తిరుప్పావై 14వ రోజు పాశురము

ఉంగళ్ పురైక్కడై త్తోట్టత్తు వావియుళ్
శెంగరునీర్ వాయ్ నెగిర్ అంద్ ఆమ్బల్ వాయ్ కుమ్బిన కాణ్
శెంగల్పొడి క్కూరై వెణ్బల్ తవత్తవర్
తంగళ్ తిరుక్కోయిల్ శంగిడువాన్ పోగిన్ఱార్
ఎంగళై మున్నం ఎరుప్పువాన్ వాయ్ పేశుమ్
నంగాయ్! ఎరుందిరాయ్ నాణాదాయ్! నావుడైయాయ్
శంగోడు చక్కరం ఏందుం తడక్కైయం
పంగయ క్కణ్ణానై ప్పాడ-ఏలోర్ ఎంబావాయ్

మన ఆండాళ్ తల్లి ఒక్కొక్క గోపబాలికను లేపుతూ ఒక్కో వేద రహస్యాన్ని మనకు తెలియజేస్తుంది. ఊహకు అందని సృష్టి రహస్యాలు ఋషుల ద్వార వేదాలుగా మనకు లభించాయి. ఇవి ఇంద్రియాలకు అందనివి. ప్రత్యక్షం, అనుమానం , వేదం (లేక శబ్దం లేక ఆప్తవాక్యం) ఈ మూడు మన ప్రమాణాలు. ఈమూడు ఎట్లా వాడుకోవాలో చెప్పేవాళ్ళే మనకు ప్రామాణికులు. అనుమానం, ప్రత్యక్షంలలో మనం పూర్తిగా దేన్ని గుర్తించలేం. మన జ్ఞానేంద్రియాలలో కూడా లోపం ఉంటుంది కనుక. అందుకే మనం వేద మార్గాన్ని విశ్వసిస్తాం. వేదమార్గాన్ని అనుసరించేవారే మనకు ప్రామాణికులు. మన మాట, చేత, మన ఆచారం, మన వ్యవహారాలకు ఒక వైదికమైన ఆధారం కావాలి. మనకు రామాయణం, మహా భారతం, పురాణాలు మనకు ఏది వైదికమో ఏది అవైదికమో తెలిపాయి. లోపలగోపబాలిక గొప్ప ప్రామాణికురాలు మంచిగా మాట్లాడగలదు కూడా, అందుకే మన ఆండాళ్ తల్లి ఆమె వెంట నడిస్తే శ్రీకృష్ణుడు దగ్గర మంచిగా మాట్లాడి అయనను తప్పనిసరిగా అనుగ్రహించేట్టు చేసుకోవచ్చు అని ఈ గోప బాలికను కూడా లేపడం ప్రారంభించింది.

"శెంగరునీర్ వాయ్ నెగిర్ అంద్" ఎర్ర కలవలు వికసిస్తున్నాయి "ఆమ్బల్ వాయ్ కుమ్బిన కాణ్" నల్ల కలువలు ముకిళించుకుపోతున్నాయి అని లోపల గోపబాలికతో అన్నారు. సూర్యోదయం కాగానే ఎర్ర కలువలు వికసిస్తాయి, రాత్రి కాగానే నల్ల కలువలు వికసిస్తాయి. సూర్యోదయంతో నల్ల కలువలు ముకుళించుకుపోతాయి. ఇది లోకంలో ఒక నియమం. లోపల గోప బాలిక మీరే తొందరతో ఎర్ర కలువల్ని విప్పి ఉంటారు, నల్ల కలువల్ని ముడుచుకొనేలా చేసి ఉంటారు అని పెద్దగా పట్టిచ్చుకోలేదు. లేదమ్మా అయితే, "ఉంగళ్ పురైక్కడై" నీ ఇంటి పెరటి "త్తోట్టత్తు వావియుళ్" తోటలోని దిగుడు బావిలో ఉన్న కలువలు కూడా వికసించాయి కావలిస్తే చూసుకో. అంటూ ఇక్కడ అనుమాన ప్రమాణాన్ని వాడారు. ఇక్కడ "నీ" అని సంభోదించినా లోపల గోపబాలిక బాగా వేదాంతురాలు ఉన్నట్లుంది, నీ అన్నా లోపల పరమాత్మ వరకు భావించి, పెద్దగా పట్టిచ్చుకోలేదు. పైగా వీళ్ళు ఒక మాట వ్యంగముగా ప్రయోగించారు, ఏమిటంటే లోపల తోటలో గోప బాలిక శ్రీకృష్ణుడికోసం ఎదురుచూస్తుంటే వెనకనుండి శ్రీకృష్ణుడు ఆమె కళ్ళు మూసినప్పటి సన్నివేశం ఊహించుకొని, శ్రీకృష్ణుడి కళ్ళను ఎర్ర కలువలతో పోల్చారు, గోప బాలిక కళ్ళను నల్ల కలువలతో పోల్చారు. పెద్దగా పట్టిచ్చుకోలేదు లోపల గోపబాలిక.

"శెంగల్పొడి క్కూరై" కాషాయాంభరధారులు "వెణ్బల్ తవత్తవర్" తెల్లటి పలువరుసలు కల్గిన యోగులు "తంగళ్ తిరుక్కోయిల్ " ఆరాధనకై తమ తమ పెరుమాళ్ళ ఆలయాలకి "శంగిడువాన్" తాళాలు తెరువడానికి "పోగిన్ఱార్" వెళ్తున్నారు. మేము ప్రత్యక్షంగా చూసాం అంటూ ప్రత్యక్ష ప్రమాణాన్ని వాడారు గోపికలు. తాళం తీయడం జ్ఞానముద్రలా ఉంటుంది, అందుకే ఇక్కడ ఆండాళ్ తల్లి, లోపల గోపబాలికను పెద్ద జ్ఞానిగా భావించి, తమకూ జ్ఞానం ప్రసాదించవమ్మా అంటూ చమత్కారంగా వర్ణిస్తుంది.

అలాగే మేం ఆప్తవాక్యాన్ని కూడా నమ్ముతాం, అంటూ "ఎంగళై" మమ్మల్నందరిని "మున్నం ఎరుప్పువాన్" ముందే లేపుతాను అని "వాయ్ పేశుమ్" వాగ్దానం చేసావు. "నంగాయ్!" పెద్ద పరిపూర్ణురాలివే! "ఎరుందిరాయ్" లేవమ్మా "నాణాదాయ్!" నీకు సిగ్గు అనిపించటంలేదా "నావుడైయాయ్" పెద్ద మాటకారిదానివి.

జ్ఞానులు తమ హృదయంలో భగవంతుని ఉపాసన చేసేటప్పుడు హృదయంలో పుండరీకాక్షుని రూపంలో ఉండేస్వామిని ఉపాసన చేస్తారు. దీన్నే దహర విధ్య అంటారు వేదాల్లో. లోపల గోపబాలిక దహరవిధ్యలో పరినిష్నాత అయి ఉండచ్చేమో "శంగోడు చక్కరం ఏందుం తడక్కైయన్ పంగయ క్కణ్ణానై ప్పాడ" ఆమె హృదయం, దానిలో దహరాకాశం, అందులో స్వామి, ఆయన నేత్ర సౌందర్యాన్ని మేం పాడుతున్నాం, నీవు ఆ యోగ్యత కల్గిన దానివి, నీవూ లేచి మాతో కలిస్తే అందరం కల్సి స్వామిని పాడుదాం అంటూ లోపల గోప బాలికను లేపారు.

Image may contain: 2 people