వేదాధ్యయనం - వేదోద్ధరణం

1980వ దశకం మొదట్లో నా ఆదాయం కొంచం పెరగడంతో ఏవైనా పుణ్యకార్యాలు చెయ్యడానికి కొద్దిగా డబ్బు సమకూర్చుకోవడం కుదిరేది. అప్పుడు పరమాచార్య స్వామివారు మాహారాష్ట్రలోని షోలాపూర్ లో మకాం చేస్తున్నారు. మా నాన్నగారు పరమాచార్య స్వామితో, “రామన్ కు ఇప్పుడు మంచి ఆదాయం వస్తోంది. ఆ డబ్బుతో ఏ ధర్మకార్యం చేస్తే ఎక్కువ పుణ్యం వస్తుందో సెలవివ్వండి పెరియవ” అని అడిగారు.

మహాస్వామివారు కొద్దినిముషాలు మౌనంగా ఉండి, “బ్రాహ్మణులైన మీరందరూ వేదం చదువుకుని, జీవితాంతం వేదాధ్యనం చేస్తూ, వేదాన్ని బోధిస్తూ గడపాలి. అందుకు ఇప్పుడు చాలా ఆలస్యం అయిపోయింది. మీ కుటుంబంలో చాలామంది డాక్టర్లు అయ్యారు. మీరు వేదాధ్యయనం చెయ్యలేదు కాబట్టి, ఇక మీరు చెయ్యగలిగింది వేద పాఠశాలలను, వేద పండితులను పోషించడమే.
సాధ్యమైంనత ఎక్కువ మొత్తంలో డబ్బుని దీనికి వినియోగించండి. అలాగైనా వేదాధ్యయనం చెయ్యని దోషం కొంతైనా తగ్గుతుంది” అని చెప్పారు.

పరమాచార్య స్వామివారి ఆశీస్సులతో, పుదు పెరియవ, బాల పెరియవ అనుగ్రహంతో, మా తల్లితండ్రుల దీవెనలతో ఇప్పటికి ప్రతీ నెలా తిరుమలలోని శంకర మఠం వేద పాఠశాలకు ధనం ఇవ్వగలుగుతున్నాము.

--- ప్రొ. యస్. కళ్యాణరామన్, న్యూరోసర్జన్, చెన్నై. “మూమెంట్స్ ఆఫ్ ఎ లైఫ్ టైం” నుండి.

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।