మన సమస్యలకు పరిష్కారాలు

*మన సమస్యలకు పరిష్కారాలు మన అంతరంగంలోనే ఉన్నాయి*

*“గురువు ముఖతః వచ్చేవన్నీ మన అంతరాత్మ ప్రభోదాలే”*

*జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతిఒక్క సమస్యకూ తగిన పరిష్కారం తప్పకుండా వుంటుంది ! ఆ పరిష్కారం కూడా .. నిదానంగా వెతికితే .. మన అంతరంగంలోనే నిక్షిప్తమై వుంటుందే కానీ బయట వేరే ఎక్కడా వుండదు గాక వుండదు ! నిజానికి బయటివాళ్ళెవ్వరూ అసలు మన సమస్యను పరిష్కరించజాలరు.*

*తరచిచూస్తే మనకు ఎదురయ్యే ప్రతి ఒక్క సమస్య కూడా .. మనలోంచి ఒకానొక ప్రశ్నను ఉదయింపజేస్తుంది ! ఆ ప్రశ్నే .. మన సమస్యకు కావాల్సిన సమాధానాన్ని కూడా వెతికిపెడుతుంది ! అందుకే .. సమస్యలు వచ్చినప్పుడల్లా మన మనస్సులోంచి ఎన్నెన్నో ప్రశ్నలు ఉద్భవిస్తూ వుంటాయి.*

*ఎప్పుడైతే వాటన్నింటికీ మన అంతరంగంలోంచే మనకు సరియైన సమాధానాలు లభిస్తాయో .. అప్పుడు మన చిత్తం శాంతించి .. మనం మానసిక కల్లోలం నుంచి బయటపడి .. ఆ సమస్య యొక్క పరిష్కారం వైపుగా మన భౌతికపరమైన చర్యలు మొదలుపెడతాం. ఇలా సమాధానపడిన మనస్సుతో భౌతికపరమైన చర్యలను సమర్ధవంతంగా చేపట్టినప్పుడు ఆ సమస్యకు సంపూర్ణమైన మరి అద్భుతమైన పరిష్కారం తప్పకుండా లభ్యమవుతుంది.*

*చిన్ని చిన్ని సమస్యలకు చిన్ని చిన్ని పరిష్కారాలూ .. మరి పెద్ద పెద్ద సమస్యలకు పెద్ద పెద్ద పరిష్కారాలూ అవసరమవుతాయి. చిన్న సమస్యల పరిష్కారానికి మనకు పెద్దగా ధైర్యం అవసరం లేకపోయినా .. పెద్ద పెద్ద సమస్యలను మాత్రం తగిన ధైర్యస్థైర్యాలతో ఎదుర్కోవాలి. చిన్న సమస్యల పరిష్కారానికి మనకు మామూలు భౌతికపరమైన చర్యలు చాలు కానీ .. పెద్ద సమస్యల పరిష్కారానికి మాత్రం ” ఆత్మశక్తి ” చాలా, చాలా అవసరం.*

*ఒకవేళ మనకంటే ఎక్కువ ఆత్మశక్తిని కలిగివున్న సరియైన గురువు కనుక మనకు దొరికితే .. పెద్ద సమస్యలకే కాకుండా అతి చిన్న సమస్యల పరిష్కారానికి కూడా వారి నుంచి మనం సహకారాన్ని కోరవచ్చు.*

*అయితే .. ఇక్కడ అసలు “సమస్య” ఏమిటంటే .. ఎవ్వరికీ సరియైన గురువు దొరకకపోవడం. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో మనం బయట ఎవరిని పడితే వాళ్ళనే “గురువులు” అని నమ్మకుండా .. ధ్యానం ద్వారా శాస్త్రీయ పద్ధతిలో మన అంతరంగంలోకి ప్రయాణం చేస్తూ మన “అంతరాత్మ” నే మనకు గురువుగా ఎంచుకోవాలి. నిరంతర ధ్యానసాధన ద్వారా ఆ “అంతరాత్మ” తోనే అనుసంధానం చెందుతూ .. ఆ “అంతరాత్మ” నుంచే సందేశాలు అందుకోవాలి. ఒకవేళ అదృష్టం బాగుండి మన అంతరాత్మకు ప్రతిరూపమైన గురువు కనుక బాహ్యప్రపంచంలో లభిస్తే .. ఇక మనకు మన అంతరాత్మతో ఎక్కువుగా పనిలేదు.*

*ఇలా లభించిన అంతరాత్మకు ప్రతిరూపమైన అసలు గురువు మన అంతరాత్మ యొక్క బాహ్యరూపమే కాబట్టి అలాంటి గురువు బోధనలను మనకు అర్థం అయినా, కాకపోయినా సరే మారు పలుకకుండా అమలు పరచాల్సిందే !! ఎందుకంటే గురువు ముఖతః వచ్చేవన్నీ మన అంతరాత్మ ప్రబోధాలే కనుక ఇలాంటి గురువు బోధనలు మనకు .. మన సత్వర జ్ఞానోదయానికీ, మన సత్వర సమాధానాలకూ .. మరి మన సత్వర పరిష్కారాలకూ .. దగ్గరి దారిగా నిలుస్తాయి.*

*” ధ్యానం ” మనలో వున్న ఆత్మశక్తిని పెంచి సమస్యలను ఎదుర్కోగలిగే సామర్ధ్యాన్నీ, మరి బుద్ధికుశలతతో మన సమస్యలను సావధానంగా ఎదుర్కోగలిగే స్థిరచిత్తాన్ని ఇస్తుంది. తద్వారా మనం మనకు అందుబాటులో వున్న భౌతికపరమైన వనరులతో పాటుగా మన ఆత్మకు వున్నటువంటి అనంత శక్తులను కూడా కూడగలుపుకుని .. సమస్యను మరింత సమర్ధవంతంగా ఎదుర్కోగలుగుతాం. అప్పుడు గెలుపు, ఓటముల సంగతి ప్రక్కకు పెడితే .. ” అసలు సమస్య పట్ల మనం ఏ మేరకు అవగాహన సాధించాం ” అన్నదాని మీదే ” ఫలితం ” అన్నది ఆధారపడి వుంటుంది.*

*ఇక్కడ తెలుసుకోవలసిన పరమసత్యం ఏమిటంటే .. ఏ గురువు కూడా వేరే ఎవరి సమస్యనూ తన భుజాన వేసుకోడు. కాకపోతే .. ఆ సమస్యల పట్ల శాస్త్రీయదృక్పథాన్ని ఏర్పరుస్తాడు ; కావలసిన ధైర్యం చెబుతాడు ! సమస్యలు మాత్రం ఎవరికి వారే పరిష్కరించుకోవాలి. ఎందుకంటే మన సమస్యల యుద్ధాల మనకు ఉన్నట్లే .. గురువులకు కూడా వారి సమస్యల యుద్ధాలు వారి పరిధిమేరకు వారికి వుంటాయి. ” జీవితం ” అంటేనే ” ఒక క్రీడారంగంలాంటి యుద్ధరంగం ! ” దానికి ఆది, అంతం లేవు ! అక్కడ ఎవరికి వారు ఒంటరిగా పోరాడాల్సిందే !*

*ఆత్మజ్ఞానం లేనివాళ్ళకు ” జీవితం ” అంటే ” ఒక దుర్భరమైన ..భీభత్సమైన యుద్ధం ” లా కనిపిస్తుంది, మరి అదే జీవితం ఒకానొక ఆత్మజ్ఞానికి ” తన ఆత్మోన్నతి కోసం ఆడే ఒక మహాక్రీడ ” లా అనిపిస్తుంది. ఎప్పుడైతే మనం పూర్తిగా ప్రాపంచికంలో పడిపోయి ఆత్మజ్ఞాన లోపంతో కూడి ” జీవితం అన్నది ఒక ఆట మాత్రమే ” అన్న సంగతి మరచిపోతామో .. ఇక అప్పుడు మనకు ఎదురయ్యే సమస్యలూ సవాళ్ళు మనకంటే పెద్దవిగా మారి .. భూతాల్లా మనల్ని భయపెడతాయి. అదే మనం సరియైన ఆధ్యాత్మిక బాటలో పయనిస్తూ ఆత్మజ్ఞానప్రకాశకుల్లా మారి సమస్యల పట్ల సరియైన అవగాహనతో మెలగితే .. ఇక సమస్యలు అన్నీ మనకంటే చిన్న చిన్నగా మారిపోయి మరి వాటి పరిష్కారాలు సులభతరం అయిపోతాయి.*

*ఎవరైతే తమ అంతరాత్మకు ప్రతిరూపమైన గురువుతో కలిసి సదా వుంటారో వారు ఉన్నత స్థాయిలో వున్నట్లే !*

*మన అంతరాత్మకు ప్రతిరూపమైన సరియైన గురువు అంటే ఆనందము అనే కళను చక్కగా ఔపోసన పట్టిన

వాడు కాబట్టి మనందరం కూడా ఆ ఆనందము యొక్క మాధ్యమంగా వుందాం .. మరి మన శ్వాసరూపంలో ఉన్న మన” గురువు” తో కూడి మన సమస్యలను మనమే పరిష్కరించుకుందాం.*