరిదాపుల్లోకి కూడా రాలేదు. అక్కడినుండి వరద వెనుకకు వెళ్ళనారంభించింది. నేను కూడా నదిలో స్నానం చేసాను.

“నేను ప్రత్యక్ష సాక్షిని” అని భావోద్వేగంతో చెప్పాడు ఆ సాధారణ ముస్లిమ్ భక్తుడు.

[ఆదిశంకరాచార్యుల వారు గురువు అన్వేషణలో భాగంగా నర్మదానదీ పరీవాహక ప్రాంతానికి వచ్చినప్పుడు, నదికి వరద వచ్చింది. వారు తమ కమండలంలో ఆ వరద నీటినంతటినీ పట్టి వరద ముంపు నుండి కాపాడారు. అలా చేసినవాడే నీకు శిష్యుడై, జగద్గురువై సనాతన ధర్మాన్ని ఉద్ధరిస్తాడని గోవిందభగవత్పాదులకు వారి గురువులు గౌడపాదుల వారు చెప్పారు.]

--- శ్రీమతి పద్మా సుబ్రహ్మణ్యం గారి ‘శ్రీ మహాపెరియవ స్మృతులు’ నుండి

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।