వరు వాయ్ అరుళ్ వాయ్

నాకు ప్రతిరోజు ‘కందర్ అనుభూతి’ పారాయణ చెయ్యడం అలవాటు. పూర్వజన్మ కర్మ వల్లనో మరే కారణం చేతనో నేను ఆర్థికంగా ఎదగలేక పోయాను. ఇదే స్తోత్రం పారాయణం చేసే నా స్నేహితుడు ఒక సారి పరమాచార్య స్వామి వారితో, తను రోజూ కందర్ అనుభూతి పారాయణ చేస్తానని, తన ఆర్థిక ఇబ్బందుల నుండి బయట పడడానికి ఏవైనా కొన్ని స్తోత్రములు కాని పూజలు కాని తెలుపవలసినదని కోరాడు.

“నువ్వు ప్రతి రోజూ కందర్ అనుభూతి పారాయణ చేస్తున్నావా? అంతకంటే ఇంకేం కావాలి నీకు? నీ ఆర్థిక ఇబ్బందులు పోగొట్టడానికి అది చాలు“ అని పరమాచార్య స్వామి వారు సెలవిచ్చారు.

కాని నా స్నేహితుడు మహాస్వామి వారితో “అలా కాదు పెరియవ! నాకు మురుగన్ పై ఉన్న భక్తి వల్ల నేను కందర్ అనుభూతి పారాయణ చేస్తున్నాను. కాని ఇప్పుడు నాకు కావలసింది ధనం. దయచేసి నాకు ఏమైనా ఉపాయం తెలపండి” అని అన్నాడు.

ఆ స్తోత్రం యొక్క చివరి పాదంలో ‘వరువాయ్ అరుళ్ వాయ్’ అని ఉంటుంది. అంటే వచ్చి నన్ను దీవించు అని అర్థం. అక్కడక్కడ ‘గురువాయ్ వరువాయ్ అరుళ్ వాయ్’ అని కూడా ఉంది. లేదా? ఉంది కదా?” అని అన్నారు.

అతను అవునన్నట్టు తల ఊపాడు.

మహాస్వామి వారు ఈ పాదంలో షణ్ముఖుని అనుగ్రహాన్ని వర్ణిస్తూ ”వరువాయ్ అను పదానికి రమ్మని, డబ్బు(ఆదాయం) అని కూడా అర్థం. అంటే ఇక్కడ సుబ్రహ్మణ్యున్ని గురువుగా కీర్తిస్తూ, వచ్చి నన్ను దీవించమని, గురు అనుగ్రహంతో ధనము ఇమ్మని కూడా అడుగుతున్నట్లేగా!” అని చెప్పారు.

పరమాచార్య స్వామి వారు నా స్నేహితునికి, కందర్ అనుభూతి పారాయణ వల్ల ‘కార్తికేయుడు గురువుగా వచ్చి ధన సమృద్ధితో అనుగ్రహిస్తాడు’ అని అర్థమయ్యేట్టు చేసారు.

ఇది స్కందుని భక్తులకందరికి పరమాచార్య స్వామి వారు నేర్పుతున్న పాఠమే. ఈ సంఘటన వల్ల నాకు కూడా ణెను పడుతున్న వ్యథ నుండి ఉపశమనం లభించింది.

[కందర్ అనుభూతి – స్కందునిపై అరుణగిరినాథర్ పాడిన పాటల సంపుటి. ఈయన తిరువణ్ణామలై వాసి. పరకాయ ప్రవేశ విద్య తెలిసిన ఈ సాధువు వేరొకరి కుట్ర వల్ల శాశ్వతంగా చిలుక శరీరంలో ఉండిపోయి, తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వరుని గుడి గోపురంలో కూచొని పాటలు పాడేవాడు. అలా పాడిన పాటలే ఈ కందర్ అనుభూతి]

--- మేలట్టూర్ యస్ రామచంద్రన్, మహాపెరియవళ్ – దరిశన అనుభవంగళ్ 2

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।