కర్మయోగం

మనిషి జీవితలక్ష్యం ఆనందం. భూమ్మీద పడిన చినుకు వేసే అడుగు, పిల్లకాలవ పరుగు, నదీ ప్రవాహం... ఇవన్నీ సముద్రాన్ని చేరేందుకే! అదే విధంగా- చిన్నపిల్లల ఆటలు, యువత కలల ఊహలు, పెద్దవాళ్లు చేపట్టే పనులు... చివరకు ఆనందం పొందడానికే! చినుక్కి ఏది జన్మనిస్తుందో తిరిగి దానిచెంతకు చేరేందుకే అది పరితపిస్తుంది. మనిషి ఎక్కడినుంచి వచ్చాడో మళ్ళీ అక్కడికి వెళ్లేందుకే ఆరాటపడతాడు. ఎందుకంటే, ఆ గమ్యం ఆనందం కాబట్టి! ఆ లక్ష్యానికి ఎంతమంది చేరువవుతున్నారు, ఆ గెలుపు దిశగా మనిషి పయనించడం నిజమే అయితే- అతడు దుఃఖంలోనే ఎందుకు కొట్టుమిట్టాడుతున్నాడు?

ఎందుకంటే, మనిషికి ఆరాటం ఎక్కువైంది. జీవితం పట్ల అవగాహన లోపించింది. ‘ధార్మిక పయనం పాలు’ చాలా తక్కువైంది. మనిషి పుట్టిందే కర్మకోసం! ఈ సృష్టిలో ప్రతి జీవీ ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. కదలడం, నడవడం, వినడం, చూడటం... ఇవన్నీ పనులే! శారీరకంగా పనిచేయడం- యోగాసనాలు వేయడం వంటిదే! పనివల్ల శరీరానికి వ్యాయామం లభించి మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. పరధ్యానం, అనవసర ఆలోచనలు ఉండవు. మనసు ప్రశాంతమవుతుంది. మనసు, శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆనందం పురివిప్పుతుంది.

కొంత కాలంపాటు యంత్రం పనిచేయకపోతే తుప్పుపడుతుంది. పనిచెయ్యని వ్యక్తీ అంతే! శారీరకంగా, మానసికంగా బలహీనుడై- కుంగి, కృశించిపోయి తనకు, సమాజానికి ఉపయోగపడకుండా పోతాడు. అందువల్ల, మనిషి పనిచేయడం అనివార్యం. కనుక, ఇక తెలియాల్సింది- ఏ పని చేయాలి, ఎలా చేయాలి అనేదే! అందుకు ప్రామాణిక గ్రంథాలున్నాయి. ప్రవక్తలు చెప్పిన విలువైన మాటలూ ఉన్నాయి.

‘కర్మఫల త్యాగం గొప్పది’- ఇది గీతాచార్యుడు చెప్పిన మాట. ‘మీకు మేలు చేసినవారికే మేలు చేసినయెడల మీకేమి మెప్పు కలుగుతుంది?’- ఇది జీసస్‌ పలికిన ప్రవచనం. ‘కోరికలే దుఃఖానికి మూలం’- అని గౌతమబుద్ధుడి వాక్కు. ఆ ముగ్గురి మాటల సారాంశం, భావం, అర్థం ఒక్కటే! అదేమంటే, ఫలాపేక్ష లేకుండా పని చేయమని. చేసిన పనికి ఫలితం ఆపడం ఎవరితరం? బాటవెంట నడుస్తూ పోతుంటే ఒక గమ్యం చేరడం తప్పనిసరి. వెలుగుతున్న దీపాన్ని ముట్టుకుంటే కాలుతుంది. ఆహారం తీసుకుంటే శరీరానికి బలం కలుగుతుంది. నీటిని వేడిచేస్తే ఆవిరి వస్తుంది. రాళ్లను రాపిడి చేస్తే నిప్పు పుడుతుంది. ఫలితం- పనిలోని చివరిభాగం. అది ప్రాకృతిక ప్రామాణిక సూత్రం. దాన్నెవరూ ఆపలేరు.
‘ఫలాపేక్ష లేకుండా’ అంటే, పని చేసిన తరవాత ఆఖరున దొరికే ఫలితానికి సంబంధించిన పరిమాణం పట్ల కోరిక లేకుండా ఉండటమని, దాని స్వరూపం పట్ల ఆసక్తి లేకుండా ఉండాలనేది లోతైన అర్థం. అదీగాక ‘కర్మ చేసేందుకే నీకధికారం ఉంది... ఫలితం పట్ల లేదు’ అని గీతాచార్యుడు చెప్పినమాట ఉండనే ఉంది. తక్కువ పనిచేసి ఎక్కువ ఫలితం కోరడం అత్యాశ అవుతుంది. ఎక్కువ పనిచేసి తక్కువ ఆశించడం ఆత్మవంచన అవుతుంది. పనిచేశాక వచ్చే పూర్తి ఫలాన్ని తిరస్కరించడం అహంభావమవుతుంది.

అనాథలకు, అభాగ్యులకు పేదలకోసం పనిచేసి ప్రతిఫలం ఇష్టంగా వదిలేస్తే ఆనందం కలుగుతుంది. అదే పుణ్యమంటే! ఇవేమీ ఆలోచించకుండా కాలం అప్పజెప్పిన పనిచేయడం కేవలం స్వధర్మమని భావించి అడుగులు వేస్తే- వర్తమానంలో ఉంటాం. ‘వర్తమానం’ అంటే, ఆనందంతో తయారైన ఆవరణ! అందులో ఆనందం తప్ప ఇంకేమీ ఉండదు.

వర్తమానం- పారే నది వంటిది. కుడి, ఎడమలుగా ఉండే భూతభవిష్యత్తులు దానికి గట్లవంటివి. ఒక గట్టునుంచి మరోగట్టుకు చేరాలంటే నది ఈదాల్సిందే! నిన్నటి అనుభవంతో రేపటి భవిష్యత్తుకు రూపమివ్వాలంటే ‘ఇవాళ’ పనిచేయడం తప్పనిసరి. పనిని ధ్యానంలా భావించి, శ్రద్ధాభక్తులతో ప్రార్థనలా చేస్తే దొరికేది ఆనందమే! అదే అంతిమమైనది. ప్రాజ్ఞులూ ‘ఆనందోబ్రహ్మ’ అన్నారు. అంటే, ఆనందమే ‘అంతర్యామి’ అని!