గుజరాతీ బ్రాహ్మణుడు – నిప్పుల కొలిమి

చాలా ఏళ్ల క్రితం తమిళ సంవత్సరాది అయిన చిత్తిరై నెల మొదటి రోజున శ్రీమఠంలో చాలా రద్దీగా ఉంది. మెల్లిగా కదులుతున్న ఆ వరుసలో మహాస్వామి వారి దర్శనార్థమై ఒక పదహారు సంవత్సరాల పిల్లవాడు కూడా ఉన్నాడు. దాదాపు పది గంటల సమయంలో ఆ అబ్బాయి మహాస్వామి వారు కూర్చున్న వేదిక వద్దకు వచ్చాడు. స్వామి వారు అతన్ని చూసారు. తన అష్ట అంగములు నేలకు తగిలేట్టు స్వామి వారిని సాష్టాంగం చేసాడు కాని ఎంతసేపటికి పైకి లేవలేదు. కొద్దిసేపటి తరువాత మహాస్వామి వారే లెమ్మన్నారు.

అతను లేచినిలబడి తన రెండు చేతులు పైకెత్తి నమస్కారం చేసాడు. కలిగిన అనుభూతి ఇంకా వీడలేదు. కళ్ళ నుండి నీరు కారుతూ ఉంది. స్వామి వారు దగ్గరికి రమ్మన్నారు. అతను అలాగే స్వామి వారి వద్దకు వెళ్ళాడు.

స్వామి వారు అతన్ని “బాబూ నువ్వు ఎవరు? నీ పేరేమి? ఎక్కడినుండి వస్తున్నావు?” అని అడిగారు. ఆ అబ్బాయి చాలా వినయంతో, తన కుడి అరచేతిని నోటి వద్దకు తెచ్చి, “స్వామి నా పేరు బాలకృష్ణ జోషి. నేను మద్రాసు నుండి వచ్చిన గుజరాతీ బ్రాహ్మణున్ని. నా స్వస్థలం గుజరాత్” అని చెప్పాడు.

”మద్రాసులో ఏ ప్రాంతం?”

“హనుమంతనారాయణన్ కోయిల్ వీధి స్వామి” జోషి సమాధానమిచ్చాడు.

”ఎంతదాకా చదువుకున్నావు?”

“ఎనిమిది దాకా పెరియవ” చిన్న స్వరంతో చెప్పాడు.

”సరే!! ఈ రోజు సంవత్సరాది కావున ఇక్కడ ఉన్న అన్ని దేవాలయాలలో స్వామి దర్శనం చేసుకోవడానికి వచ్చావు కదూ” అని అడిగారు.

”అది కాదు పెరియవ. నేను పెరియవ దర్శనం చేసుకోవడానికి వచ్చాను”

వెంటనే మహాస్వామి వారు “అపచారం అపచారం నువ్వు అలా చెప్పకూడదు. మనం వేరే ప్రదేశం వెళ్ళినప్పుడు అక్కడున్న శివాలయములు, విష్ణ్వాలయములు, అమ్మవారి ఆలయములు దర్శించుకోవాలి. నేను కూడా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మొదట దేవాలయ దర్శనం చేసిన తరువాతనే ఏపనైనా అర్థమైందా?” అని స్వామి వారు నవ్వారు.

”ఇప్పుడు అర్థమైంది పెరియవ” జోషి అణుకువగా చెప్పాడు. ”మంచిది. అచార్యులు ప్రసాదం ఇచ్చిన తరువాత నువ్వు అన్ని దేవాలయాలను చూసి మద్రాసు బస్సు ఎక్కాలి. తెలిసిందా?” అని స్వామి వారు చెప్పారు

కొద్దిగా ధైర్యం తెచ్చుకున్న బాలకృష్ణ జోషి, “నాకు బాగా అర్థమైంది పెరియవ. మీ ఆజ్ఞ ప్రకారం నేను అన్ని దేవాలయాలను చూసిన తరువాత మీ అనుగ్రహం కోసం మఠానికి వస్తాను” అని అన్నాడు.

పరమాచార్య స్వామి వారు నవ్వుతూ, “అదే అదే నేణు చెప్తున్నది. ఇప్పుడే నీకు ప్రసాదం ఇస్తాను. మళ్ళా ఇక్కడికి రావడం ఎందుకు? ఓహో దేవాఅలయ దర్శనానంతరం మఠంలో భోజనం చేసి వెళ్తావా?మంచిది మంచిది అలాగే” అని స్వామి వారు తమ సమ్మతిని తెలిపారు.

జోషి కొద్దిగా సొంకోచిస్తూ నిలబడ్డాడు. అతని కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి.
“ఏమిటి విషయం?” అని స్వామి వారు ప్రేమతో అడిగారు. జోషి కళ్ళు తుడుచుకుంటూ “నేను ఇక్కడ కొద్దికాలం ఉండాలనుకుంటున్నాను. అందుకని...”
అతను ముగించేలోపలే స్వామి వారు అడ్డుపడుతూ,

“ఇక్కడ అంటే? నాకు అర్థం కాలేదు”

“ఇక్కడే మఠంలో పెరియవ” అని వినయంతో చెప్పాడు. ”ఏంటి మఠంలోనా? ఇది సన్యాసులు ఉండే చోటు. నీలాంటి యువకులకు ఇక్కడేం పని?” కొంచం దృఢమైన స్వరంతో “స్వామి దర్శనం చేసుకుని నీ చోటికి వెళ్ళిపో” అన్నారు.

జోషి కదలలేదు. స్వామి వారికి మళ్ళా సాష్టాంగం చేసి అసలు విషయం బయటపెట్టాడు. “పెరియవ అలా ఆజ్ఞాపించకండి. మఠంలో కొద్దికాలముండి మిమ్మల్ని సేవించుకోవాలని నా కోరిక”

పరమాచార్య స్వామి వారికి పరిస్థితి అర్థమైంది.

జోషి అమ్మయకపు మాటలు, అతని భక్తి తత్పరత మహాస్వామి వారిని ఆకర్శించాయి. కాని అది బయటపడనీయకుండా, “నన్ను సేవించడానికి ఇక్కడ చాల మంది యువకులు ఉన్నారు. చిన్న పిల్లాడివి నీకెందుకు ఇవన్నీ. మద్రాసుకు బయలుదేరు” అన్నారు.

జోషి అక్కడి నుండి వెళ్ళిపోయాడు కాని మఠం నుండి వెళ్ళిపోలేదు. అతను మఠంలోనే భోజనం చేసి, స్వామి వారు విశ్రాంతి తీసుకునే గది ముందు ఒక మూలన కూర్చున్నాడు. సాయింత్రం స్నానం తరువాత మహాస్వామి వారు బయటకు వచ్చి జోషిని చూసారు కాని ఏమి మాట్లాడక వెళ్ళిపోయారు.

నాలుగురోజులపాటు అవకాశం వచ్చినప్పుడల్లా స్వామివారి కనుచూపులో పడుతున్నాడు జోషి. నాలుగు రోజులు వైరాగ్య భక్తితో అక్కడే ఉండిపోయాడు. ఐదవ రోజు ఉదయం పరమాచార్య స్వామి వారు శ్రీ కామాక్షి అమ్మవారి దేవస్తానం పుష్కరిణిలో కాల స్నానానికి వెళ్ళారు. స్నానం ముగించి వస్తూ జోషిని చూసి, “నువ్వు మద్రాసుకు వెళ్ళలేదా?” అని అడిగారు.

”లేదు పెరియవ. నా సంకల్పం సిద్ధించేవరకు నేను వెళ్ళను” అని బదులిచ్చాడు.

”ఏమిటి నీ సంకల్పం?” అని తెలియనట్టు అడిగారు.

”కొద్దికాలం పాటు మీ పాద కమల చరణ సేవ చేసుకోవాలి” ఆశావహంగా బదులిచ్చాడు జోషి.

”అసాధ్యమైన సంకల్పం చేయరాదు” అని పరమాచార్య స్వమి వారు వెళ్ళిపోయారు.

జోషి పట్టు వీడలేదు. స్వామి వారి గది ముందు నిలబడ్డాడు. స్వామి వారు భక్తుల దర్శనార్థమై బయటకు వచ్చారు. ఆ కుర్రవాని వైరాగ్యానికి స్వామి హృదయం మెత్తబడింది. అతన్ని దగ్గరకు పిలిచారు.

”మీ తండ్రి గారిది ఉద్యోగమా లేక వ్యాపారమా?” అని అడిగారు.

”వ్యాపారం పెరియవా. వజ్రాల వ్యాపారి. వజ్రాలను కొనడం అమ్మడం” జోషి బదులిచ్చాడు.

”నీకు ఉన్న స్వభావం చేత నీవు పెద్ద వ్యాపారి అవుతావు. అప్పుడు నువ్వు మంచి నమ్మకమైన నిజాఅయితీపరుడవైన వజ్రాల వ్యాపారి కావాలి. సరే నీ ఇష్ట ప్రకారం ఇక్కడున్న అబ్బాయిలతో కలిసి కొద్దికాలం నన్ను సేవించుకో” అని చివరికి తమ అమోదాన్ని తెలియజేసారు.

జోషి అక్కడున్న నలుగురైదుగురు యువకులతో స్వామి వారి సేవలో చేరాడు. స్వామి వారి దర్శనం, వారు చెప్పిన పనులు చేయడంతో రెండు రోజులు గడిచిపోయాయి. ఆ రెండు రోజులు పరమాచార్య స్వామి వారు నిద్రపోయే గదిలోనే మిగిలిన యువకులతో పాటు జోషి కూడా నిద్రపోయేవాడు. అది తనకు కలిగిన పరమ అదృష్టంగా భావించేవాడు.

మూడవ రోజు రాత్రి నిద్రపోయే ముందు స్వామి వారు జోషిని పిలిచి, “బాలకృష్ణ జోషి ఇప్పటి నుండి నువ్వు ఒక పని చేయాలి. వీరిలాగే నువ్వు కూడా నాతో ఉండు పగలంతా నా సేవ చేసుకో. కాని రాత్రి పూట నువ్వు ఇక్కడ పడుకోవద్దు” అన్నారు.

జోషి వెంటనే స్వామి వారి మాటలకు అడ్డు పడుతూ, “నా మీద దయ ఉంచి స్వామి వారు అలా ఆజ్ఞాపించవలదు. నేను కూడా ఈ అబ్బయిలతో పాటు ఇక్కడే పడుకునే వరం ఇవ్వండి” అని ఆత్రుతగా అడిగాడు.

”దీని వెనుక ఒక కారణం ఉంది” స్వామి వారు దృఢమైన స్వరంతో అన్నారు.“నువ్వు నా మాట వినాలి”

జోషి స్థాణువైపోయాడు. “అలాగే పెరియవ. మిరు ఏమి చెప్తే అది చేస్తాను”.

పరమాచార్య స్వామి వారు నవ్వి, “అలా చెప్పు. రాత్రి పూట నువ్వు వంటగదిలోకి వెళ్ళు. అక్కడ కట్టెల పొయ్యి వద్ద ఒక చెక్కబల్ల ఉంటుంది. ఆ బల్ల పైన హాయిగా నిద్రపోయి, ఉదయమే లేచి స్నానాదులు ముగించుకొని ఇక్కడకు రా. ఏంటి అర్థమైందా?” అని అన్నారు.

జోషి మరల ఏమి మాట్లాడలేదు. కళ్ళ నీళ్ళు తుడుచుకుంటూ, “మీ ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటాను పెరియవ” అని వెళ్ళిపోయాడు. అక్కడున్న ఇతర యువకులు ఇదంతా చూసి నవ్వుకుంటున్నారు.

మహాస్వామి వారు ఎందుకు తనని ఒంటరిగా వంటగదిలో కొలిమి దగ్గర పడుకోమన్నారో జోషికి అర్థం కావటం లేదు. జోషి బయటకు రాగానే అక్కడున్న కుర్రవాడితో తనకు ఎప్పుడైనా ఇలా పడుకోమని చెప్పారేమో అని అడిగాడు. అతను లేదు ఎవరికి ఇలా చెప్పలేదన్నాడు.
జోషి ఇది అవమానంగా భావించాడు.

అప్పుడు రాత్రి పదిగంటలైంది. ఏడుస్తూ, నిర్మానుష్యంగా ఉన్న వంటగదిలోకి వెళ్ళి కట్టెల పొయ్యి దగ్గర ఉన్న చెక్కబల్ల పైన పడుకున్నాడు. ఆ రాత్రి అతను ఏమి తినలేదు. మనసంతా ఆందోళనగా ఉండి బాధ, ఏడుపు వల్ల గొంతు తడారిపోయింది. చాలాసేపు నిద్రపట్టలేదు. ఎప్పుడో మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు.

తెలతెలవారుతుండగా మఠం మేల్కొంది. వెంటనే మఠంలో వేదపారాయణం భజనలు మొదలయ్యాయి. జోషి లేచి స్నాదులు ముగించుకుని, శ్రీ కామాక్షి అమ్మవారి దేవస్థానానికి వెళ్ళి అక్కడ కూర్చుండి పోయాడు. ఆరోజు స్వామివారి సేవకు వెళ్ళాలనిపించలేదు.

మద్యాహ్నం మఠానికి వచ్చి భోజనం చేసి మళ్ళా అమ్మవారి ఆలయానికి వెళ్ళాడు. రాత్రి వచ్చి వంటగదిలోని నిప్పుల కొలిమి దగ్గర పడుకున్నాడు. స్వామివారి దగ్గరికి అసలు వెళ్ళలేదు.

రెండు రోజులు ఇలాగే గడిచిపోయాయి. మూడవరోజు ఉదయం స్వామివారు ఒక సేవకుణ్ణి పిలిచి కంగారుగా అతణ్ణి అడిగారు “నాలుగు రోజుల క్రితం బాలకృష్ణ జోషి అనే కుర్రవాడు నా సేవకై ఇక్కడికి వచ్చాడు. రెండు రోజులుగా అతను కనపడ్డం లేదు. నాకు చెప్పకుండా వెళ్ళిపోయాడా?”

ఆ సేవకుడు సంకోచిస్తూ, “లేదు పెరియవ అతను మఠంలోనే ఉన్నాడు” అని చెప్పాడు.

”మరి రెండు రోజులుగా ఎందుకు నా వద్దకు రావడం లేదు?”

“తెలియదు పెరియవ”

అంతలో మరొక సేవకుడు రావడంతో అతణ్ణి ఆ గుజరాతీ అబ్బాయి గురించి అడిగారు. అతనికి కూడా ఏమి తెలియదన్నాడు. ”సరే. జోషి ఎక్కడున్నాడొ వెతికి వెంటనే నేను రమ్మన్నానని తీసుకురండి” అని ఆజ్ఞాపించి వారి గదిలోకి వెళ్ళిపోయారు.

జోషి మహాస్వామి వారిముందు నిలబడ్డాడు. ”రా వత్సా! ఎందుకు రెండు రోజులుగా కనిపించటం లేదు. నీ అరోగ్యం బాఉన్నది కదా?” పరమాచార్యస్వామి వారు అపారమైన వాత్సల్యంతో అడిగారు.

జోషి మౌనంగా ఉన్నాడు.

”ఏదైనా దిగులా? లేక నా పైన కోపమా?” స్వామి వారు చిన్నపిల్లాడిలా అడిగారు.

జోషి చిన్నగా నోరు విప్పాడు. “అపచారం. అపచారం. కోపం ఏమి లేదు పెరియవ. నా మనస్సుకు చిన్న క్లేశం అంతే”

స్వామి వారు జోషి వంక ఆశ్చర్యంగా చూస్తూ, “బాధ. . . నా వల్ల?”. జోషి మౌనంగా ఉన్నాడు. స్వామి వారు వదల లేదు.

“రా ఇటు. ఇప్పుడు చెప్పు. నేను కూడా నీ బాధ ఏమిటో తెలుసుకోవాలి కదా?”
మహాస్వామి వారి ఒత్తిడి వల్ల జోషి నోరు తెరిచాడు. అక్కడున్న మిగిలిన యువకులు చేతులు కట్టుకుని నిలబడ్డారు. స్వామి వారికి సాష్టాంగం చేసి, తన కుడిచేతిని నోటికి అడ్డంగా పెట్టుకుని, జోషి మాట్లాడడం మొదలుపెట్టాడు.

”ఏమి లేదు పెరియవ. మొదటి రెండు రాత్రులు మీరు అందరి లాగే నన్ను కూడా మీ గదిలో పడుకోనిచ్చారు. నాకు చాలా ఆనందం వేసింది. హఠాత్తుగా నన్ను పిలిచి, వంటింట్లోని కట్టెల పొయ్యి వద్ద పడుకోమన్నారు. నేను గుజరాతీ బ్రాహ్మణుడను కావడం చేత ఇక్కడి వాణ్ణి కాకపోవడం చేత మీరు అలా ఆజ్ఞాపించారు అనే విషయం నన్ను కలచివేసింది. దయచెసి నన్ను క్షమించండి పెరియవ...” జోషి చిన్నపిల్లాడిలా గట్టిగా ఏడుస్తూ, స్వామి వారి పాదములపై పడ్డాడు.

మహాస్వామి వారు పరిస్థితి అర్థం చేసుకున్నారు. కొద్దిసేపు మౌనంగా ఉన్నారు. నిశబ్ధం రాజ్యమేలుతోంది అక్కడ. అతణ్ణి ఒక్కడే వదిలెయ్యమని ఇతర యువకులను పంపించారు.

జోషిని దగ్గరకు పిలిచి పుత్రవాత్సల్యంతో అపారమైన కరుణతో

“అడడా బాలకృష్ణ. . . నేను నిన్ను నిప్పుల కొలిమి వద్ద పడుకోమన్నది నీవు ఇలా అర్థం చేసుకున్నావా? నేను అటువంటి అలోచనలతో నీకు అలా చెప్పలేదు. నీవు చిన్న పిల్లవాడివి అందుకే నన్ను అపార్థం చేసుకున్నావు”. ఈ మాటలు చెప్పి స్వామి వారు జోషిని తన వద్ద కూచోమన్నారు. జోషి సంకోచించి కింద నేలమీద కూచున్నాడు.

స్వామి వారు వాత్సల్య పూరితమైన మాటలతో “నిన్ను వంటింట్లో కట్టెల పొయ్యి వద్ద ఉన్న చెక్క బల్లపై పడుకోమని చెప్పడంలో నాకు అలాంటి ఉద్దేశము లేదు. అందుకు కారణం ఒక్కటే. జోషి ఇక్కడ చూడు” స్వామి వారు వారి వస్త్రాన్ని తొడ భాగం కనపడేలా పైకెత్తారు. స్వామి వారి తెల్లటి చర్మంపై దోమ కాట్ల వల్ల ఏర్పడిన ఎర్రటి దద్దుర్లు.

“వత్సా జోషి! ఇవి రాత్రిపూట నేను పడుకున్నప్పుడు దోమకాటు వల్ల ఏర్పడినవి. నేను సన్యాసిని కాబట్టి తట్టుకోగలను. నువ్వు చిన్న పిల్లాడివి ఆ బాధను నీవు భరించలేవు. మొదటి రెండు రాత్రులు నువ్వు దోమల వల్ల ఇబ్బంది పడడం నేను గమనించాను.

నువ్వు నాలాగే తెల్లగా ఉన్నావు. కనీసం నువ్వైనా మంచి స్థలంలో పడుకోవాలని భావించి అందుకని నిన్ను అక్కడ పడుకోమన్నాను. అక్కడి వేడి వల్ల దోమలు ఉండవు. నీవు హాయిగా నిద్రపోవచ్చు కదా. నిన్ను అలా ఆజ్ఞాపించడానికి కారణం అదొక్కటే. కాని నువ్వు నా మాటలను అపార్థం చేసుకున్నావు” అని స్వామి వారు గట్టిగా నవ్వుతున్నారు.

జోషి గట్టిగా ఏడ్వడం మొదలుపెట్టాడు. ఏడుస్తూ, కనుల నీరు తుడుచుకుంటూ, వెక్కిళ్ళతో మాట తడబడగా “పెరియవ!!! దయచేసి నన్ను మన్నించానని చెప్పండి. మీ అవ్యాజమైన కరుణని అర్థం చేసుకోలేక నోటికివచ్చినట్టు మాట్లాడాను. నన్ను క్షమించండి” అంటూ సాగిలపడ్డాడు.

ఆ కరుణాస్వరూపులూ ప్రేమస్వరూపులు నవ్వుతూ, రెండు చేతులనూ పైకెత్తి జోషిని ఆశీర్వదించారు.

”జోషి నువ్వు భవిష్యత్తులో మంచి వజ్రాల వ్యాపారివి అవుతావు. న్యాయంగా ధనమార్జిస్తూ ధర్మంగా బ్రతుకు” అని స్వామి వారు మళ్ళా అశీర్వదించారు.

తరువాతి కాలంలో, బాలకృష్ణ జోషి మంచి దక్షత కలిగిన వ్యాపారవేత్తగా స్వామి వారి శిష్యుడుగా మెలిగాడు. స్వమి వారి తరువాత కొంత కాలానికి వారి పాదాలు చేరుకున్నాడు.

--- శ్రీ రమణి అణ్ణ, శక్తి వికటన్ ప్రచురణ

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।