త్వరగా బయటకు రా!

కంచి పరమాచార్యుల సేవలో తరించి, జన్మ ధన్యత పొందిన వారిలో శ్రీకంఠన్ ప్రముఖులు, ముఖ్యులు కూడా. మహాస్వామి వారు తప్ప వేరు ప్రపంచం లేదని బ్రతికిన శ్రీవారి సేవకుడు.
ఒకసారి పరమాచార్య స్వామివారు మఠంలో లేరు. కొద్ది దూరంలో ఉన్నారు. సాయింత్రం శ్రీకంఠన్ అత్యంత భక్తితో, సేవా భావంతో రుబ్బురోలులో పిండి రుబ్బుతూ ఉన్నారు. చేతులు పని చేస్తూ ఉన్నాయి కాని, మనస్సంతా మహాస్వామి వారి గురించిన ఆలోచనలే.
మఠం సేవకులొకరు గాభరాగా లోపలికి వచ్చి, ఆయాసంతో రొప్పుతూ, “చేస్తున్న పనిని వదిలి, వెంటనే బయటకు రమ్మని స్వామివారి ఆదేశం” అని తెలిపారు.
ఎందుకు ఇలాంటి ఆదేశాన్ని ఇచ్చారు, ఏమిటి విషయం అని శ్రీకంఠన్ ఎప్పుడూ ఆలోచించరు. పరుగుపరుగున వెంటనే మహాస్వామి వారి సమక్షానికి వచ్చేశారు. శ్రీకంఠన్ బయటకు వచ్చిన కొద్ది క్షణాల్లోనే అతను కూర్చున్న భవనం యొక్క పైకప్పు కూలసాగింది. శ్రీకంఠన్ గనక బయటకు వచ్చి ఉండకపోయిఉంటే పైకప్పు శిథిలాల్లో అతను చిక్కుకునిపోయేవారు.
దీర్ఘ దృష్టి గల పరమాచార్యుల కారుణ్య హృదయం వల్ల శ్రీకంఠన్ ఆపద నుండి తప్పించుకున్నారు. జరగబోయేది ఏమిటో ఆ సర్వేశ్వరునికి ఎలా తెలుసనీ శ్రీకంఠన్ అడగగలడా? కళ్ళ నీరు కారుతుండగా తన ప్రాణాలు కాపాడిన దేవునికి సాష్టాంగ వందనం చేసి, తన జీవితాన్ని మహాస్వామి వారి పాదాల చెంత వదిలేశాడు శ్రీకంఠన్. స్వామివారి అనుగ్రహంతో ఎన్నో ఏళ్ళు సేవ చేసి, చివరికి సన్యసించి మహాస్వామి వారిలో చేరుకున్నారు.
--- రా. వెంకటసామి, శక్తి వికటన్ ప్రచురణ
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।