సంక్రాంతి

సంక్రాంతి..అంటే..!
అందరికీ.. ముందుగా..మూడురోజుల పండుగ.. సంక్రాంతి..శుభాకాంక్షలు..!!🙏

హిందువులు అంతా పెద్దల నుండి పిన్నల వరకు అత్యంత ప్రీతిపాత్రంగా ఆచరించే పండుగలలో "సంక్రాంతి"ఒకటి. 
ఇది పుష్యమాసంలో సూర్యుడు "మకరరాశిలో" ప్రవేశించిన పుణ్యదినం.

ఈ సంక్రాంతిలో "సం" అంటే మిక్కిలి 
"క్రాంతి" అంటే అభ్యుదయం. 
మంచి అభ్యుదయాన్ని ఇచ్చు క్రాంతి కనుక 
దీనిని "సంక్రాంతి" గా పెద్దలు చెబుతూ..
"మకరం" అంటే! మొసలి. 
ఇది పట్టుకుంటే వదలదు అని మనకు తెలుసు. 
కాని మానవుని యొక్క ఆధ్యాత్మిక మార్గానికి అడుగడుగునా అడ్డుతగులుతూ, 
మోక్షమార్గానికి అనర్హుని చేయుటలో 
ఇది అందవేసినచేయి!

అందువల్ల ఈ "మకర సంక్రమణం" పుణ్యదినాలలో దీని బారినుండి తప్పించుకునేందుకు ఒకటేమార్గం అది ఎవరికి వారు యధాశక్తి 'లేదు' అనకుండా దానధర్మాలు చేయుటయే మంచిదని, శాస్త్రకోవిదులు చెబుతూ ఉంటారు..

ఇక ఈ పండుగలలోని విశిష్టత.💐
తెలుగువారికి అత్యంత ప్రియమైన పండుగలు, వరుసగా మూడు రోజులు వచ్చే పండుగలు ఇవే! ముఖ్యంగా 'సంక్రాంతి' అని పిలుచుకుంటాం. 
దీనిని పెద్ద పండుగ అని కూడా అంటారు. పుష్యమాసంలో వచ్చే ఈ పండుగకు ఇంటికి ధనధాన్య రాశులు చేరతాయి. 
పౌష్యలక్ష్మితో కళకళలాడే గృహ ప్రాంగణాలతో, ఇల్లిల్లూ ఒకకొత్త శోభతో వెలుగుతూ ఉంటుంది. ఇంకా ఈ పండుగ వస్తుందంటే పిండి వంటలతో ముఖ్యంగా అరిసెలు, చక్రాలతో అందరి ఇళ్ళు 
ఘుమ ఘుమ లాడుతూ ఉంటాయి.

మొదటి రోజు 'భోగి'.💐
ఈ రోజున ఉదయం తెల్లవారక ముందే, అంటే 
3:30, 4:00 మధ్యలో అందరూ లేచి భోగి మంటలు వెలిగిస్తారు. 
దీనిని సంవత్సరంలో ఆ కాలంలో ఉండే చలి పారద్రోలటానికే కాక ఇంకో సందర్భంగా కూడా జరుపుకుంటారు. 
ఇంట్లో ఉండే పాత చీపుర్లూ, తట్టలూ, విరిగిపోయిన బల్లలూ వగైరాలను వదిలేసి, 
భోగి మంటలు వేసి , 
కొత్తవాటితో నిత్య నూతన జీవితం ఆరంబించటానికి గుర్తుగా కూడా ఈ రోజున భోగి మంటలు వెలిగిస్తారు.

సాయంత్రం పూట చాలా ఇళ్ళలో చిన్న పిల్లలు బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తారు. 
బొమ్మల కొలువు లో పిల్లలు తమ దగ్గర ఉన్న 
వివిధ రకాల ఆటవస్తువులను ప్రదర్శనగా ఉంచి ఆనందిస్తారు.

ఇంకొంత మంది భోగి పళ్ళ పేరంటం ఏర్పాటు చేస్తారు. 
ఇక్కడ పేరంటాళ్ళు మరియు బందువులు సమావేశమై, 
రేగిపళ్ళు, శనగలు, పూలు, చెరుకుగడలు, మరియు కొన్ని నాణాలను కొత్త బట్టలు వేసుకున్న పిల్లలపై ఆశీర్వాద సూచకంగా కుమ్మరించి దిష్టి తొలగిస్తారు. ఈ పేరంటానికి వచ్చినవారికి తాంబూలాలతో పాటు పట్టుబట్టలు, పసుపు, కుంకుమలు పెట్టడం ఆనవాయితీ. 
పంట చేతికొచ్చిన ఆనందలో ఇళ్ళకు అల్లుళ్ళని, కూతుళ్ళని ఆహ్వానిస్తారు.

రెండో రోజు 'మకర సంక్రాంతి'.💐
సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే శుభదినం.
సంక్రాంతి రోజున పాలు పొంగించి, 
దానితో మిఠాయిలు తయారు చేస్తారు. 
దాదాపుగా అందరి ఇళ్ళలో 
అరిసెలు, 
బొబ్బట్లు, 
జంతికలు, 
సాకినాలు, 
పాలతాలుకలు, 
సేమియాపాయసం, 
పరమాన్నం, 
పులిహోర, 
గారెలు 
మొదలయిన వంటకాలు చేసి, 
కొత్తబట్టలు ధరించి ఈ పండుగను ఆస్వాదిస్తారు.

ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు ఇస్తారు.
ప్రతీ సంక్రమణానికీ పితృతర్పణాలు ఇవ్వాలి. 
కాని మిగిలిన పదకొండు సంక్రమణాలకు ఇవ్వక పోయినా, ఈ మకర సంక్రమణానికి మాత్రం తప్పకుండా పితృ తర్పణాలు ఇస్తారు.

సంక్రాంతి రోజులలో మనము చూసే ఇంకో 
సుందర దృశ్యం.. గంగిరెద్దులను ఆడించే గంగిరెద్దులవారు. 
చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికీ తిప్పుతూ, డోలు, సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటిచేత చేయించే నృత్యాలు చూడటానికి చాలా రమణీయంగా ఉంటాయి. 
ఆ గంగిరెద్దులు మనము ఇచ్చే కానుకలను స్వీకరిస్తున్నట్లుగా తలలు ఊపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మోకాళ్ళ మీద వంగటం వంటి విద్యలు వాటికి నేర్పిస్తారు. 
అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దుల వాళ్ళు సందడి చేస్తూ 
కొత్తగా వచ్చిన ధాన్యాన్ని అడుక్కుంటారు.

హరిలో రంగ హరీ అంటూ నడినెత్తిపై నుంచి నాసిక దాకా తిరుమణి పట్టెలతో, కంచు గజ్జెలు ఘల్లుఘల్లుమనగా చిందులు త్రొక్కుతూ, 
చేతుల్లో చిరుతలు కొడుతూ కోడిగుడ్డు లాంటి 
బోడి తలపై రాగి అక్షయపాత్ర కదలకుండా హరిదాసు ప్రత్యక్షమవుతాడు.

మూడో రోజు 'కనుమ'.💐
దీన్నే పశువుల పండుగ అని అంటారు. 
తమ చేతికొచ్చిన పంటను తామేకాక, 
పశువులూ, పక్షులూ పాలుపంచుకోవాలని పిట్టల కోసం ధాన్యపు కంకులు ఇంటి గుమ్మాలకు కడతారు. పల్లెల్లో పశువులే గొప్పసంపద. 
అవి ఆనందంగా ఉంటే రైతుకి ఉత్సాహం. 
పంటల్లో వీటి పాత్ర ఎంతో ఉంది. 
వాటిని ప్రేమగా చూసుకొనే రోజుగా 
కనుమను భావిస్తారు.

గొబ్బెమ్మల పూజ, 
గంగిరెద్దుల హడావుడి, 
హరిదాసుల రాకడ, 
కోడిపందాలు, 
ఎడ్లపందాలు, 
బంతిపూల తోరణాలు, 
కొత్త జంటల విహారాలు, 
ఎంతో ఆహ్లదకరంగా కనిపిస్తాయి

ఇక ధనుర్మాసము ప్రారంభమైన నాటినుండి 
వివిధ ఆలయాలలోని అర్చకస్వాములు "సంక్రాంతి" నెలపట్టి సూర్యోదయానికి పూర్వమే మంగళవాయిద్యాలతో నదీజలాలను "తీర్ధంబిందులలో" తోడ్కొని వచ్చి 
విశేషార్చనలు నిర్వహిస్తారు.

ఇంటిముందు కన్నెపిల్లలు కళ్ళాపులు చల్లుతూ! ప్రతిరొజు వివిధ రకాల ముగ్గులతో! 
సప్తవర్ణాల రంగవల్లికలను తీర్చిదిద్ది "ఇంద్రధనుస్సులను" ముంగిట 
చూస్తున్నట్లు భ్రమింపచేస్తారు.

సంక్రాంతి రోజులలొ శుభాలనిచ్చే కొన్ని వ్రతాలు..💐
సంక్రాంతి నెలపట్టాక కన్నెలు , ముత్తయిదువులు ఎన్నోవ్రతాలు , నోములు నోచుకుంటారు . వాటిలో

1 . బొమ్మల నోము :💐
గతంలో ఆడపిల్లలకు చిన్నవయసులోనే 
వివాహము చేసేవారు . 
వారితో ముక్కనుమ నాడు బొమ్మలనోము పేరిట "సావిత్రి గౌరీదేవి నోము నోయించేవారు . 
ఈ వ్రతాన్ని వరుసగా తొమ్మిదేళ్ళు చేయాల్సివుంది. దీనివల్ల గృహిణులకు శుభాలు కలుగుతాయని నమ్మకం .

2 . గొబ్బిగౌరీవ్రతం :💐
ఈ వ్రతం భోగి రోజు మొదలవుతుంది . భోగిపండుగనాడు సాయంత్రం నట్టింట్లో ఓ వైపు మండపం కట్టి అలంకరిస్తారు . 
ఈ కాలము లో దొరికే పండ్లు , కూరగాయలు , 
చెరకు గడలతొ అలంకరిస్తారు . 
మండపం మధ్య బియ్యం పోసి నడుమ గౌరీదేవిని ఉంచి పూజలు చేస్తారు . 
భోగి నుండి నాలుగో రోజు ఉద్వాసన పలికి , మండపం లో అలంకరించిన కూరగాయలతో 
ఓ కూర వండుకుంటారు . 
దీన్నేగొబ్బి కూర అంటారు .

3 , గోదాదేవి నోము :💐
పూర్వము గోదాదేవి ' పూర్వఫల్గుణ నక్షత్రం లో , కర్కాటక లగ్నం లో తులసి వనం లో జన్మించినది . ఆమె గోపికలతో కలిసి శ్రీకృష్ణుణ్ణి ఆరాధించినది . ఈమె నెలపెట్టిన రోజు నుండి ధనుర్మాషమంతా 
ఒక నెలరోజులు వ్రతమాచరించి చివరి రోజైన 
మకర సంక్రాంతి నాడు విష్ణుమూర్తిని పెళ్ళి చేసుకుంది . 
ఈ వ్రతకాలములో ఆమె గోపికలతో కలిసి పూజించినారు ... 
మనం ఈనాడు పెట్టే ఆ గొబ్బెమ్మలే గోపికలు .. జనవాడుకలో గోపీ బొమ్మలే గొబ్బెమ్మలుగా పిలవబడుతున్నాయి .
పెళ్ళి కాని ఆడపిల్లలంతా గొబ్బెమ్మలు పెట్టి 
వాటి చుట్టూపాటలు పాడుతూ , 
ప్రదక్షిణలు చేస్తూ , 
తాము గోపికలు గా ఊహించుకొని 
కృష్ణభగవానుణ్ణి మదిలో అర్పిస్తే 
మంచి భర్త లభిస్తాడనేది..ఓ నమ్మకం .

సంక్రాంతి దేవతకు ఏడు పేర్లు.💐
ఒక్కో పండుగనాడు ఒక్కో దేవుడిని , దేవతను పూజించడం మన సంప్రదాయం . 
అలాగె సంక్రాంతి పండుగకూ ఓ అధిష్టానదేవత వుంది . 
ఆ దేవి పేరు పండుగ నాటి వారంతో ముడిపడి వుంటుంది .

ఆదివారం వస్తే దేవత పేరు ....... ఘోర.
సోమవారం వస్తే దేవత పేరు ......ధ్వంక్షి .
మంగళవారం వస్తే దేవత పేరు ....మహోదరి ,
బుధవారం వస్తే దేవత పేరు ........మందాకిని ,
గురువారం వస్తే దేవత పేరు ........మంద ,
శుక్రవారం వస్తే దేవత పేరు .........మిశ్ర ,
శనివారం వస్తే దేవత పేరు ...........రాక్షసి ,

ముగ్గులు..💐
రాళ్ళూ రప్పలూ లేకుండా ఒక పద్దతిలో అలకబడిన నేల, మేఘాలు లేని ఆకాశానికి సంకేతం. 
ఒక పద్దతిలో పెట్టబడు చుక్కలు రాత్రి వేళ కనిపించే నక్షత్రాలకు సంకేతం. 
చుక్కలచుట్టూ తిరుగుతూ చుక్కలను గళ్ళలో ఇమిడ్చే ముగ్గు ఖగోళంలో ఎప్పడికప్పుడు కనిపించే మార్పులకు సంకేతం. 
ఎంత పెద్దదైనా చిన్నదైనా ముగ్గు మద్య గడిలో పెట్టే చుక్క సూర్యు స్థానానికి సంకేతం. 
ఇక వివిధ ఆకారాలతో వేయు ముగ్గులు 
విల్లు ఆకారం పునర్వసు నక్షత్రానికీ, 
పుష్పం పుష్యమీ నక్షత్రానికీ 
పాము ఆకారము ఆశ్లేషకూ, 
మేక, ఎద్దు, పీత, సింహం, ఇలాంటివి మేష , వృషభ, మిధున, కర్కాటక రాసులకూ, 
తొమ్మిది గడుల ముగ్గు నవగ్రహాలుకూ 
సంకేతాలుగా చెప్పచ్చు.

రధం ముగ్గు..💐
మూడు రోజులతో పూర్తవుతూ అందరికీ ఆనందాన్ని పంచే పండుగను ఘనంగా సాగనంపేందుకు పుట్టినదే రధం ముగ్గు. 
అందరూ ఒకరికి ఒకరు తోడుంటూ కలసి సహజీవనం సాగించాలి అనే సంకేతాలతో 
ఒక రధం ముగ్గు తాడును మరొక ఇంటివారి ముగ్గుతో కలుపుతూ పోతూంటారు.

గొబ్బెమ్మలు..💐
పెద్ద వయసు స్త్రీలు ముగ్గులు పెడుతుంటే 
చిన్న వయసు ఆడపిల్లలు ఆవు పేడతో చేసి పెట్టే గొబ్బెమ్మలు కృష్ణుని భక్తురాళ్ళైన గోపికలకు సంకేతం. 
ఈముద్దల తలమీద కనుపించే రంగుల పూలరేకులు, 
పసుపు కుంకుమలు ఆ గోపికలందరూ భర్తలు జీవించియున్న పునిస్త్రీలకు సంకేతం. 
ఆ గోపికా స్త్రీల రూపాలకు సంకేతమే..
గోపీ+బొమ్మలు= గొబ్బెమ్మలు. 
మద్య ఉండే పెద్ద గొబ్బెమ్మ గోదాదేవికి సంకేతం. సంక్రాంతి రోజులలో వీటి చుట్టూ తిరుగుతూ పాటలు పడుతూ నృత్యం చేసే బాలికలంతా కృష్ణ భక్తి తమకూ కలగాలని ప్రార్ధిస్తుంటారు. 
దీనిని సందె గొబ్బెమ్మ అంటారు. 
గొబ్బెమ్మలు పొద్దున పూట ముగ్గులో ఉంచి, 
దానిపై గుమ్మడి పూలుతొ అలంకారం చేస్తే 
చాలా అందంగా ఉంటుంది.

బోగిమంట..💐
మూడురోజులపాటు సాగే సంక్రాంతి పండుగలో మొదటి రోజున నాలుగు మార్గాల కూడలిలో వేయబడే పెద్ద మంట. 
అప్పటి నుండి ఇంతకంటే మరింత వేడితో ఉత్తరాయణ సూర్యుడు రాబోతున్నడనే సంకేతం.

దక్షణాయంలో ఉండే నిద్ర బద్దకంతో సహా దగ్ధం చేయాలనే సంకేతంతో చీకటితోనే బోగిమంట వేస్తారు. 
ఇంట్లో ఉండే పాత కలపసామానులు, 
వస్తువులు, ఎండుకొమ్మలు లాంటివి బోగి మంటలో వేసి తగులబెడుతారు. 
వీటన్నిటినీ దారిద్ర్య చిహ్నాలుగా బావించి తగులబెట్టాలంటారు. 
వేసవిలో వేడికి తగులబడే వాటిని గుర్తించాలనే మరొక సంకేతం కూడా ఇందులో దాగిఉంది.

బోగిపళ్ళు.💐
బోగి పండ్లు అంటే రేగుపండ్లు. 
ఇది సూర్యునికి ప్రీతిపాత్రమైన పండుగ. 
సూర్యుని రూపం, రంగు, పేరు కలిగిన రేగుపండ్లతో నాణేలను కలిపి పిల్లల తలపై పోస్తారు. 
సూర్య భగవానుని అనుగ్రహం పిల్లలపై ప్రసరించి ఆరోగ్యం కలగాలనే సంకేతంతో బోగిపండ్లు పోస్తారు.

తిల తర్పణం.💐
సంవత్సరంలో మిగిలిన రోజులలో నల్ల నువ్వులు వాడరు. 
కాని సంక్రాంతి పర్వధినాన మాత్రం నల్లనువ్వులతో మరణించిన పిత్రుదేవతలందరికీ తర్పణములివ్వడం ఎక్కువగా చేస్తుంటారు. 
దీన్నే పెద్దలకు పెట్టుకోవడం అంటుంటారు. 
సంక్రాంతి పర్వధినాలలో వారి వారి ఆచార సంప్రదాయాలను అనుసరించి ఈ కార్యక్రమము చేస్తుంటారు. 
ఈ రోజు బూడిద గుమ్మడి కాయ దానము ఇస్తారు.

సంకురుమయ / సంక్రాంతి పురుషుడు.💐
మట్టి తో ఒక బొమ్మను (సంక్రాంతి పురుషుడు), 
తన వాహనాన్ని (ప్రతి సంవత్సరం వేరు వేరు వాహనాల పై పురుషుడు వస్తాడు. ఏ వాహనాన్ని ఎక్కితే ఆ వాహనానికి ఆ సంవత్సరం ఎక్కువ నష్టము అని ఒక నమ్మకం) , మేళ తారళాలను చేసి, సంక్రాంతి మూడు రోజుల్లొ పూజలు చేస్తారు. 
నాల్గవ నాడు ఈ బొమ్మలను వాల్లాడిస్తారు.

హరిదాసు..💐
గొబ్బిళ్ళతో ఇంటి ముందరి భాగాన్ని అలంకరించి హరిని కీర్తించే భక్తులకు సాక్షాత్ శ్రీకృస్ణుడే హరిదాసు రూపంలో వస్తాడని సంకేతం. 
ఆయన తలమీద మంచి గుమ్మడి కాయా ఆకారంలో గల పాత్ర గుండ్రముగా ఉండే భూమికి సంకేతం 
దాన్ని తలమీద పెట్టుకొని ఉండటం శ్రీ హరి అయిన తానే భూమిని ఉద్దరిస్తున్నానని { ఉత్+దరించు= తలమీద పెట్టుకోవడం} అని చెప్పే దానికి సంకేతం. హరినామ కీర్తన చేస్తూ రావడం తను ఏ భోగాలకూ లొంగను కేవలం హరినామ సంకీర్తనకే వచ్చే వాడిననీ తనకు తమపర భేదాలు లేవనీ అందుకే ప్రతి ఇంటికీ తిరుగుతూ వస్తాడనే సంకేతం.

గంగిరెద్దు..💐
ముందు వెనుకల చెరో ప్రమదునితో {శివ గణం} ఎత్తైన మూపురం శివలింగాకృతిని గుర్తుచేస్తూ శివునితో సహా తను సంక్రాంతి సంభరాలకు హాజరయ్యానని చెప్పే సంకేతం గంగిరెద్దు. 
ఆవు లేదా ఎద్దు ఇంటి ముందు ముగ్గులో నిలిచిందంటే ఆనేల ధర్మభద్దమైనదని అర్ధం. 
"జుగోప గోరూప ధరామివోర్విం" దీని అర్ధం 
ఆ నేల ఆవుకి సంకేతం 
ఆనేలనుండి వచ్చిన పంటకు సంకేతం ముంగిట నిలిచిన వృషభం. 
మీరు చేసే దానమంతా ధర్మభద్దమేనంటూ 
దానిని మేము ఆమోదిస్తున్నామని ఇంటింటికీ తిరుగుతుంటారు వృషభసహిత శంకర పరివారం.

హిందువుల పండుగలలో సంక్రాంతి మాత్రమే సౌరగమనాన్ని అనుసరించి వస్తుంది. 
గ్రెగోరియను కాలెండరు కూడా సౌరమానాన్ని అనుసరిస్తుంది కనుక సంక్రాంతి ప్రతీ సంవత్సరం 
ఒకే తేదీన వస్తుంది. 
మిగిలిన పండుగలన్నీ భారతీయ సాంప్రదాయం ప్రకారం చాంద్రమానాన్ని అనుసరించి వస్తాయి. కాబట్టి గ్రెగోరియను కాలెండరు ప్రకారం 
ఏటికేడాది వేరువేరు రోజుల్లో వస్తాయి.

పవిత్రమైన ఉత్తరాయణ పుణ్యకాలంలో మరణించినవారు స్వర్గానికి వెళ్తారని హిందువుల నమ్మకం. 
సంక్రాంతితో ఉత్తరాయణం మొదలవుతుంది.
అంచేతే భారతంలో స్వచ్ఛంద మరణం కలిగిన భీష్మాచార్యుడు సంక్రాంతి పర్వదినం వరకూ ఆగి, ఉత్తరాయణం లో రథసప్తమి (మాఘ శుద్ధ సప్తమి) నాడు ప్రారంభించి, 
రోజునకు ఒక్కొక్క ప్రాణం చొప్పున వదులుతూ, చివరకు భీష్మఏకాదశి మాఘ శుద్ధ ఏకాదశి నాడు ఐదవ ప్రాణాన్ని కూడా వదిలి, తనువు చాలించాడు.

జగద్గురువు..ఆది శంకరాచార్యుల వారు.. ఈరోజునే సన్యాసం పుచ్చుకున్నారు..!
ఓం నమో..వాసుదేవాయ నమః..!!🙏

సర్వే జనా సుఖినోభవంతు..!!💐

No photo description available.