మాఘపురాణం - 20వ అధ్యాయము

భీముడు ఏకాదశీ వ్రతము చేయుట మరియు గృత్నృమద మహర్షి చెప్పిన మరొక పురాణం.  శివ బ్రహ్మల వివాదము    

             పాండవులలో ద్వితీయుడు భీముడు. అతడు మహాబలుడు. భోజనప్రియుడు. ఆకలికి ఏమాత్రం ఆగనివాడు. బండెడన్నము అయినను చాలదు. అటువంటి భీమునకు ఏకాదశీ వ్రతము చేయవలయునని కుతూహలం పుట్టెను. కానీ ఒక విషయంలో బెంగతో ఉండెను.          

  అదేమందువా? ఏకాదశినాడు భోజనం చేయకూడదు కదా! భోజనం చేసిన ఫలం దక్కదుకదా! అని విచారించి తమ పురోహితుని వద్దకు పోయి ‘ఓయీ పురోహితుడా! అన్ని దినముల కంటే ఏకాదశి పరమ పుణ్య దినమని అనెదరు గదా! దాని విశిష్టత ఏమి అని భీముడు అడిగెను.        

     “అవును భీమసేనా! ఆరోజు అన్నిదినముల కంటెను ప్రశస్తమయినది. శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైనది. గనుక అన్ని జాతుల వారును ఏకాదశీవ్రతం చేయవచ్చును” అని పాండవ పురోహితుడు అగు ధౌమ్యుడు పలికెను.               “సరే నేను అటులనే చేయుదును గాని విప్రోత్తమా! నేను భోజన ప్రియుడనన్న సంగతి జగద్వితమే కదా! ఒక ఘడియ ఆలస్యమైన నేను ఆకలికి తాళజాలను గనుక, ఏకాదశి నాడు ఉపవాసముండుట ఎటులని విచారించుచున్నాను.           

     ఉపవాసమున్న దినముననే ఆకలి ఎక్కువగా ఉండును. గనుక ఆకలి తీరులాగున ఏకాదశీ వ్రత ఫలము దక్కులాగున నాకు వివరింపుము అని భీముడు పలికెను.భీమసేనుని పలుకులకు ధౌమ్యుదు చిరునవ్వు నవ్వి “రాజా! ఏకాదశీ వ్రతమునకు దీక్ష అవసరము. దీక్షతో ఏకార్యము చేసిననూ కష్టములు కనిపించవు. గాన నీవు దీక్షబూనినచో ఆకలి కలుగదు.       

       రాబోవు ఏకాదశీ అనగా మాఘశుద్ధ ఏకాదశీ మహా శ్రేష్ఠమయినది. దానికి మించిన పర్వదినం మరియొకటి లేదు. ఒక్కొక్క సమయంలో మాఘ ఏకాదశీ రోజు పుష్యమీ నక్షత్రముతో కూడినదై యుండును. అటువంటి ఏకాదశికి సమానమగునది మరి ఏదియు లేదు. సంవత్సరము నందు వచ్చు ఇరువది నాల్గు ఏకాదశులలో మాఘశుద్ధ ఏకాదశీ మహా పర్వదినము గాన ఆ దినము ఏకాదశీ వ్రతం ఆచరింపుము.      

             ఆకలి గురించి దిగులు పడకుము. ‘నియమము’ తప్పకూడదు. అని ధౌమ్యుడు భీమునకు వివరించెను.ధౌమ్యుని వలన తన సంశయం నెరవేరుటకు మాఘశుద్ధ ఏకాదశి నాడు అతి నిష్ఠతో వ్రతం చేసి ఉపవాసముండెను.    

           అందులకే మాఘ శుద్ధ ఏకాదశి “భీమ ఏకాదశి” అని పిలుతురు. అంతియేగాక ఓ దిలీప మహారాజా! పరమేశ్వరునకు, అత్యంత ప్రీతికరమగు శివరాత్రి కూడా మాఘమాసమునందే వచ్చును. గాన మహా శివరాత్రి మహాత్మ్యమును గురించి కూడా వివరించెదను. శ్రద్ధాళుడవై ఆలకింపుము” అని వశిష్ఠుల వారు దిలీప మహారాజుతో ఇటుల పలికిరి. శివరాత్రి మహాత్మ్యము        

       ఏకాదశి మహావిష్ణువునకు ఎటుల ప్రీతికరమైన దినమో అదేవిధంగా మాఘచతుర్దశీ అనగా శివ చతుర్దశి. దీనినే ‘శివరాత్రి’యని అందురు. ఈశ్వరునికి అత్యంత ప్రీతివంతమయిన దినము. ఇది మాఘమాసామునందు వచ్చు అమావాస్యకు ముందురోజు దానినే “మహాశివరాత్రి”యని అందరూ పిలిచెదరు.             ఇది మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశినాడు వచ్చును. ప్రతి మాసమందు వచ్చు మాస శివరాత్రి కన్నా మాఘ మాస కృష్ణ పక్షంలో వచ్చు మహాశివరాత్రి పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది. ఆరోజు నదిలో గాని, తటాకమందుగాని, లేక నూతివద్ద గాని స్నానం చేసి శంకరుని పూజించవలెను. పరమేశ్వరుని అష్టోత్తర శతనామావళీ బిల్వ పత్రములతో పూజించవలయును.               అటుల పూజించి శివప్రసాదం సేవించి ఆ రాత్రి అంతయు తప్పనిసరిగా జాగరణ వుండి మరునాడు అమావాస్య స్నానం కూడా చేసిన యెడల ఎంతటి పాపములు కలిగి ఉన్ననూ అవన్నియు వెంటనే హరించుకు పోయి, కైలాస ప్రాప్తి కలుగును. శివపూజా విధానంలో శివ రాత్రి కంటే మించినది మరియొకటి లేదు.               గనుక మాఘమాసం కృష్ణ పక్షంలో వచ్చు చతుర్దశి ఉమాపతికి అత్యంత ప్రీతిపాత్రమైనది. గాన శివరాత్రి దినమున ప్రతివారూ అనగా జాతి బేధములతో నిమిత్తం లేక అందరూ శివరాత్రి వ్రత మాచరించి జాగరణ చేయవలయును.               “మున్ను శబరీ నదీ తీరమందున్న అరణ్యంలో కులీనుడను బోయవాడు తన భార్యా బిడ్డలతో నివసించుచుండెను. తనకు వేట తప్ప మరొక ఆలోచన లేదు. కడు మూర్ఖుడు. వేటకు పోవుట, జంతువులను చంపి, వాటిని కాల్చి తాను తిని తన భార్యాబిడ్డలకు తినిపించుట తప్ప మరేదియు తెలియదు.            

     జంతువులను వేటాడుటలో నేర్పు గలవాడు, క్రూర మృగములు సహితం బోయవానిని చూచి భయపడి పారిపోయెడివి. అందుచేత అతడు వనమంతా నిర్భయంగా తిరిగేవాడు. ఒకనాడు ప్రతిదినము వేటకు వెళ్ళునట్లే బయలుదేరి వెళ్ళెను. ఆనాడు జంతులేమియు కంటపడలేదు. సాయంకాలమగుచున్నది. వట్టి చేతులతో ఇంటికి వెళ్ళుటకు మనస్సు అంగీకరించనందున పొద్దు గుంకి పోయిననూ అక్కడున్న మారేడు చెట్టుపైకెక్కి జంతువు కొరకు ఎదురు చూచుచుండెను.         తెల్లవారుతున్న కొలది చలిఎక్కువగుచు మంచు కురుస్తున్ననూ కొమ్మలను దగ్గరకు లాగి వాటితో తన శరీరాన్ని కప్పుకొనుచుండెను. ఆ కొమ్మలకున్న ఎండుటాకులు రాలి చెట్టుక్రింద వున్నా శివలింగము మీద పడినవి. ఆరోజు మహాశివరాత్రి అందులో బోయవాడు రాత్రంతా తిండి తినక జాగరణతో వున్నాడు.        

        తనకు తెలియక పోయిననూ మారేడు పత్రములు శివలింగముపై పడినవి ఇంకేమున్నది? శివరాత్రి మహిమ బోయవానికి సంప్రాప్తించెను. మాఘమాసంలో కృష్ణ పక్ష చతుర్దశి రాత్రి అంతయు జాగరణ, పైగా శివలింగముపై బిల్వ పత్రములు పడుట తిండిలేక ఉపవాసం ఉండుట ఇవన్నీ ఆ బోయవానికి మేలు చేసినవి.          

    జరామరణము లకు హెచ్చు తగ్గులు గాని, శిశువృద్ధులు గాని లేవు. పూర్వ జన్మలో చేసుకున్న పాప పుణ్యములను బట్టి మనుజుడు తన జీవితమును గడపవలసినదే. మరికొన్ని సంవత్సరములకు ఆ బోయవానికి వృద్ధాప్యం కలిగి మరణమాసన్నమై ప్రాణములు విడిచెను.          

     వెంటనే యమభటులొచ్చి వాని ప్రాణములు తీసుకుపోవు చుండగా కైలాసం నుండి శివదూతలు వచ్చి యమదూతల చేతిలో నున్న బోయవాని జీవాత్మను తీసుకొని శివుని దగ్గరకు పోయిరి. యమభటులు చేసేది లేక యమునితో చెప్పిరి. యముడు కొంత తడవు ఆలోచించి శివుని వద్దకు వెళ్ళెను.           

  శివుడు, పార్వతి, గణపతి, కుమారస్వామి, నంది తుంబుర నారద గణాలతో కొలువుతీర్చుకున్న సమయంలో యముడు వచ్చి శివునకు నమస్కరించాడు. ఉమాపతి యముని దీవించి ఉచితాసనమిచ్చి కుశల ప్రశ్నలడిగి వచ్చిన కారణమేమిటని ప్రశ్నించెను.అంతట యముడు మహేశా! చాలా దినములకు మీ దర్శన భాగ్యం కలిగినందులకు మిక్కిలి ఆనందించుచున్నాను.     

       నారాకకు కారణమేమనగా ఇంతకుముందు మీ దూతలు తీసుకువచ్చిన బోయవాడు మహాపాపి, క్రూరుడు. దయా దాక్షిణ్యాలు లేక అనేక జీవహింసలు చేసియున్నాడు. ఒక దినమున అనగా మహాశివరాత్రి నాడు తాను యాదృచ్ఛికంగా జంతువులు దొరకనందున తిండి తినలేదు. ఆరాత్రి చలిబాధకు తట్టుకొనలేక బిల్వ పత్రములను కప్పుకొన్నాడు.            

   జంతువులను వేటాడుటకు రాత్రి అంతయు మెలకువగా ఉన్నాడు. కాని చిత్తశుద్ధితో తాను శివలింగమును పూజించలేదు. గనుక అతనిని కైలాసమునకు తీసుకొని వచ్చుట భావ్యమా? అంత మాత్రమున అతనికి కైవల్యము దొరుకునా” అని యముడు విన్నవించుకున్నాడు.     

        యమధర్మరాజా! ప్రీతికరమైన మహాశివరాత్రి పర్వదినమున బిల్వ పత్రములు నాపైన వేసి, తిండిలేక జాగరణతో నున్న యీ బోయవాడు కూడా పాపవిముక్తుడు కాగలడు. ఈ బోయవానికి కూడా ఆ వ్రత ఫలం దక్కవలసినదే గనుక ఈ బోయవాడు పాపాత్ముడయినను, ఆనాటి శివరాత్రి వ్రతమహిమ వలన నా సాయుజ్యం ప్రాప్తమయినది అని పరమేశ్వరుడు యమునికి వివరించెను. యముడు చేసెది లేక చంద్రశేఖరుని వద్దనుండి వెడలిపోయెను గృద్నృమదమహర్షి జహ్నుమునికి విష్ణు సర్వవ్యాపకత్వమును గురించి చేప్పిన మరొక పురాణం.   శివ బ్రహ్మల వివాదము       

    గృత్నృమద మహర్షి మరల యిట్లు పలికెను. శ్రీమహవిష్ణువు తత్త్వమును మహత్త్యమును వివరించు మరియొక వివాదమును వినుము. బ్రహ్మ రజోగుణ ప్రధానుడు, శివుడు తమోగుణ ప్రధానుడు కదా. వారిద్దరు ఒకప్పుడు యెవరికివారు తానే ప్రధానుడనని యనుకొనిరి.            

    సర్వలోకకర్తను, దేవతల కిష్తుడైన యధిపతిని నేనే మరియొకరు నాకంటే ఉత్తములు లేరని యెవరికి వారే తలచిరి. ఎంతకాలము గడచినను వారి వివాదము ఆగలేదు. కాలము గడచుచునేయున్నది వివాదము పెరుగుచునేయున్నది.ఇట్లుండగా వారి యెదుటనొక మహారూపము సాక్షాత్కరించెను.        

     ఆ రూపము అనేక సూర్యులకాంతి కలిగి తేజోమయమై యుండెను. అనేకములైన ముఖములు, నేత్రములు, బాహువులు, పాదములు కలిగి సర్వవ్యాప్తమై తనకు తానుగా జనించి సర్వతో వ్యాప్తమైయుండెను. దివ్యము మనోహరము అనంతమునగు ఆ రూపము శ్రీమహవిష్ణు రూపమని వారు గ్రహించిరి. సర్వమును ఆ రూపమునందేవారు చూచిరి.             

  బ్రహ్మ, శివుడు ఆ రూపము చెవులలోనుండిరి. ఈ విచిత్ర మనోహరమైన అనంత రూపమును జూచి శివబ్రహ్మలిద్దరును ఆ రూపము తుది మొదళ్లను చూడదలచిరి. ఆ రూపము యొక్క ఆద్యంతములు నెరిగిన వారే తమ యిద్దరిలో నుత్తములని తలచిరి, ప్రయాణమైరి, నాలుగుదిక్కుల క్రిందను, పైనను చిరకాలము సంచరించిరి. ఆరూపమును మొదలునుగాని, చివరనుగాని చూదలేకపోయిరి, తాము ఇద్దరమును దానిని కనుగొనుటకు అశక్తులమని గమనించిరి. అప్పుడారూపము నిట్లు తలచిరి.           

      ఈ పురుషుడే జగత్కర సృష్టిస్థితి లయాత్మకమైన కాలస్వరూపుడు. గుణాధికుదు. గురువు రక్షించువాడు సర్వేశ్వరుడు, స్వయంప్రకాశుడు, సర్వప్రాణులయందు నివసించువాడు, సర్వప్రాణులను తనయందే నిలుపుకొనువాడు, మనము వీనికంటె అధికులముకాము. మన వలన నేమియు జరుగుట లేదు. ఇట్టి యధార్థ పరిజ్ఞానము కలిగి శ్రీమహావిష్ణువు నిట్లు స్తుతించిరి. బ్రహ్మ శివకృత విష్ణు స్తుతి        

       అనంతమూర్తీ! సర్వాద్యమూ, సర్వాధారమూ, అనంత ప్రకాశమూ సర్వమనోహరమూ అయిన నీ స్వరూపమును మాకు మరింత ప్రత్యక్సమనట్లు చేయుము. సర్వాత్మకా! సర్వేశ్వరా! సర్వప్రాణి నమస్కృతా!  అనుగ్రహించుము. నీవు సర్వకర్తవు, భర్తవు నీ తేజమనంతము, నీవందరికిని అన్నిటికిని యిచ్చువాడవు, సర్వస్వరూపుడవు, సర్వవ్యాప్తరూపుడవు అనుచునిట్లనిరి. హేవిషోవంతమూర్తే తవఘవ విఖిలాకారమాద్య స్వరూపం సర్వాధారం సురేశందినపతి హత భుక్కోటి సూర్యప్రకాశం | అవాభ్యమత్రి దృష్టం సకలముని మనోవాసమబ్జాయతాక్షం చిమ్రావేం స్వాత్మశక్త్యాకురు నిఖిలగురో సర్వరూపంత్విదానం || నమస్తే విశ్వాత్మన్ విధిహరసురేంద్రాది విబురై త్రయీ శాత్త్రాలాపైః విగదితన వ్యాంఘ్ర్యంబుజయుగం | పరంమత్రంయంత్రం పరమపద బీజం జ్వలతియః ససాక్షాత్పారూప్యం వ్రజతి తవదేవేశసతతం || త్రిలోక కర్తా భివదస్యభర్తా హరే మహద్రూపమనేక తేజాః గురుర్గుర్ణాం నరదోవరాణాం మహార్ణవాంబూపల జస్త్వమేర | త్రిదేవ దేవాసుర రాజయష్ట శిష్టేష్ట తుష్ట త్రిదివే వినిష్ట దృష్టామృతాస్వాద్యమిరాశు పాణిః సురాసురాణామఖిలేశ్వరరస్త్వం || లక్ష్మీపతి స్త్వంతు సుగుహ్యగోప్తా గుహాశయః పంకజ పత్రనేత్ర త్వంపంచ వక్త్రశ్చ చతుర్ముఖశ్చ చరాచరేశో భగవన్నమస్తేః  సృష్టించ విశాలాం సృజసిత్వమేవ చైశ్వర్యవాన్ సర్వగుణశ్చదేవ త్వమేవ భూర్భూరికృత ప్రవేశః తధాద్య భూతం విదధాసియత్తత్ || త్వమగ్ని సూర్యౌ పవనస్త్యమేవ యమోభవాన్ వైశ్రవణస్త్వమేవ త్వమేవశక్ర స్పురలోకనాధః నాధాబిమస్త్వం భగవన్ నమస్తే || పరమం పరాణాం పరమంపవిత్రం పురాణ కర్తారమనం తమాశ్రయం త్వాం వేదమోహుః కవయః సుబుద్ద్వా నమోస్తుతే పన్నగవైరి కేతో || వేదాశ్చవేద్యశ్చ దిగంతరాళం యష్ఠాసురసానమపి త్వమేవ కర్మాణ్యనంతాని సుఖప్రదాని ఋదశ్చవాతో నిగమాశ్చసర్వే || నదీషు గంగాహిమవాన్ నగేషు మృగేషు సింహో భుజగోష్వంతః రత్నేషు వజ్రంజలజేషు చంద్రః క్షీరోదధశ్చాపి యధాతథాత్వం || అహం ప్రభు స్తద్వరహం ప్రభుశ్చ సంస్పర్ద మానౌ బహువర్ణానాం తస్నాదదావీం పరిహర్తు మేవం స్వయం ప్రభుస్త్యం కరుణైకరాసి || తేనాత్రతే దర్శనబుద్ది రాసీత్ కృపాలో భగవన్నమస్తే తూర్ణం జగనాథ మహత్స్వరూపం భూత్వాపున స్చామ్య వపుఃప్రసీద ||          

     ఇట్లు శివుడు బ్రహ్మ చేసిన స్తుతిని విని శ్రీమహా విష్ణువు ప్రసన్నుడై సహజమైన సౌమ్య స్వరూపముతో వారికిట్లనెను. బ్రహ్మేశ్వరులారా! మీరిద్దరును చిరకాలము వివాదపడుచుండుటచే మీ వివాదమును నిలుపుటకే నేను యిట్టి విరాట్రూపమును ప్రదర్శించితిని. మీరును నా విరాట్ రూపమును గమనింప నశక్తులై మానసిక వికారమును విడిచి ప్రశాంతబుద్దులై నన్ను స్తుతించిరి.                 

    మీ వివాదమునకు కారణమును నేనెరుగుదును. ఆ వివాదము నెవరును పరిష్కరింపలేరు. సత్వరజస్తమోగుణములు ప్రకృతి వలన కలిగినవి. ఆ గుణములకు లోబడినవారికి యదార్థము తెలియదు. స్త్త్వగుణము నిర్మలము స్వయంప్రకాశకము అనామయము. సుఖసంగముచే దేహినిబంధించును.           

    పరమేశ్వరాసక్తిని కలిగించును. రజోగుణము రాగాత్మకమై ఆశక్తిచే ప్రబలమగును. జీవికి కర్మాసక్తిని కలిగించును. అనగా పరమాత్మ స్వరూపజ్ఞానమును కప్పి, యిహలోకమునకు చెందిన ప్రయోజనములను కలిగించు పనులయందు ప్రవర్తింపజేయును. తమోగుణము అజ్ఞానముచే కలుగును. ఇది జ్ఞానమును పోగొట్టి మోహమును పెంచును.        

        దీనిచే పరమాత్మ జ్ఞాన ప్రయత్నము వెనుకబడును. దీని వలన ప్రమాదము కలుగును. ప్రమాదమనగా చేయవలసినదానిని మరచుట ఆలస్యము అనగా చేయవలసిన కార్యము తెలిసినను శ్రద్దసరిగా లేకపోవుట, శ్రద్ధాలోపముచే కార్యనిర్వహణ శక్తి లేకపోవుట జరుగును. నిద్రయనగా నీ యజ్ఞానముచే, చేయవలసిన దానిని వీడి నిద్రించుట, కావున ప్రమాదాలస్య నిద్రలు తమోగుణ జీవితములు జీవగుణ త్రయబద్దుడు కాక పరమాత్మ చింతన చేసిన మంచిది. నేను దీనిని పొందితిని. దీనిని పొందగలను, నేను చేయగలను నాకెవరును సాటి ఇట్టి బుద్ధి ఆలోచన రజస్తమోగుణముల ప్రభావము.         

         మీకును యీగుణ ప్రభావము వలన వివాదము కలిగి పెరిగినది. మొట్టమొదట నంతయు చీకటిగ నుండినది పంచభూతములప్పటి కేర్పడలేదు. అప్పుడు నేను సృష్టి చేయుటకై మొదట బంగారపు ముద్దవలెనుంటిని. తరువాత నవయవము లేర్పడినవి. తరువాత మన ముగ్గురము యేర్పడితిమి.         

   మనము ముగ్గురము సృష్టిస్థితిలయములకు కర్తలమైతిమి. బ్రహ్మసృష్టికర్తగను, నేను పోషకునిగను, శివుదు లయకర్తగను మనము ముగ్గురము అయితిమి. కావున ఒకే దానినుండి వచ్చిన మనకు మొదట భేదములేదుకదా!          

    అని బ్రహ్మకు శివునికి శ్రీమహావిష్ణువు తత్త్వమును స్మృతికి తెచ్చెను, మరియు బ్రహ్మతో నిట్లనెను, బ్రహ్మ! నీవు స్వతంత్రుడవు, నిగ్రహానుగ్రహ సమర్థుడవు. సర్వప్రాణులను సృషించినవాడవు. దేవతలకు ప్రభువువు. వేదములకు స్థానము అన్ని యజ్ఞములకును అధిపతిని. సర్వలోకములకు సంపదనిచ్చువాడవు.      

         స్వశక్తితోడనే పరమాత్మయోగమునందినవాడవు. సర్వ రక్షకుడవు. నా నాభి కమలమందు బాలార్కునివలె ప్రకాశించువాడవు. మనకు భేదము లేదు, ఏకత్వములో నున్న నేనే అనేకత్వము నందితిని.మనమిద్ధరమొకటే. నీవును నా వలెనే సమస్త దేవతలకు పూజనీయుడవు. అని బ్రహ్మ మనసునకు నచ్చునట్లుగ తత్త్వమును బోధించెను. అని గృద్నృమదమహర్షి జహ్నుమునికి విష్ణు సర్వవ్యాపకత్వమును వివరించెను.

మీ వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి