తలపై భారం - కంట్లో నీరు

పండానైనల్లూర్లోని శ్రీ పందాడు నాయకి పశుపతినాథ స్వామి దేవాలయంలోని శ్రీ విష్ణు దుర్గా అమ్మవారి కంటికొనలలో నుండి నీరు స్రవించడం భక్తులందరూ ప్రత్యక్షంగా చూశారు. ఇది 1986 ఫెబ్రవరి 19న జరిగింది. వారు పరిగెత్తుకొచ్చి నాకు ఆ విషయం చెప్పగా నేను కూడా వెళ్ళి చూశాను. అమ్మవారి కళ్ళల్లో నుండి నీరు కారుతోంది. అమ్మవారిని అలా చూస్తున్న మా బాధను వర్ణించడానికి మాటలు చాలవు.
ఒక కన్నెపిల్లను దుర్గా స్వరూపంగా భావించి ఆమెకు పూజ చేయడానికి సిద్ధం చేశాను. ఆఅ కన్నిక దుర్గకు మంగళద్రవ్యాలు సమర్పించి, నవాక్షరి మంత్రజపం చేశాను. “తల్లీ ఏమిటి మా దోషం?” అని అమ్మవారిని అడిగాను. దుర్గా స్వరూపంగా ఉన్న ఆ కన్నెపిల్ల మాతో, “నాకు పచ్చని పట్టు లంగా కట్టుకున్న ఒక అమ్మవారి స్వరూపం కనపడి ‘నా భారం తొలగించండి’ అని అన్నదని” మాతో చెప్పింది. తరువాత మేము ప్రత్యేక అభిషేకము ఆరాధనలు చెయ్యడంతో విష్ణు దుర్గా అమ్మవారి కళ్ళ వెంట నీరు కారడం ఆగిపోయింది.
ఈ విషయాన్ని పరమాచార్య స్వామివారికి తెలిపి వారినుండి వివరణ ఏమిటో తెలుసుకోవాలని మేము కంచి బయలుదేరాము. మహాస్వామివారు మాకు ఇరవైఅయిదు లీటర్ల గంగాజలం ఇచ్చి, లక్ష ఆవృత్తుల నవాక్షరి మంత్రజపంతో ఆ నీటిని బలోపేతం చేసి విష్ణు దుర్గకు అభిషేకం చేసి నా వద్దకు రండి అని చెప్పారు. నాలుగునెలల తరువాత స్వామివారు చెప్పినట్టుగా చేసి కాంచీపురం దగ్గర్లోని ఒరిరుక్కైలో మకాం చేస్తున్న పరమాచార్య స్వామివారి దర్శనానికి వచ్చాము. అమ్మవారి కళ్ళల్ళో నుండి వస్తున్న నీరు ఆగిపోయిందని స్వామివారికి నివేదించాను. స్వామివారు కొద్దిసేపు ఆలోచించి, “అమ్మవారికి పైకప్పు తగులుతోందా?” అని నన్ను అడిగారు.
ప్రతిరోజూ పూజ చేస్తున్నా నేను ఆ విషయం అంతగా ఎప్పుడూ గమనించలేదు. అందుకే నేను స్వామివారితో, “నేను అంతగా గమనించలేదు. వెళ్ళి చూసివచ్చి చెబుతాను” అని చెప్పాను. నేను తిరిగివెళ్ళి ఒక తాడుని అమ్మవారి తలకు పైకప్పుకు మధ్య ఉంచి చూడగా, స్వామివారు అనుమానపడ్డట్టు ఆ పైకప్పు అమ్మవారి తలను తాకుతోంది. కాస్త పరిశీలించగా గోడలో పడిన ఒక చీలిక వల్ల పైకప్పు కొద్దిగా వాలి అది అమ్మవారి తలను తాకుతోంది. మేము మరలా స్వామివారిని కలిసి ఈ విషయం చెప్పాము.
దుర్గా అమ్మవారి విగ్రహాన్ని బయటకు తీసి, పైకప్పును కాస్త లోతుగా చేసి, అమ్మవారిని పీఠంపై పునః ప్రతిష్టించి కుంబాభిషేకం నిర్వహించండని స్వామివారు ఆదేశించారు. స్వామివారి అదేశం ప్రకారం మార్పులుచేసి 1987లో తై మాసంలో కుంబాభిషేకం నిర్వహించాము. ప్రసాదం తీసుకొని స్వామివారి దర్శనానికి వచ్చాము. మహాస్వామివారు విశేషాలన్నిటిని తెలుసుకొని ప్రసాదాన్ని స్వీకరించారు. “మీ ఊరి ప్రజలు చాలా అదృష్టవంతులు. అమ్మవారు అలా కన్నీరు కార్చడం మీకందరకూ అనుగ్రహాన్ని ప్రసాదించడానికే” అని స్వామివారు మాతో అన్నారు. మేము అలా స్వామివారితో మాట్లాడుతూ ఉండగా ఒక గుజరాతీ భక్తుడు స్వామివారి దర్శనానికి వచ్చాడు. స్వామివారు తనితో కాసేపు మాట్లాడారు. తరువాత మావైపు చూసి, “మీరు ఇక్కడికి రావడానికి మీకు ఎంత ఖర్చు అవుతుంది?” అని అడిగారు.
“దాదాపు మూడువందల రూపాయలు అవుతుంది”
స్వామివారు ఆ గుజరాతీ భక్తుణ్ణి మాకు మూడువందల రూపాయలు ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. అతను స్వామివారి ఆదేశాన్ని శిరసా వహించి పరమసంతోషంతో మాకు ఇచ్చాడు. భవంతుణ్ణి తాకి పూజించే శివాచార్యులంటే పరమాచార్య స్వామివారికి అపారమైన కరుణ. మా బాగోగుల కోసం వారు నిత్యమూ శ్రమించేవారు.
పరమాచార్య స్వామివారు కేవలం విష్ణు దుర్గ అమ్మవారి తలపైన ఉన్న భారాన్నే కాదు మా గుండెల్లో ఉన్న భారాన్ని కూడా తొలగించారు. కేవలం ఆ చంద్రశేఖరుడు తప్ప ఎంకెవ్వరు ఇలాంటి ఆదేశం ఇవ్వగలరు?
--- శివశ్రీ జగదీశ శివాచార్య, పండానైనల్లూర్. మహా పెరియవళ్ - దరిశన అనుభవంగళ్ 2