తిరుప్పావై 29వ రోజు పాశురము

శిత్తమ్ శిఱుకాలే వంద్ ఉన్నై చ్చేవిత్తు ఉన్
పొత్తామరై యడియే పోట్రుం పొరుళ్ కేళాయ్
పెత్తం మేయ్ త్తుణ్ణుం కులత్తిల్ పిఱందు, నీ
కుత్తేవల్ ఎంగలై క్కోళ్ళామల్ పోగాదు
ఇత్తై పఱై కోళ్వాన్ అన్ఱు కాణ్ గోవిందా!
ఎత్తెక్కుం ఏరేర్ పిఱవిక్కుం ఉన్ తన్నో
డుత్తోమేయావోం ఉనక్కే నాం అట్చెయ్ వోం
మత్తై నం కామంగళ్ మాత్త్-ఏలోర్ ఎంబావాయ్

ఈ రోజు ఆండాళ్ తన వెంట ఉన్న గోపీ జనాలతో తను ఏం కోరి వచ్చిందో నీరూపించిన రోజు. మన వాళ్ళు మేం పరిశుద్దులమై వచ్చాం అని గతంలో రెండు సార్లు చెప్పారు, మేం ఏ ఇతర ఫలితాలు కోరి రాలేదు, ఏ ఉపాయాలు కూడా వాళ్ళ వద్ద లేవని నిన్న చెప్పారు. ఈరోజు స్వామి ముందర తమ ఆర్తిని ఆవిష్కరిస్తున్నారు. మేం రావడం సాధన కాదు, మా ఆర్తిని చూసైనా అనుగ్రహించాలని అనిపించటం లేదా అని అంటున్నారు. "శిత్తమ్ శిఱుకాలే" ఇంకా చీకటి తొలగని తెల తెల వారే సమయంలో "వంద్" మేం నీ దగ్గరికి వచ్చాం. మాలో ఆర్తి పెంచినది నీవే కదా, ఎంత కాలం నీవు చేసిన ఫలితమో ఇన్నాళ్ళకు మాకు ఈ జ్ఞానం కల్గింది. ఇది నీవు చేసిన కృపేకదా. "ఉన్నై చ్చేవిత్తు" అన్ని నీవు చేసినవాడివి, శభరి లాంటి వారికి నీవే వెళ్ళి అనుగ్రహించావు. కానీ మేం చేయాల్సి వస్తుంది. మేం నిన్ను సేవిస్తున్నాం. మనకున్న జ్ఞానంతో ఒక్క సారి మేం నీవాడమని చెప్పగల్గుతే, ఇది రాగ ప్రయుక్తం. "ఉన్ పొత్తామరై యడియే పోట్రుం" నీ పద్మాలవంటి ఆ దివ్యమైన పాదాలకు మంగళం పాడుతున్నాం.

"ఎం కించిత్ పురుషాదమం కటిపయ గ్రాణేశం అల్పార్దకం సేవాయ" ఈ లోకంలో అల్పమైన పురుషార్దం కోసం వాడి కున్న కొంత ఆస్తి చూసి వాడే నాయకుడని చుట్టూ, మరియు వీల్ల వాల్ల చుట్టూ తిరుగుతారే జనం ఎంత ఆశ్చర్యం కదా. "నాదేన పురుషోత్తమే త్రిజగతామే ఏకాధిపే చేతసా సేవ్యె సస్య పదస్య దాసరీ సురే నారాయణే తిష్టతి" సమస్త జీవులకు నాథుడై ఉన్న ఆ పురుషోత్తముడు ఆయన కదా, ఆయన ముల్లోకాలను నడిపేవాడు, చేతులు కట్టుకున్నా సరే ఒక్క సారి మనస్సులో నీవాడనని తెలిపినా ఆయన పరమ పదాన్ని ఇస్తాడు అని కులశేఖర ఆళ్వార్ చెప్పినట్లుగా, మేం నీ పాదాలను పాడటనికి వచ్చాం అని చెప్పారు.

ఆయన ఏం విననట్టుగా సుదీర్గమైన ఆలోచనలో పడి ప్రేమతో వీళ్ళకేసి చూస్తున్నాడు. "పొరుళ్ కేళాయ్" మేం ఎందుకు స్తుతిస్తున్నామో వినవయ్యా అంటూ ఆయనను తట్టి పాటం చెబుతోంది గోదా. ఆండాళ్ తల్లికి పాటం చెప్పడం అలవాటు కదా. ఆయనకీ పాటం చెప్పగలదు. "పెత్తం మేయ్ త్తుణ్ణుం కులత్తిల్ పిఱందు" మొదట పశువులని మేపి అవి తిన్నాకగాని మేం తినేవాళ్ళం కాదు. నీకు మా స్వరూపం తెలియదా. మరి నీవేమి చేస్తున్నావు! మాకు ఆహారం నీ సేవయే, అది మాకు లభించాకే, ఆ తర్వాతే కదా నీవు ఆహారం తినాలి, "నీ కుత్తేవల్ ఎంగలై క్కోళ్ళామల్ పోగాదు" నీ ఆంతరంగిక సేవకై మమ్మల్ని స్వీకరించవలసిందే. ఏదో వ్రత పరికరాలు అని అన్నారు ఇదిగో అని అక్కడ పెట్టాడు. "ఇత్తై పఱై కోళ్వాన్ అన్ఱు కాణ్ గోవిందా!" మేం ఎదో అడగాలని వాటిని అడిగాం, మేం కోరేవి ఇవికాదు. కేవలం మాట పట్టుకొని చూస్తావా, మా మనస్సులో ఏం ఉందో తెలియదా అని అడిగారు. నాకేం తెలియదు, నేను మీ గొల్లల్లో ఒకడినే కదా అని అన్నాడు శ్రీకృష్ణుడు.

"ఎత్తెక్కుం" ఎల్లప్పటికీ, ఈ కాలం ఆ కాలం అని కాదు, సర్వ దేశముల యందు, సర్వ అవస్తల యందు, "ఏరేర్ పిఱవిక్కుం" ఏడేడు జన్మలలో కూడా "ఉన్ తన్నో డుత్తోమేయావోం" నీతో సంబంధమే కావాలి. కాలాధీనం కాని పరమపదంలో ఉన్నామాకు నీ సంబంధమే ఉండాలి "ఉనక్కే నాం అట్చెయ్ వోం మత్తై నం కామంగళ్ మాత్త్" కేవలం నీ ఆనందం కోసమే మా సేవ అంకితమై ఉండాలి. తెలియక ఏదైన లోపం ఉంటే నీవే సరిదిద్దాలి, మాపై భారం వెయ్యవద్దు.

ఇలా వ్రతం ఆచరించిన అందరికి ఫలితం లభించింది. శ్రీకృష్ణ సమాగమం లభించింది, దీనికి సహకరించిన వారికి కోరినవి లభించాయి. ఈ రోజు పురుషార్థం పొందిన రోజు. ఈ రోజు స్వామి గోదాదేవిని రప్పించుకొని మానవ కన్యగా ఉన్న ఆమెను తాను విగ్రహరూపంలోనే వివాహమాడాడు. గోదాదేవి కోరిన వైభోగాన్ని పొందిన రోజు కనక "భోగి" అంటారు.

No automatic alt text available.