మాఘ పురాణం 18వ అధ్యాయము

ఇంద్రుని శాపవిముక్తి           

    శ్రీమహా విష్ణువు దేవతలతో మరల నిట్లనెను. దేవతలారా! మాఘమాస మహిమను యెంత చెప్పినను చాలదు. మాఘపూర్ణిమనాడు మాఘస్నానము, పూజ మున్నగునవి చేసిన వాని పాపములన్నియు నశించును.మాఘ వ్రతము నాచరించినవారు నాకిష్టులు వారు దేవతలై వైకుంఠమును చేరుదురు.          

     మాఘస్నానము ఆపదలను పోగొట్టి సంపదలనిచ్చును. మాసములలో మాఘమాసము గొప్పది. సూర్యుడు ప్రకాశించువారిలో గొప్పవాడు. అశ్వర్థ వృక్షము వృక్షములలో ఉత్తమము. దేవతలలో నేను(విష్ణువు) ఉత్తముడును. వేద అములు శాస్త్రములలో ఉత్తమము. ద్విజుడు అన్ని వర్ణములలో గొప్పవాడు. రాజులలో శ్రీరాముడు ఉత్తముడు.      

         ఋతువులలో వసంతము గొప్పది. మంత్రములలో రామతారకము ఉత్తమము. స్రీలలో లక్ష్మి దేవి ఉత్తమురాలు. నదులలో గంగ ఉత్తమమైనది. మేరువు పర్వతములలో గొప్పది. అన్ని  దానములలో ధనదానము గొప్పది. మాఘమాస వ్రతము అన్ని వ్రతములలో ఉత్తమము. మాఘమాస వ్రతము సర్వ ఫలప్రదము. కృష్ణవేణి, గంగా, కావేరీ ఇలా సర్వనదులయందును పది సంవత్సరముల పాటు సూర్యోదయ సమయమున స్నానము చేసినచో వచ్చు పుణ్యము,    

           మూడు దినములు అరుణోదయ సమయమున చేసిన మాఘస్నానము వలన వచ్చును. మాఘ స్నానము చేసి పూజ  మున్నగువానితో వివిధ పుష్పములతో సాలగ్రామరూపమున నున్న నన్ను పూజించిన మోక్షము వచ్చును, అని శ్రీమన్నారాయణుడు దేవతలకు మాఘవ్రత మహిమను వివరించెను.        దేవతలు విష్ణువాక్యమును శిరసావహించి యింద్రుని వెదకుచు పద్మగిరి పర్వతమును చేరిరి. ఇంద్రుని వెదకుచున్నవారికి చిన్న పాదములు, పెద్ద శరీరము కల విచిత్రమైన తొండయొకటి కనిపించెను. ఆ తొండ వారిని చూచి భయంకరమగు ధ్వనిని చేసినది. దేవతలు ఆ తొండ యొక రాక్షస రూపమని వారు తలచిరి.    

         దానిని తీగలతో బంధించిరి.ఎంత ప్రయత్నించినను ఆ తొండ కదలలేకపోయినది. మాఘమాస వ్రతము అమోఘమని శ్రీమహావిష్ణువు చెప్పిన మాట యెట్టిదో చూడవచ్చునని తలచి మరునాడు మాఘస్నానాదికమును చేసి ఆ తీర్థమును తొండపై పోసిరి.             పవిత్రోదకముచే తడిసిన తొండ దివ్యాలంకారములు కల స్త్రీగా మారెను. దేవతలామెను చూచి ఆశ్చర్యపడిరి. నీవెవరివని ఆమెనడిగిరి. ఆమెయు శాపవిముక్తికి సంతసించుచు. దేవతలకు నమస్కౌరించి యిట్లు పలికెను. నేను సుశీలయను పేరు కలదానను. కాశ్మీరమున నివసించు బ్రాహ్మణుని పుత్రికను. మా తండ్రి నాకు వివాహము చేసెను. నా దురదృష్టవశమున నా భర్త పెండ్లి జరిగిన నాల్గవనాడు మరణించెను.   

          మా తల్లితండ్రులు చాలా యెక్కువగా దుఃఖించిరి. నా తండ్రి "మనుష్య జన్మము కష్ట ప్రదము, స్త్రీగా పుట్టుట మరియు కష్టము. బాల్యముననే వైధవ్యమునందుట మరింత కష్టము. ఇట్లు బాల్యముననే భర్తను పోగొట్టుకొన్న ఈమెను చూడజాలను, ఈమెను బంధువులకు అప్పగించి వనమునకు పోయి తపమాచరించుటమేలని" తలచెను. పుత్రికనైన నన్ను బంధువుల వద్ద నుంచి నా తల్లితండ్రులిద్దరును వనవాసమునకు పోయిరి. అచటనే మరణించిరి.        

         నేనును బంధువుల వద్దనుంటిని, వారి నిరాదరణ ఫలితముగ చూచువారెవరును లేకపోవుటచే భిక్షాటనముచే జీవించుచుంటిని. నిలువయున్నదానిని భుజించుచు బిక్షలో వచ్చిన మంచి ఆహారమును అమ్ముకొనుచు జీవించుచుంటిని. భక్తి, వ్రతము మున్నగువానిని ఎరుగను. ఉపవాసమనేమో తెలియదు. ఏకాదశీ వ్రతము చేయువారిని చూచి పరిహాసము చేసితిని.        

      ధనమును దాచి సంపాదనపరురాలనైతిని. నన్ను కోరిన వారికి నన్ను అర్పించుకొనుచు, నేను కోరిన వారిని పొందుచు నీతి నియమములను విడిచి దురాచారవంతురాలనై జీవితమును గడిపితిని, తరువాత మరణించి నరకమును చేరితిని. అచట పెక్కు రీతుల శిక్షింపబడితిని.    

       పులి , కోతి, ఎద్దు మున్నగు పెక్కు జంతువుల జన్మనందితిని, పెక్కు బాధలను పడితిని. ఒకనాతి జన్మలో అయిదు దినముల క్రిందటి ఆహారమును ఆకలి కల వానికి పెట్టితిని, ఆ చిన్న మంచి పని వలన మీరు దయయుంచి నాకు శాపవిముక్తిని కలిగించిరి అని పలికెను మాఘ మాస పవిత్ర నదీజలస్పర్శచే ఆమె దేవతత్వమునంది దేవప్రియ అను పేరును పొందెను.      

       దేవతలలో ఒకరామెను వివాహమాడెను. మాఘమాస మహత్యమును దేవతలు గమనించి విస్మితులైరి. ఇంద్రుని వెదుకసాగిరి. పద్మగిరి గుహలలో వికారరూపముతో తిరుగుచున్న యింద్రుని జూచి బాధపడిరి. ఇంద్రుడును వారిని చూచి సిగ్గుపడెను, లోనికిపారిపోయెను. దేవతలను ఇంద్రుని జూచి వెంబడించి వానిని ఊరడించి ధైర్యము చెప్పిరి.        

    నీవు చేసిన పాపములను పొగొట్టుకొనుటకు మహావిష్ణువు నీ శాపవిముక్తికి మార్గమును సూచించెను, ఆ ప్రకారము చేయుదము రమ్మని తుంగభద్రాతీరమునకు తీసికొని వచ్చిరి. మాఘమాసమంతయు వానిచేత మాఘస్నానము చేయించిరి. ఇంద్రుడును శాపవిముక్తుడయ్యెను. కృతజ్ఞుడై విష్ణువును స్తుతించెను.    

  ఇంద్రుడు దేవతలతో కలసి స్వర్గమునకెగెను. రాక్షసులను జయించి సుఖముగనుండెను. గృత్నృదమదమహర్షి జహ్నుమునికి యీ విధముగ మాఘమాస స్నానమహిమను వివరించెనని పలుకుతుండగా జహ్నుముని, స్వామీ! యీ విష్ణు కథామృతము ఇంకను వినవలెననున్నది ఇంకను చెప్పుడని కోరెను.            గృత్నృమదుడిట్లనెను పూర్వము పంపాతీరమున ధనవంతుడైన వైశ్యుడొకడు కలదు. ధనసంపాదనము తప్ప ధనవినియోగము నాతదు చేయలేదు. పూజ, దానము మున్నగు మంచిపనులను గూడ చేయలేదు. అందువలన మరణించిన తరువాత నరలోకమును చేరెను. అచట కొంతకాలముండి దరిద్రుడై జనించెను. దరిద్రుడై మరిన్ని పాపకార్యములను చేసెను.           మరణించి పిశాచమై పంపాతీరమున మఱ్ఱిచెట్టు పైనుండి అచటకు వచ్చిన వారిని పీడించుచుండెను. ఒకప్పుడు వశిష్ఠమహర్షి ఆ ప్రాంతమునకు శిష్యులతో వచ్చి మఱ్ఱిచెట్టు సమీపమున నివసించుచు మాఘస్నానము పూజ మున్నగు చేయ్చు శిష్యులకు మాఘ్మాస మహత్త్యమును వివరించుచుండెను, అతదు మాఘస్నాన మహిమను వివరించుచు నొకనాడు మాఘస్నానము చేసిన వారి సర్వపాపములను సూర్యోదయమున చీకట్లు నశించినట్లుగా నశించును.    

         మాఘస్నానము చేయనివాదు నరకమునపోవును అనుచు మాఘమాస వ్రతమును చేయవలసిన విధానమును చేయుట వలని శుభములను, చేయకపోవుటవలని అశుభములను వివరించుచుండెను. ఆ సమయమున పిశాచరూపము పైనుండి క్రిందపడింది.           ఆ పిశాచము వశిష్ఠుడు మంత్రోదకమును వానిపై జల్లుచు పంపాజలమున మాఘస్నానమును వానిచే చేయించెను. వశిష్ఠుడు చెప్పిన హరి కథలను వినుట వలన, మాఘ స్నానము వలన వాని పిశాచరూపముపోయి దివ్య రూపము వచ్చినది. మాధవానుగ్రహము వలన వైకుంఠమును చేరెను. పిసినిగొట్టు వ్యాపారికి మాఘమాస ఫలము కలుగుట     

         వశిష్ఠ మహాఋషి దిలీపునకు పార్వతీదేవితో పరమేశ్వరుడు చెప్పిన పిసినారి వృత్తాంతమును యిట్లు తెలియజేసెను.      

        “పార్వతీ! చాలాకాలం క్రిందట దక్షిణప్రాంతమందలి వసంతవాడయను నామము గల పెద్ద పల్లెయుండెను. అందొక బంగారు శెట్టి అను వైశ్యుడొకడు ఉండెను. అతని భార్య పేరు తాయారమ్మ బంగారు శెట్టి వట్టి పిసినిగొట్టు. తనకున్న పిత్రార్జిత సంపదయే లెక్కకు మిక్కుటముగా నున్నది. కాని అతడు ఇంకనూ ధనాశ కలవాడై తనవద్దనున్న ధనమును వడ్డీలకిచ్చి మరింత సంపన్నుడయ్యెను.      

         కానీ ఒక్కనాడైనా హరిని ధ్యానించడం కానీ, దానధర్మాలు చేయుట గానీ ఎరుగడు. అంతేగాక బీద ప్రజలకు వారి ఆస్తులపై వడ్డీలకు ఋణాలు ఇచ్చి అనుకున్న గడువుకు ఋణము తీర్చనందున తప్పుడు సాక్ష్యాలతో వ్యాజ్యములు వేసి వారి ఆస్తులు సైతము స్వాధీన పరుచుకునే వాడు.              ఒకనాడు బంగారు శెట్టి గ్రామాంతరము వెళ్ళెను. ఆరోజు సాయంత్రం ఒక ముదుసలి బ్రాహ్మణుడు బంగారు శెట్టి భార్యను చూసి తల్లీ నేను ముసలి వాడను. నా గ్రామము చేరవలయునన్న ఇంకనూ పది ఆమడలు వెళ్ళవలసి ఉన్నది. ఇప్పుడు చీకటి కాబోతున్నది. ఆకాశంలో మేఘాలు ఉరుముతున్నాయి.      

     చల్లగాలికి వణికిపోతున్నాను. మీ ఇంటివద్ద ఈరాత్రి గడువనియ్యి. నీకెంతైనా పుణ్యముంటుంది. నేను సద్బ్రాహ్మణుడను, సదాచార వ్రతుడను. ప్రాతఃకాలమున మాఘ స్నానం చేసి వెళ్ళి పోదును అని బ్రతిమలాడెను. తాయారమ్మకు జాలి కలిగెను. వెంటనే తన అరుగు మూల శుభ్రం చేసి అందొక తుంగ చాప వేసి కప్పుకొనుటకు వస్త్రమిచ్చి పండుకొనుండని పలికెను.         

     ఆమె దయార్ద్ర హృదయమునకు ఆ వృద్ధ బ్రాహ్మణుడు సంతసమొంది విశ్రాంతి తీసుకొనుచుండగా తాయారమ్మ ఒక ఫలము ఇచ్చి దానిని భుజించుమని చెప్పి ఆర్యా! మాఘ స్నానము చేసి వెళ్ళెదనన్నారు కదా! ఆ మాఘ స్నానమనగానేమి? దాని వలన కలుగు ఫలితమేమి? సెలవిండు. వినుటకు కుతూహలముగా ఉన్నది. అని అనగా ఆ వృద్ధ బ్రాహ్మణుడు దుప్పటి కప్పుకొని “అమ్మా! మాఘ మాసము గురించి చెప్పుటకు నాకు శక్యము గాదు.         

   ఈ మాఘ మాసములో నదియందు గానీ, తటాకమందు గానీ, లేక నూతియందు గానీ సూర్యోదయం అయిన తర్వాత చన్నీళ్ళు స్నానం చేసి విష్ణు మందిరానికి వెళ్ళి తులసీ దళంతోనూ, పూవుల తోనూ, పండ్లతోనూ, పూజ చేసి స్వామివారి ప్రసాదమును స్వీకరించవలెను. తరువాత మాఘ పురాణం పఠించవలెను. ఇట్లు ప్రతిదినమూ విడువకుండా నెలరోజులు చేసి ఆఖరున బ్రాహ్మణునకు సమారాధన, దానములు ఇవ్వవలెను.           

   అట్లు చేసిన యెడల మానవునికున్న రౌరవాది మహాపాపములు వెంటనే నశించి పోవును. ఒకవేళ ఈ నెలరోజులూ చేయలేని వారు వృద్ధులు, రోగులు ఒక్కరోజైననూ అనగా ఏకాదశి రోజున గానీ, ద్వాదశి నాడు గానే, పౌర్ణమి దినమున గానీ పైప్రకారము చేసినచో సకల పాపములు వైదొలగి సిరి సంపదలు, పుత్ర సంతానం కలుగును.         

     ఇది నా అనుభవంతో తెలియజేయుచున్నాను” అని చెప్పగా ఆ బ్రాహ్మణుని మాటలకు తాయారమ్మ మిక్కిలి సంతసించి తాను ప్రాతఃకాలమున బ్రాహ్మణునితో నదికి పోయి స్నానం చేయుటకు నిశ్చయించుకొనెను.అంతలో పొరుగూరికి వెళ్ళిన తన భర్తయగు బంగారు శెట్టి ఇంటికి వచ్చినాడు. అతడు రాగానే మాఘస్నానం గురించి చెప్పి తాను తెల్లవారు జామున స్నానమునకు పోవుదునని తెలియజేసెను.               భార్య చెప్పిన మాటలకు బంగారుశెట్టి కోపము వచ్చి వంటినిండా మంటలు బయలుదేరినట్లుగా పళ్ళు పటపట కొరికి ఓసీ వెర్రిదానా! ఎవరు చెప్పినారే నీకీ సంగతి? మాఘ మాసమననేమిటి? స్నానమేమిటి? వ్రతము, దానములేమిటి? నీకేమైనా పిచ్చి పట్టినదా? చాలు చాలు అధిక ప్రసంగం చేసినచో నోరు నొక్కి వేయుదును.       

         డబ్బులు సంపాదించుటలో నా పంచ ప్రాణములు పోవుచున్నవి. ఎవరికినీ ఒక్క పైసా కూడా వదలకుండా వడ్డీ వసూలు చేస్తూ కూడబెట్టిన ధనము దానము చేయమనెదవా? చలిలో చన్నీళ్ళు స్నానం చేసి పూజ చేసి దానములు చేస్తే ఒళ్ళు, ఇల్లు గుల్లై నెత్తిపైన చెంగు వేసుకొని, భిక్షాం దేహి అని అనవలసిందే.      

       జాగ్రత్త! వెళ్ళి పడుకో! అని భర్త కోపిగించినాడు. ఆ రాత్రి తాయారమ్మకు నిద్ర పట్టలేదు. ఎప్పుడు తెల్లవారునా, ఎప్పుడు నదికి వెళ్ళి స్నానము సేతునా? అని ఆత్రుతగా ఉన్నది. కొన్ని ఘడియలకు తెల్లవారినది. తాను కాలకృత్యములు తీర్చుకొని ఇంటికి వచ్చియున్న వృద్ధ బ్రాహ్మణునితో మొగనికి చెప్పకుండా నదికి పోయి స్నానము చేయుచున్నది.    

         ఈలోగా బంగారు శెట్టి పసిగట్టి ఒక దుడ్డుకర్ర తీసుకొని నదికి పోయి నీళ్ళలో దిగి భార్యను కొట్టబోవుచుండగా ఆ యిద్దరూ కొంత తడవు నీళ్ళలో పెనుగులాడిరి. అటుల పెనుగు లాడుచుండగా ఇద్దరూ నీళ్ళలో మునగవలసి వచ్చెను.       

    అటుల మునుగుటచే ఇద్దరికీ మాఘ మాస ఫలము దక్కినది. భార్యను కొట్టి ఇంటికి తీసుకు వచ్చినాడు.కొన్ని సంవత్సరములు జరిగిన తర్వాత ఒకనాడు ఇద్దరికీ ఒక వ్యాధి సోకినది. మరికొన్ని రోజులకు ఇద్దరూ చనిపోవుటచే బంగారు శెట్టిని తీసుకొని పోవుటకు యమభటులు వచ్చి కాలపాశము వేసి తీసుకొని పోవుచుండిరి.              తాయారమ్మను తీసుకొని పోవుటకు విష్ణు దూతలు వచ్చి ఆమెను రథముపై ఎక్కించుకొని తీసుకొని పోవుచుండిరి. అప్పుడు తాయారమ్మ యమ భటులతో ఇట్లు పలికెను.           

   ఓ యమ భటులారా! ఏమిటీ అన్యాయము? నన్ను వైకుంఠమునకు తీసుకు పోవుట ఏమి? నా భర్తను యమ లోకమునకు తీసుకొని పోవుట ఏమిటి? ఇద్దరమూ సమానమే కదా! అని వారి నుద్దేశించి అడుగగా “ఓయమ్మా! నీవు మాఘమాసములో ఒకదినమున స్నానము చేసితివి. అదియు ఆ వృద్ధ బ్రాహ్మణుని వలన విని స్నానం చేయగా నీకీ ఫలం దక్కినది.              

  కానీ నీ భర్త అనేకులను హింసించి అన్యాయంగా ధనార్జన చేసి అనేకుల వద్ద అసత్యములాడి నరకమన్న భయము లేక భగవంతునిపై భక్తి లేక వ్యవహరించినందునే యమలోకమునకు తీసుకొని పోవుచున్నాము. అని యమభటులు పలికిరి. ఆమె మరల వారినిట్లు ప్రశ్నించెను.            

    నేను ఒకే ఒక దినమున స్నానము చేసినందున పుణ్య ఫలము కలిగినప్పుడు నన్ను కొట్టుచూ నాతో నాభర్త కూడా నీట మునిగినాడు కదా! శిక్షించుటలో ఇంత వ్యత్యాసమేల కలిగెను? అని అనగా ఆ యమభటులకు సంశయం కలిగి ఏమియూ తోచక చిత్రగుప్తుని వద్దకు వెళ్ళి జరిగిన సంగతి ఆమె వేసిన ప్రశ్నలు తెలియజేసిరి.                చిత్రగుప్తుడునూ వారి ఇద్దరి పాప పుణ్యముల పట్టిక చూడగా ఇద్దరికీ సమానమైన పుణ్య ఫలము రాసి ఉన్నది. జరిగిన పొరపాటునకు చిత్రగుప్తుడు విచారించి బంగారు శెట్టిని కూడా వైకుంఠమునకు తీసుకొని పొమ్మని విష్ణు దూతలతో చెప్పెను. విష్ణు లోకమునకు ముందుగా వెళ్ళియున్న తాయారమ్మ భర్త గతి ఏమయ్యెను? అని ఆత్రుతతో ఉండగా బంగారు శెట్టిని పుష్పక విమానం మీద తెచ్చి వైకుంఠములో విడిచిరి. భార్యాభర్తలు ఇద్దరూ మిక్కిలి సంతసమందిరి.          

   రాజా! వింటివా. భార్య వల్ల భర్తకు కూడా ఎటుల మోక్షము కలిగెనో. భర్త దుర్మార్గుడై పిసినిగొట్టుగా వ్యవహరించిననూ భార్య యథాలాపంగా ఒక్కరోజు మాఘస్నానం చేసినందున ఇద్దరికీ వైకుంఠ ప్రాప్తి కలిగినది కదా! కనుక మాఘ స్నానం నెలరోజులూ చేసినచో మరింత మోక్షదాయకం అగుననుటలో సందేహం లేదు. మీ వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు శాంతి నగర్,ఖాధీ కాలని,తిరుపతి