పార్వతీ కళ్యాణము

ఒక పురాణకథను చదివేటప్పుడు అది మనకు ఏ విషయమును బోధ చేస్తోంది అనే విషయమును సమగ్రంగా పట్టుకునే ప్రయత్నం చేయకపోతే దానివలన ప్రయోజనం చాలా తక్కువగా ఉంటుంది. ఆ కథను చదవడం వలన మీరు ఎన్నో విషయములను తెలుసుకోవలసి ఉంటుంది. ఆ విషయములను తెలుసుకుని ప్రవర్తించడం చాలా ముఖ్యం.
ఒకానొక సమయంలో ప్రజాపతులందరూ సత్రయాగం చేస్తున్నారు. ఆ యాగమునకు ఎందఱో పెద్దలు వచ్చారు. ఆ వచ్చినవారిలో చతుర్ముఖ బ్రహ్మ, శంకరుడు కూడా ఉన్నారు. మహానుభావుడు శంకరుడు త్రిమూర్తులయందు ఒకడు. ఒకచోట ఆయనే త్రిమూర్తులుగా ఉన్నవాడు. కాబట్టి ఆయనకు ఆసనం వేసి కూర్చోబెట్టారు. సభలో ఎవరు వచ్చినపుడు ఎవరు నమస్కరించాలి అన్నది తెలిసి ఉంటే అది వినయం అవుతుంది. తెలియకపోతే అది అహంకారమునకు కారణం అవుతుంది. అందరూ ఆయనకు నమస్కరించారు. అందరూ కూర్చున్నారు. చక్కగా యాగం జరుగుతోంది. యాగమునకు వచ్చిన వాళ్ళలో బ్రహ్మగారు, అనేక యోగులు, ఋషులు, ఎందఱో మహానుభావులు ఉన్నారు. ఆ యాగమునకు వీళ్ళందరూ పరమభక్తితో వచ్చారు. వీరందరూ కూర్చుని ఉండగా ఒక్కసారి అనేక సూర్యులు వెలుగుతుంటే ఏలాగున ఉంటుందో అంత ప్రకాశంతో ఆ సభలోకి దక్షప్రజాపతి ప్రవేశించాడు. దక్షప్రజాపతికి ఒక గొప్పతనం ఉంది. ఆయన సాక్శాత్తు బ్రహ్మగారి బొటనవ్రేలినుండి పుట్టాడు. సృష్టిలో బ్రహ్మగారి తరువాతి స్థానంలో ప్రజాపతులుంటారు. ఇప్పుడు దక్షప్రజాపతిని ఒక విషయం ఆవహించింది. అది నేను సభలోకి వెళ్ళినప్పుడు అందరూ లేచి నిలబడి నాకు నమస్కారం చేయాలి అని భావించాడు. ఆయన లోపలి వచ్చేసరికి ఆ సభలో ఉన్నవారిలో ఇద్దరు తప్ప మిగిలిన వారందరూ లేచి నిలబడ్డారు. అలా లేచి నిలబడని వారిలో ఒకరు బ్రహ్మగారు, రెండవ వారు భర్గుడు. ఆయన అహంకారం తృప్తి పొందలేదు. శంకరుడు తన అల్లుడు. కాబట్టి లేవాలి అని అనుకున్నాడు. విపరీతమైన కోపం వచ్చింది. ఈ కోపమును కడుపులో పెట్టుకున్నాడు. అక్కడ సత్రయాగం జరుగుతోంది. తానొక ప్రజాపతినని, తానలా ప్రవర్తించకూడదనే విషయమును మర్చిపోయి శంకరుని దూషించడం ప్రారంభించాడు. ఈ మాటలను వింటూ శంకరుడు నవ్వుతూ కూర్చున్నాడు. దీనిని చూసి దక్షునికి ఇంక కోపం మింగుడు పడలేదు. నేను ఈ సభ నుంచి వెళ్ళిపోతున్నాను అని దక్షుడు అక్కడినుండి లేచి ఇంటికి వెళ్ళిపోయాడు.
అక్కడ మధ్యలో అనవసరంగా లేచి అరిచిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఒకరు నందీశ్వరుడు, రెండవవాడు భ్రుగువు. భ్రుగువుకు కొంచెం అహంకారం ఎక్కువ. అందుకే శ్రీమహావిష్ణువు ఆయన అరికాలు కన్ను నొక్కేశారు. వీళ్ళిద్దరూ ఇప్పుడు ఒకరు శివ సంబంధంగా, ఒకరు విష్ణుసంబంధంగా రెండు జట్లు కట్టారు. ఒకరిమీద ఒకరు బురదజల్లుకున్నారు. దీనిని చూస్తూ నవ్వుతూ కూర్చున్న వారు బ్రహ్మ, శంకరుడు. పిల్లవాడి అజ్ఞానమును తండ్రి మన్నించినట్లు వాళ్ళు వీరి అజ్ఞానమును మన్నించి నవ్వుతూ ఊరుకున్నారు. ఇప్పుడు దక్షుడు శంకరుడిని అవమానించాలి అనుకుని అందుకుగాను నిరీశ్వరయాగం చేయాలని సంకల్పించుకున్నాడు. ఆ యాగమునకు అందరినీ పిలిచాడు. అందరూ ఆ యాగమునకు బయలుదేరి వెళుతున్నారు. వాళ్ళందరినీ పలకరించి మర్యాదలు చేస్తున్నాడు దక్షుడు.
కైలాసపర్వతం మీద అంతఃపురంలో సతీదేవి నిలబడి ఉంది. పైనుండి విమానములు వెళ్ళిపోతున్నాయి. ఏదో పెద్ద ఉత్సవమునకు వెళ్తున్నారని తెలిసిపోతోంది. ఆవిడని వదిలిపెట్టి మిగిలిన వారందరికీ దక్షుడు ఆహ్వానములు పంపాడు. ఇది అమ్మవారికి ఖేదకారణం అయింది. ఆవిడ ఆవేదనను నారదుడు గమనించి సతీదేవి వద్దకు వచ్చి ‘తల్లీ, నీకు తెలియని విషయం కాదు. కానీ చెప్పకపోతే నాది దోషం అవుతుంది. నీ జనకుడయిన దక్షప్రజాపతి ఈవేళ ఒక యాగం చేస్తున్నాడు. ఆయన మదము చేత అంధుడై ఎవరికి గౌరవం ఇవ్వాలో తెలుసుకోలేని బ్రతుకు బ్రతుకుతున్నాడు. దక్షుడు చాలా పెద్ద తప్పు చేశాడు’ అని చెప్పాడు.
నారదుని మాటలు విన్న సతీదేవి ఏమీ మాట్లాడలేదు. నేనేమి చేయాలి? అని ఆలోచించింది. శంభునియందు ఏ దోషమూ లేదు. అందువలన తన తండ్రి చేసిన దుష్కృత్యమును తాను పరిష్కరించాలని భావించింది. అమ్మవారు బయలుదేరి శంకరుడి దగ్గరకు వెళ్ళి ‘మహానుభావా, శంకరా, దక్షుడు మర్యాదాతిక్రమణం చేశాడు. మీరులేని యాగం చేస్తున్నాడు. నాథా, ఈ లోకమునకంతటికీ బుద్ధి చెప్పాలి. దక్షుడికి బుద్ధి చెప్పవలసిన వాళ్ళు ఆయనకు బుద్ధి చెప్పడం మానేసి ఆయన చేస్తున్న యాగమునకు వెళ్ళారు. వాళ్ళకి శిక్ష వేయడానికి శక్తి రూపంగా నేను వెడుతున్నాను అని అనుకుని ‘నా నాథుడవయిన నిన్ను పిలవలేదు. కాబట్టి ఆ యాగం జరగడానికి వీలు లేదు. నాకు కూడా మీతో కలిసి వెళ్లాలని ఉన్నది దయచేసి నా కోర్కె తీర్చవలసింది. ఆ యాగమునకు నా చెల్లెళ్ళు అందరూ వారి భర్తలతో కలిసి వెళ్ళి ఉంటారు. ఇప్పుడు మనము ఆ యాగమునకు వెడితే ఒకసారి అందరినీ చూసినట్లు ఉంటుంది. నాకు చాలా సంతోషంగా ఉంటుంది. కాబట్టి మీరు కూడా రారా’ అని అడిగింది. మనలను పిలవలేదు దేవీ, అల్లుడిని పిలవాలిగా మరి నన్ను ఆహ్వానించ లేదుగా పిలవని చోటికి నేను వెళ్ళవచ్చునా అది దోషం అవుతుంది కదా అని అంటారేమో తండ్రిగారింటికి పిలవకపోయినా వెళ్ళవచ్చుఅన్నది.

అపుడు శంకరుడు ఒక చిరునవ్వు నవ్వి ‘దేవీ, పిలవకపోయినా వెళ్ళవచ్చుననునది పరమధర్మము. హఠాత్తుగా శుభకార్యం జరుగుతూ పిలవలేకపోతే వెళ్ళవచ్చు. కానీ మీ నాన్న కావాలనే మనలను పిలవలేదు. నీ ఆప్యాయతను వాళ్ళు పట్టించుకోరు. సజ్జనుడు అయినవాడు ప్రేమతో సజ్జనుడిగా ప్రవర్తించినా దుర్జనుడయినవాడు ఆ ప్రేమను చూడలేడు. వాడి కడుపు మంటతోనే ఉంటుంది. వాడు అవమానించదానికే ప్రయత్నిస్తాడు. కాబట్టి నీకొక విషయం చెప్తాను బాగా విను. బ్రహ్మగారు సత్రయాగం చేసినప్పుడు జరిగిన విషయం చెప్పాడు. అది ఇవాళ ఈ స్థితికి వెళ్ళింది. ఇపుడు నీతండ్రి కక్షమీద ఉన్నాడు. నీ మనస్సు ఖేదపడేటట్లు మాట్లాడతాడు. కాబట్టి నిన్ను వెళ్ళవద్దనే చెప్తాను. అన్నాడు.
అపుడు ఆవిడ నేను వెళ్ళాలనుకుంటున్నాను అన్నది. శంకరుడు తప్పకుండా వెళ్ళిరా అన్నాడు. ఇప్పుడు ఆ తల్లి భర్త మాట కాదని వెళ్ళవలసి వస్తోంది అని కన్నుల నీరు కారుస్తూ గబగబా అక్కడినుండి బయలుదేరింది. ఈమె అలా వెళ్ళిపోతుంటే ప్రమథగణములు చూడలేకపోయాయి. నందీశ్వరుని తీసుకువెళ్ళి ముందు పెట్టి కొన్ని కోట్ల ప్రమథగణములు ప్రక్కన నిలబడి ఘంటారావములు చేస్తూ వేణు నాదములు చేస్తూ జయహో జయహో అంటూ అందరూ కలిసి మంగళప్రదంగా దక్షయజ్ఞమునకు బయలుదేరారు. విమానం దిగి అమ్మవారు యజ్ఞశాలలోకి ప్రవేశించింది. అక్కడికి వచ్చిన సతీదేవిని తల్లి, సోదరులు తప్ప మిగిలిన వారెవ్వరూ పలకరించలేదు. ముఖములు ప్రక్కకి తిప్పుకున్నారు. సతీదేవి చాలా అవమానమును పొందింది. సభలో అంతమంది పెద్దలు ఉన్నారు. ఆవిడ లేకుండా అసలు యజ్ఞం లేదు. అటువంటి తల్లి ఈవేళ యజ్ఞమునకు బయలుదేరి వస్తే ఆమెను పలకరించే వాడు కరువయిపోయాడు. దానితో ఆవిడ కన్నులవెంట భాష్పదారాలు కారాయి. చాలా అవమానం పొందినదై తండ్రివంక చూసింది. తండ్రి ఈమెను జుగుప్సతో చూడరాని వ్యక్తిని చూసినట్లు అసలు పిలవని దానివి ఈ సభలోనికి ఎందుకు వచ్చావు అన్నట్లు చూశాడు. తల్లి ఆగ్రహం చెందింది. వెంటనే ఒకమాట అంది ‘ఏమయ్యా, పరమశివుడు నీకు పెద్దల్లుడు, లోకమంతటికీ పూజనీయుడు. మహానుభావుడు. మహాత్యాగి. ఒకరికి ఉపకారం చేయడమే తప్ప ఒకరి దగ్గర ఏదీ పుచ్చుకోవాలనే కోరిక లేనివాడు. జగత్తుకు తండ్రి. అటువంటి వాడి పట్ల నీవు నిరాదరణతో ప్రవర్తించి ఆయనను ఆహ్వానించకుండా నిరీశ్వర యాగమని, శివునికి హవిస్సు ఇవ్వనని, ఇవ్వకపోతే ఏమి చేయగలడని వెలి వేస్తున్నట్లుగా ప్రవర్తించావు. నీ పాపం ఊరికే పోతుంది అనుకుంటున్నావా? ‘శివ’ అన్న నామమును పైకి పలికినా మనసులో అనుకున్నా సమస్త జీవుల పాపములు పోతాయి. ఆయన పేరే అంత గొప్పది. అటువంటి ఆయనను నువ్వు ద్వేషిస్తున్నావు. ఎవడు శివుని ద్వేషిస్తున్నాడో వాడు మంగళమును ద్వేషించినట్లు. కాబట్టి నీకు అమంగళములు కలుగుతాయి తప్ప మంగళములు కలుగవు. నీకు పతనము తప్ప వేరొకటి లేదు. ఎటువంటి కోరిక ఉన్న వాడయినా ఆ పరమశివుని పాదములకు నమస్కరించినంత మాత్రం చేత అతని కోరికలు తీరతాయి. ఎవరు వస్తే కోరికలు తీరతాయో వాడిని రావద్దన్నావు. అది నిరీశ్వర యాగమే కావచ్చు. కాబత్ట్ ఆ కోరిక కూడా నీకు తీరడానికి వీలులేదు. నీవు మరింత పాపము చేసిన వాడవు అయ్యావు. త్రిమూర్తులలో ఒకరైన పరమశివుని విస్మరించావు. పరమ పవిత్రమయిన శంకరుని పట్టుకుని అనరాని మాటలు అన్నావు. దీనికి శాస్త్రం ఒక్కటే చేయమని చెప్తోంది.
ఎవడు పరమశివుని నిరాధారంగా, నిష్కారణంగా, పక్షపాత బుద్ధితో దూషిస్తున్నాడో వాడి నాలుక కోసేయాలి. అలా కోయలేక పోతే వాడు వెంటనే కర్ణ రంధ్రములను మూసుకుని అక్కడినుండి దూరంగా వెళ్ళిపోవాలి. ఆ పాపమును పంచుకోకూడదు. జగత్తుకి తండ్రి అయిన శంకరుడిని నీవు నిందచేశావు. అటువంటి నింద చేసినవాడి కూతురన్న పేరు నాకీ శరీరం ఉన్నంతకాలం ఉంటింది. నేను ఎక్కడ కనపడినా నన్ను దాక్షాయణీ అంటారు. నీ సంబంధం గుర్తు వచ్చేటట్లుగా నన్ను దాక్షాయణీ అని పిలిపించుకోవడం నాకు ఇష్టం లేదు. నువ్వు ఆ బాధను అనుభవించాలి. పరమ ద్రోహివి, పాపివి, శంకర ద్వేశివి, శివనింద చేసిన వాడివి అయిన నీ కడుపున పుట్టిన ఈ శరీరంతో ఉండడాన్ని నేనిక అంగీకరించను. కాబట్టి ఈ శరీరమును అగ్నిహోత్రములో వదిలిపెట్టేస్తాను’. అన్నిటికన్నా నా బాధ ఏమిటో తెలుసా? నా భర్త పరమజ్ఞాని. మహోదారుడు. ఇప్పుడు నీవు ఇంత అవమానం చేస్తే నేను వెనక్కి వెళ్ళిపోతే నా భర్త నన్ను ఏమీ అనడు. నా కంట కన్నీరు కారుతుందేమోనని నన్ను ఏమీ అడగడు. నన్ను ఓదార్చడానికి తన తొడమీద కూర్చోబెట్టుకుంటాడు. అలా కూర్చో బెట్టుకున్నప్పుడు పరిహాసం ఆడవలసి వచ్చి నన్ను పేరు పెట్టి పిలవవలసి వస్తుంది. ఆ సమయంలో ఆయన నన్ను దాక్షాయణీ అని దగ్గరకు తీసుకుంటే నీ పాపం నాకు అప్పుడు గుర్తుకు వస్తుంది. దక్షుడి కూతురు అనే శరీరంతో ఉండడం నాకిష్టం లేదు. ఆ ఒక్క కారణమునకు నేను చచ్చిపోతాను’ అన్నది.
యాగంలో ఉన్న వాళ్ళందరూ ఈ మాటలు విని అలా నిలబడిపోయారు. ఆవిడ వెంటనే అక్కడ పద్మాసనం వేసుకుని ప్రాణాపానవ్యానఉదానసమానమనే వాయువులను ఒకదానితో ఒకటి కలుపుతూ మూలాధారం దగ్గర నుంచి వాయువులను పైకి లేపి, భ్రూమధ్యం దగ్గరకు తీసుకు వచ్చి సహస్రారానికి తీసుకువెళ్ళే ముందు శరీరంలో యోగాగ్నిని పుట్టించి, భ్రూమధ్యమునందు ఆజ్ఞాచక్రం మీద శంకరుని పాదపద్మములను ధ్యానిస్తూ ఆ పాదపద్మములనే చూస్తూ, అందరూ చూస్తుండగా ఒక్క క్షణంలో అగ్నిగోత్రంలో భస్మం అయిపోయింది.

సతీదేవి అలా పడిపోవడంతోనే అక్కడ ఉన్న వాళ్ళందరూ గబగబా లేచారు. “వీడు తండ్రి కాదు. వీడు అనుభవించి తీరుతాడు. ఉపద్రవం వస్తుంది. వీడు జగత్తునందు పరమ అపఖ్యాతిని పొందుతాడు. ఏ ప్రజాపతికి లేని అపకీర్తిని దక్షుడు పొంది తీరుతాడు. అమ్మవారిని కూతురిగా పొంది పరమశివుడిని అల్లుడిగా పొందినా, దక్షుడి పేరు గుర్తు వచ్చేసరికి దక్షయజ్ఞవిధ్వంసం జ్ఞాపకమునాకు వచ్చేటట్లుగా యజ్ఞం విధ్వంసం అయి తీరుతుంది” అనుకున్నారు. ఎప్పుడయితే అమ్మవారు యోగాగ్నియందు భస్మం అయిపోయిందో అక్కడ ఉన్న రుద్రగణములన్నీ ఒక్కసారి లేచాయి. లేచి వాళ్ళు దక్షుడి మీదికి వెళ్ళబోయారు. అక్కడ భ్రుగువు ఉన్నాడు. ఆయనది అర్థం లేని ఆవేశం. ఆనాడు దక్షుడు శంకరుడిని తిడుతుంటే భ్రుగువు కళ్ళు మిటకరించి ఇంకా తిట్టమని కనుబొమలు ఎగరేశాడు. ఇపుడు సతీదేవి యోగాగ్నిలో శరీరమును వదిలేసింది. భ్రుగువు చాలా సంతోషపడిపోయాడు. ఈ రుద్రగణములు కూడా ఓడిపోవాలని వెంటనే అక్కడ గల హోమవేది దగ్గరకు వెళ్ళి ఆ యజ్ఞగుండంలో అభిచారహోమం చేసి, దానిలోనుండి కొన్ని వేలమంది వీరులను సృష్టించాడు. వాళ్ళందరూ వెళ్ళి రుద్రగణములను తరిమి కొట్టేశారు. అది చూసి దక్షుడు చాలా సంతోషపడ్డాడు. సంతోషంతో దక్షుడు తన నిరీశ్వర యాగమును చేయడము కొనసాగించాడు.
ఈ విషయం నారదుడు వెళ్ళి శంకరునికి చెప్పాడు. ప్రశాంతంగా కూర్చున్న శంకరుడు ఒక్కసారిగా తన ఆసనం మీద నుంచిలేచాడు. ఇపుడు అమ్మవారు శివుడిని రుద్రుడిగా మార్చింది. గర్జన చేసి పెద్ద నవ్వు ఒకటి నవ్వాడు. మెరిసిపోతున్న తన జటాజూటంలోంచి ఒక జటను పీకి, ఆ పుట్టిన కోపమును అణచుకోలేక నేలకేసి కొట్టాడు. ఆ జట సరిగ్గా నేలకు తగిలేసరికి అందులోంచి ఒక పురుషుడు ఆవిర్భవించడం మొదలయింది. నల్లటి శరీరంతో ఒక పెద్ద పురుషుడు పుట్టాడు. పక్కన పెద్దపెద్ద కోరలు మెరుస్తున్నాయి. ఆయనకు వేయి చేతులు ఆవిర్భవించాయి. వేయి చేతులతో వేయి ఆయుధములు పట్టుకున్నాడు. కోపంతో ఊగిపోతున్నాడు. అంత ఊగిపోతూ వేయి ఆయుధములతో ప్రహారం చేస్తూ కనపడ్డవారిని కనపడ్డట్లు సంహరించడానికి వేరొక ప్రళయకాలరుద్రుడిలా అక్కడ సాక్షాత్కరించాడు. తండ్రి అయిన శంకరుని చూడగానే వేయి చేతులతో ఒక్కసారి నమస్కారం చేసి, మోకాళ్ళ మీద కూర్చుని తలను శంకరుని తాటించి తల ఎత్తి పాదములకు ఘోరరూపంలో ఉన్న శంకరుని వంక చూసి ‘నన్ను ఎందుకు పుట్టించారు? ఏమి ఆజ్ఞ? నేను ఏమి చెయ్యాలి? నన్ను వెంటనే ఆదేశించండి’ అన్నాడు. శంకరుడు ‘దక్షుడు నీ జనని అయిన సతీదేవి పట్ల అపచారంతో ప్రవర్తించాడు. నిరీశ్వర యాగం చేస్తున్నాడు. నీవు వెంటనే బయలుదేరి వెళ్ళి యజ్ఞ ధ్వంసం చెయ్యి’ అన్నాడు. వీరభద్రుడు శంకరునికి ఒకమారు ప్రదక్షిణ చేసి బయలుదేరాడు. ఆయనను ఆపడం ఎవరికీ సాధ్యం కాదు. ఆయన వెనక ప్రమథగణములు అన్నీ బయలుదేరాయి. ఆయన శరీరం చేత పెద్ద చీకట్లు పుట్టాయి. ఎక్కడ చూసినా ధూళి పైకి రేగుతోంది. దక్షయజ్ఞంలో కూర్చున్న వాళ్ళు ‘ఏమిటి ఇంత ధూమం పుడుతోంది. ఒకవేళ మనం చేసిన దారుణమయిన పనిచేత మహానుభావుడయిన శంకరుడు కోపమును పొందినవాడై ఈ దక్షయజ్ఞ ధ్వంసమునకు పూనుకోలేదు కదా అని భయపడుతున్నారు. ఈలోగా వీరభద్రుడు రానే వచ్చాడు.
వీరభద్రుని చూడగానే దేవలోకాధిపతినని తనను పట్టుకుంటాడేమోనని ఇంద్రుడు లేచి పరుగెత్తడం ప్రారంభించాడు. ఆ వెనక చంద్రుడు పరుగెత్తుతున్నాడు. అప్పటివరకు యాగాగ్నియందు ఉన్న అగ్నిహోత్రములు పురుషరూపం దాల్చి పారిపోతున్నాయి. మీరు ఎక్కడికి పారిపోయినా మిమ్మల్ని పడగొట్టి గుద్దేస్తాను అని తన వేయి చేతులతో పట్టుకుందుకు వారి వెంటపడ్డాడు. ఆ యజ్ఞ శాలలో మొట్టమొదట రుద్రగణములు సంహరింపబడ్డాయి కాబట్టి ముందుగా వీరభద్రుడు నువ్వెవరు వాళ్ళ ఉసురు తీయడానికి శంకరుని ఎడమ కాలి దెబ్బకు లేచిపోయిన వాడివి నువ్వు అని ముందుగా యమధర్మరాజును పట్టుకుని ఆయన రెండు చేతులను వెనక్కి విరిచి తిప్పి ఒక్క తోపు తోసి తన కుడికాలి పాదంతో యమధర్మరాజు గుండెలమీద నొక్కిపెట్టి పిడిగుద్దులతో డొక్కలలో కొడుతుంటే యమధర్మరాజు ప్రక్కటెముకలు విరిగిపోయాయి. మిగిలిన దేవతలు ఇది చూసి పారిపోతున్నారు. ఈలోగా ప్రక్కకి చూసేసరికి సరస్వతీ దేవి ఎంతో సంతోషంగా కళ్ళు మూసుకుని వీణ వాయిస్తోంది. అన్నగారికి అవమానం జరుగుతూ యాగం జరుగుతుంటే నీవు ఇక్కడకు వచ్చి కూర్చుని వీణవాయిస్తున్నావు. నీకు యాగం కావలసి వచ్చిందా అని చిటికిన వేలు పెట్టి ముక్కు గిల్లెశాడు. ముక్కు ఊడిపోయి క్రింద పడిపోయింది. ఆమె వికృతరూపం చూసి అక్కడ ఉన్న అందరు కాంతలు లేచి పరుగులు మొదలుపెట్టారు. వీరభద్రుడు భ్రుగువు దగ్గరకు వెళ్ళి ఆయనను పట్టుకుని నువ్వేనా ఆరోజున బ్రహ్మసభలో శంకరుని దక్షుడు నింద చేస్తుంటే ఎగతాళి చేశావు. అని ఆయన గడ్డమును తన చేతికి ముడి వేసుకుని ఒక్క లాగు లాగాడు. అపుడు భ్రుగుని గడ్డం మొత్తం ఊడిపోయి నెత్తురు వరదలయిపోయింది. మీసములను లాగేశాడు. బొటనవేలితో భ్రుగుని రెండు కనుగుడ్లు ఊడబెరికేశాడు. శంకరనింద చేస్తే ఎలాంటి గతి పడుతుందో గుర్తు పెట్టుకో అని యాగాగ్నిహోత్రం దగ్గర కూల దోసేశాడు

అక్కడితో ఆగలేదు. భ్రుగువు రెండు దవడలు నొక్కి పైవరుస దంతములు పట్టుకుని కుదిపేసి క్రింది వరుస దంతములు కుదిపేసి రెండు చేతులతో రెండు దవడలు పట్టుకుని లాగాడు. నోరు చిరిగిపోయింది.
తరువాత పూషుడి దగ్గరకు వెళ్ళాడు. పూషా అనబడే ఆ సూర్యరూపమును పడగొట్టి ఆయన పళ్ళను పట్టుకుని నలిపేశాడు. పైవరస పళ్ళు, క్రింది వరుస పళ్ళు ఊడిపోతే వాటిని గాలిలోకి విసిరేసి ఇవాళ నుంచి నీవు మాట్లాడితే నీకు పళ్ళు లేవు కాబట్టి భాషయందు తప్పులు వస్తాయి. భాషయందు తప్పులు రావడం నీతోనే మొదలవుతుంది అని చెప్పాడు. ఆనాటి నుంచి పళ్ళు లేక పూష సరిగా మాట్లాడలేకపోయాడు. ఆనాటి నుండే భాషలో తప్పు రావడం అన్నది ప్రారంభం అయింది.
వీరభద్రుడు వెనకనుంచి వెళ్ళి చంద్రుడిని పట్టుకుని క్రిందపడేసి తన రెండు కాళ్ళను పైకెత్తి చంద్రుడి కడుపు మీదకి ఒక గెంతు గెంతాడు. చంద్రుడికి ప్రక్కటెముకలన్నీ విరిగిపోయి, చంద్రుడి నోట్లోంచి అమృతధార పైకి లేచి, వీరభద్రుని పాదములను అభిషేకం చేసింది. అలా వీరభద్రుడు దేవతల వెంటబడి తన వేయి చేతులతో చావగొట్టాడు.
చివరికి దక్షుడి మీదకు వెళ్ళి ఆయన మెడను నరకడానికి ప్రయత్నించాడు. దక్షుని మెడ తెగలేదు. దక్షుని శరీరం అంతా మంత్రపూరితం అయిపోయి ఉంది. అందుకని కంఠం తెగలేదు. తెగకపోతే గుండెల మీద తన కుడికాలి పాదంతో తొక్కి తలకాయను రెండు చేతులతోటి గడ్డిని మోపు కట్టినపుడు తిప్పినట్లుగా తిప్పేసి అది బాగా మెలిపడిపోయి సన్నగా అయిపోయిన తర్వాత ఊడబెరికి అగ్నిహోత్రంలో పడేశాడు. పిమ్మట రుద్రగణములను పిలిచి ఈ హోమగుండంలోనే కదా దేవతలు హవిస్సులు పుచ్చుకున్నారు. ఈ గుండంలో మూత్రమును విసర్జించండి అన్నాడు. వారందరూ హోమ గుండంలో మూత్రవిసర్జన చేశారు. అందరినీ కొట్టి ఉగ్రమూర్తియై వీరభద్రుడు నాట్యం చేస్తుంటే ఆపగలిగిన మొనగాడెవడు? మిగిలిన వాలు కొద్దిమంది ఉంటే వీళ్ళందరూ పరుగుపరుగున బ్రహ్మ సదనమునకు వెళ్ళారు. వీరభద్రుడు తన చేతిలో పట్టిసమును తీసుకు వెళ్ళి గోదావరి నదిలో కడిగి శాంతమూర్తి అయ్యాడు. ఎక్కడ తన చేతిలో ఉన్న పట్టిసమును వీరభద్రుడు కదిగాడో అదే పట్టిసతీర్థం. దక్షయజ్ఞం జరిగిన చోటు దక్షారామం. పరమ పుణ్య క్షేత్రం.
దేవతలందరూ చతుర్ముఖ బ్రహ్మ గారి దగ్గరకు వెళ్ళి మహానుభావా, ఏమిటి దీనికి పరిష్కారం? అని అడిగారు. అపుడు ఆయన మీరు చేసిన పాపం సామాన్యమయిన పాపం కాదు. ఆయన శర్వుడు, భవుడు, ఉగ్రుడు, భీముడు, రుద్రుడు, పశుపతి, మహాదేవుడు, ఈశానుడు. ఎనిమిది రూపములతో ప్రకాశిస్తున్నవాడు పరమశివుడు. మీకొక మాట చెప్తున్నాను. శంకరుడు కరుణాపూరిత హృదయుడు. మనం బుద్ధి తెచ్చుకుని ఆయనకు నమస్కరించడానికి వెళితే ఆయన మిక్కిలి ప్రసన్నమూర్తిగా ఉంటాడు. రండి అని చెప్పి వీళ్ళందరినీ తీసుకుని కైలాసమునకు వెళ్ళాడు. అక్కడకు వెళ్ళేసరికి ప్రశాంత వదనంతో శంకరుడు పెద్ద వటవృక్షం క్రింద కూర్చుని తన ఎడమతొడ మీద కుడిపాదం పెట్టుకుని సనక సనందనాది మహర్షులందరూ తనచుట్టూ కూర్చుని ఉండగా, పరబ్రహ్మమునకు సంబంధించిన జ్ఞానమును చక్కగా చిన్ముద్రపట్టి తనలోతాను రమిస్తున్నవాడై సన్నటి చిరునవ్వు నవ్వుతూ, పరమానంద స్వరూపంగా వాళ్ళందరికీ జ్ఞానబోధ చేస్తున్నాడు.
ఎక్కడ చూసినా కైలాస పర్వతం మీద లతావితానములు. పొదరిళ్ళు, ఋషులు, ప్రమథగణములు, నందీశ్వరుడు, గంటల చప్పుడు, వచ్చే విమానములు, వెళ్ళే విమానములు. అందరూ శంకరుడికి పరమభక్తితో నమస్కారములు చేస్తున్నారు. పరమభక్తితో అందరూ పంచాక్షరీ మహా మంత్రమును జపం చేసుకుంటూ ఉన్నారు. ఆ కైలాసపర్వతం పరమరమ్యంగా శోభాయమానంగా ఉంది. బుద్ధి తెచ్చుకున్న దేవతలు శంకరుడి దగ్గరకు వెళ్ళి నిలబడి “స్వామీ మా బుద్ధి గడ్డి తినింది. ఈశ్వరా నీవు కాకపోతే మమ్మల్ని రక్షించే వారెవరు? కృపచేసి మమ్మల్ని కాపాడవలసింది’ అని ప్రార్థించారు. శంకరుడు వెంటనే చిరునవ్వు నవ్వి ఎవరెవరు దెబ్బలు తిని మరణించిన వారు ఉన్నారో వారందరూ పూర్వం ఎలా ఉన్నారో అంతే తేజస్సుతో సజీవులు అగుదురు గాక! ఆగిపోయిన యాగం యథారీతిగా సశాస్త్రీయంగా వేదం ఎలా చెప్పిందో అలా పూర్తిచేయబడుగాక! దక్షుడి తల అగ్నిహోత్రంలో కాలిపోయింది కాబట్టి మూర్ఖత్వమునకు పిరికితనమునకు ప్రతీక కనుక మేక ముఖమును తీసుకు వచ్చి దక్షుడి శిరస్సుకు అతికింపబడుగాక! దక్షుడు సజీవుడు అగుగాక! అతడు బుద్ధి తెచ్చుకుని సంతోషంగా జీవితమును గడుపుగాక! మీరందరూ పరమ సంతోషముతో ఆనందముగా ఉందురుగాక! అని చెప్పాడు. ఎక్కడా తన భార్య గురించి మాట్లాడలేదు. ఇదీ శంకరుడంటే. ఇపుడు దక్షుడు మేక ముఖం పెట్టుకుని శంకరుడి దగ్గరకు వచ్చి సాష్టాంగ పది ఏడుస్తూ “తండ్రీ దేవా అభవ పురహర రుద్రా, నీవు నన్ను దండించావని అనుకోవడం లేదు. నువ్వు ఎలా ఈ మస్తిష్కమును తీసి ఉండకపోతే నేను ఇంకా ఎన్ని పాపములు చేసి ఉండేవాడినో? ఈ పాపమును ఇక్కడితో తీసి వేశావు. ఇకపై బుద్ధి తెచ్చుకుని బ్రతుకుతాను. అన్నాడు. శంకరుడు చక్కగా వెళ్ళి యజ్ఞమును పూర్తిచెయ్యి అని ఆదేశించాడు.
ఇప్పుడు వాళ్ళందరూ వెళ్ళి ఆ యాగమును పూర్తిచేశారు. అప్పుడు బ్రహ్మ శ్రీ మహావిష్ణువు వచ్చారు. ఇటువంటి తప్పు పనులు ఎన్నడూ చేయవద్దు అని చెప్పారు. యాగం పూర్తి చేయబడింది.

దక్షయజ్ఞం ధ్వంసం గూర్చి చదివినా, బుద్దిమంతులై శంకరుని కారుణ్యమును మనసులో అవధరించగలుగుతూ వినినా, అటువంటి వారికి జాతకములో ప్రమాదములు పొడచూపితే అవి తప్పి పోతాయి. ఆయుర్దాయం కలుగుతుంది. కీర్తి కలుగుతుంది. వాళ్ళు చేసిన పాపములు నశిస్తాయి. శంకరుడు దక్షిణామూర్తిగా ఉన్న కైలాస దర్శనం చెప్పబడింది కాబట్టి వాళ్ళ భవబంధములు తొలగి జ్ఞానం కలుగుతుంది. కాబట్టి ఇది అంత పరమపావనమయిన ఆఖ్యానము.