తిరుప్పావై పాశురములు
తిరుప్పావై 24వ రోజు పాశురము -తిరుప్పావై పాశురములు

24వ రోజు - స్వామికి మంగళం

ఆండాళ్ తిరువడిగలే శరణం

పాశురము

అన్ఱివ్వులగమ్ అళందాయ్ అడి పోత్తి
శెన్ఱంగు త్తెన్-ఇలంగై శెత్తాయ్ తిఱల్ పోత్తి
పొన్ఱచ్చకడం ఉదైత్తాయ్ పుగర్ పోత్తి
కన్ఱుకుణిలా వెఱిందాయ్ కరిల్ పోత్తి
కున్ఱుకుడైయా వెడుత్తాయ్ కుణమ్ పోత్తి
వెన్ఱు పకై కెడుక్కుమ్ నిన్ కైయిల్ వేల్ పోత్తి
ఎన్ఱెన్ఱుమ్ శేవకమే యేత్తి ప్పఱైకొళ్వాన్
ఇన్ఱు యాం వందోం ఇరంగ్-ఏలోర్ ఎంబావాయ్

నిన్న మన వాళ్ళు స్వామిని లేచి రమ్మని చెప్పారుకదా, స్వామి వస్తుంటే ఆయనపాదాలను చూసారు అవి కందిపోయినట్లు అనిపించింది. పాదాలు స్వతాహా గులాభి రంగులో ఉంటాయి కానీ వీళ్ళకేమో వీళ్ళ పిలుపికి స్వామి నడిచి వచ్చినందుకు కంది పోయాయి అనుకుంటున్నారు. వీళ్ళేమి కోరి రాలేదు కదా. కేవలం శ్రీకృష్ణుణ్ణి చూసి అనందిద్దామని వచ్చారు. ఆయన సింహాసనంపై కూర్చొని, చిలిపి వాడు కదా, వీళ్ళను ఏడిపిద్దాం అన్నట్లుగా ఒక కాలు క్రింద పెట్టి “సవ్య పాదం ప్రసవ్య” ఎడమకాలు ప్రసరింపచేసాడు, “సృత దురితహరం దక్షిణం కుంచయిత్వా” దానిపై కుడి కాలు ఉంచి వీళ్ళకు తన పాదాలు కనిపించేలా అడిస్తూ కూర్చున్నాడు. ముఖారవిందం పదారవిందం అన్నీ అరవిందములవలే సుకుమారము, సౌగంద్యము, కోమలత్వము కల్గినవి కదా, ఆయన పాదాలని చూసి అయ్యో ప్రేమ ఉంది అని నటిస్తూ మేం కూడా నీ పాదాలు కందిపోయేలా చేసామే అంటూ భాదపడ్డారు. వెంటనే స్వామి దివ్య పాదారవిందాన్ని మొదలుకొని మంగళం పాడుతున్నారు.

ఈ రోజు పాశురాన్ని మంగళాశాసన పాశురం అంటారు. భగవంతుణ్ణి తెలుసుకున్న జీవుడికి రెండు రకాల దశలు ఉంటాయి. మొదటిది జ్ఞాన దశ, రెండోది ప్రేమ దశ. జ్ఞాన దశలో భగవంతుడు ఎట్లాంటివాడో, తనూ ఎట్లాంటివాడో తెలుసుకోవడం. భగవంతుడు చాలా గొప్పవాడు, జగత్తును రక్షించేవాడు అని తెలుసుకోవడం. తను ఏ జ్ఞానం లేనివాడు, భగవంతుడు రక్షిస్తే తప్ప రక్షణ లభించదు అని తెలుసుకుంటాడు. ఇక ఈ జ్ఞానం పండితే క్రమంగా ప్రేమ లేక భక్తి దశగా మారుతుంది. ఈ దశలో భగవంతుని కున్న శక్తిని మరచి ఆయన కున్న సౌకుమార్యం, సౌశీల్యం అనే గుణాలనే చూస్తాడు. ఇక తను అజ్ఞానిని అని మరచి తనే భగవంతుణ్ణి రక్షించుకోవాలని అనుకుంటాడు. ఒకనాడు జ్ఞానం కల్గినప్పుడు భగవంతుడు తనని రక్షించేవాడని భావించే అతను, భక్తితో ఈనాడు తాను భగవంతుణ్ణి రక్షించుకోవాలి అన్నట్టుగా మారుతాడు. ఏదైన ఒక వస్తువు విలువైనది అని మనకు తెలిస్తే మనం ఎట్లా అయితే రక్షించుకుంటామో అట్లానే. అందుకే మనం ఆలయాల్లో తలుపులు, తాళం అని ఇలా చేస్తుంటాం, జగత్ రక్షణ చేసే వాడికి మనం రక్షణ ఏంటి కనుక. అది ప్రేమచే చేస్తాం. దృష్టిదోషం తొలగుగాక అని, కర్పూరం ఎట్లా అయితే హరించుకు పోతుందో అట్లా దోషాలన్ని హరించుగాక అని మంగళం పాడుతాం.

గోదాదేవికి ఈ విషయం వాళ్ళ నాన్న గారు తెలిపారు. విష్ణుచిత్తులవారు మధురానగరం వెళ్ళి పాండ్య రాజ్యసభలో భగవత్ తత్వాన్ని నిరూపిస్తారు. అందుకు వారిని ఏనుగుపై అంబారీ చేసి ఊరేగిస్తుంటే భగవంతుడు ఆయనకు ప్రత్యక్షమైనాడు. వీళ్ళ కంటికి నీవు కనపడితే నీకు దృష్టి దోషం తగులును అని మంగళం పాడారు. పల్-ఆండు అనేక సంవత్సరాలు, పల్-ఆండు అనేక సంవత్సరాలు పలకోటి నూరు - ఇలా కోట్ల సంవత్సరాల వరకు నీకు మంగళం, శంఖానికి, చక్రానికి, పక్కన అమ్మకి అంటూ ఇలా మంగళం పాడారు. శ్రీరామాయణంలో కూడా రాముని పరాక్రమం తెలిసినవారుకూడా రామునికి ఎన్నోసార్లు మంగళం పాడారు. జగత్ కారణ తత్వం దేవకీ గర్భంలో ఉందని తెలిసి కూడా, ఆ చతుర్ హస్తాల్తో ఉన్న కృష్ణుడిని చూసి కంసునికి తెలిస్తే నీకే ఉపద్రవం వస్తుందోనని అన్నీ వెనక్కి దాచేసుకో అని దేవకీ అంటుంది. ఇవి ప్రేమతో చేసేవి. మన ఆలయాల్లో హారతి ఇచ్చే సంప్రదాయం కూడా ఇలా వచ్చిందే. అయితే హారతిని కళ్ళకు హద్దుకోరాదు. హారతిని ఆర్పి పక్కన పెట్టి, ఎవరికైతే దృష్టిదోషం తీస్తామో వారికి కళ్ళు, పాదాలు కడిగి ఆచమనం చేయిస్తాం. నీకు మంగళం అవుగాక అనేదే దీని అర్థం. ఈ జగత్తుకు పరమాత్మ వేరు కదా, ఆయన క్షేమంగా ఉంటే లోకం అంతా క్షేమం, ఇక ఆయనను కోరాల్సిన అవసరం ఏంటి కనుక.

ఆండాళ్ ఏనాడో ఆయన నడిచివచ్చినందు పాదాలు కందిపోయాయని మంగళం పాడుతుంది. వీళ్ళకు కాలంతో ప్రమేయం లేదు, ఎందుకంటే కాలం అనేది కూడా ఒక గాజుగోడ లాంటిదే. వీరి ముందేనా అంతా జరుగుతున్నది అని పరమ భక్తులు భావిస్తారు. "అన్ఱివ్వులగమ్" ఆనాడు వామనుడై లోకాలను "అళందాయ్" కొలిచిన, ఒక్కసారి అంతలా పెరిగినందుకు నీ పాదాలు ఎంత కందిపోయాయే! "అడి" ఆ పాదాలకు "పోత్తి" మంగళం.

"శెన్ఱ్" వెళ్ళి "అంగు" అక్కడ ఉన్న "త్తెన్-ఇలంగై" దక్షిణ దిక్కున అందంగా ఉన్న లంకానగరాన్ని పాలించే రావణాసురున్ని "శెత్తాయ్" సంహరించిన "తిఱల్" నీ భుజబలానికి "పోత్తి"మంగళం.

"పొన్ఱ"తారుమారు అయ్యేలా "చ్చకడం" శకటాసురున్ని "ఉదైత్తాయ్" తన్ని అంతమొందిచావు, ఏడు నెలల బాలుడవి, "పుగర్" నీ కీర్తికి "పోత్తి" మంగళం.

"కన్ఱు" దూడ రూపంలో ఉన్న వత్సాసురున్ని "కుణిలా" కర్రలా మార్చి వెలగ పండులో దాగిఉన్న కపితాసురునిపై "వెఱిందాయ్" గిరగిరా తిరిగి విసిరిపాడేసి "కరిల్" నీ పాదానికి "పోత్తి" మంగళం.

"కున్ఱు" పర్వతాన్ని "కుడైయా" గొడుగులా "వెడుత్తాయ్" ఎత్తి పట్టి అందరిని దరిన చేర్చుకున్న నీ "కుణమ్" సౌశీల్య గుణానికి "పోత్తి" మంగళం.

ఆండాళ్ స్వామిచేసిన ఇన్ని కార్యాలను కీర్తించిందికదా, ఎక్కడైనా దృష్టిదోషం తగులుతుందేమోనని, ఇవన్నీ చేసింది కృష్ణుడు కాదు అన్నట్లుగా "వెన్ఱు" గెలిచి "పకై కెడుక్కుమ్" విరోదభావం లేకుండా చేసే "నిన్ కైయిల్" నీ హస్తంలో ఉన్న "వేల్" శూలాయుధానికి, తండ్రి నందగోపుడి వద్ద ఉన్న ఆయుధం "కూర్వేల్" ఇదేకదా, ఆ శూలానికి "పోత్తి" మంగళం.

"ఎన్ఱెన్ఱ్" ఎల్లప్పుడు "ఉమ్ శేవకమే" నీ చరితమునే "యేత్తి" కీర్తించేలా "ప్పఱై" ఆ వాయిద్యాన్ని "కొళ్వాన్" తీసుకుంటాం. "ఇన్ఱు" ఈ రోజు "యాం" మేం ఎందుకు "వందోం" వచ్చామో "ఇరంగ్" తెలుసుకొని అనుగ్రహించు అంటూ ఈరోజు స్వామిని అడుగుతున్నారు.

నిన్న స్వామిని లేపి ఆసనంపై కూర్చోబెట్టారు, ఈ రోజు దృష్టి దోషం తొలగటానికి మంగళం పాడుతున్నారు. విగ్రహ రూపంలో ఉండే భగవంతుని వద్ద కూడా ఇంత సేవ జరుగుతుంది .ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మన ఇంట్లో కావచ్చు, మందిరంలో కావచ్చు విగ్రహం అంత శక్తి కలది, ఇది మన ఆండాళ్ మనకు తెలుపుతుంది.

ఆండాళ్ తిరువడిగలే శరణం
జై శ్రీమన్నారాయణ్ 
మీ గురు ప్రసాద్ రామానుజ దాస

No automatic alt text available.