మహాస్వామి వారి ఘటం

పరమాచార్య స్వామి వారికి పరమ భక్తుడైనందువల్ల తన కీర్తి ప్రతిష్టలు అంతా స్వామి వారి అనుగ్రహంగానే పరిగణిస్తారు. “నాతో వారి ఉనికి, వారు నా వెంటే ఉన్నారన్న విషయం నాకు ఎన్నో సార్లు ఋజువు అయ్యింది” అని అంటారు ప్రముఖ ఘటం విద్వాంసులు విక్కు వినాయకరం.

ఒకసారి వినాయకరం, ఎల్. శంకర్ మరియ జాకిర్ హుస్సేన్ లతో కలిసి ఒక కచేరి కోసం ఏథెన్స్ వెళ్ళారు. కచేరి రోజుకు కొన్ని రోజులముందు అకస్మాత్తుగా వారి ఘటం పగిలిపోయింది. చెన్నైలో ఉన్న వారి భార్యకు ఏడుస్తూ “తెచ్చుకున్న ఘటం పగిలిపోయింది. ఇక్కడ నాకు ఇక పని లేదు. నేను తిరిగి వచ్చేస్తాను” అని చెప్పారు. వారి భార్య ఒక రోజు వేచి ఉండమని చెప్పి వారి పరిస్థితిని ఆచార్యుల వారికి చెప్పడానికి కంచికి వెళ్ళారు. పరమాచార్య స్వామి వారు ఆవిడ గోడు విని ఏమి పలుకక మిన్నకుండిపోయారు. ఆవిడ చాలా బాధపడి కన్నీరు కారుస్తూ తిరిగి వెళ్ళి పోతున్నప్పుడు మహాస్వామి వారు మౌనంగా ఒక కొబ్బరికాయను ఇచ్చి పంపారు.

మరోవైపు జాకిర్ హుస్సేన్ ఏథెన్స్ మొత్తం వెతికి చివరగా అమెరికా హౌస్ లో ప్రదర్శనకు ఉంచిన ఒక ఘటం చూసారు. కాని దాన్ని అతను ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే అది ఇచ్చిన వ్యక్తి దాన్ని ఎవరికి ఇవ్వకూడదు అమ్మకూడదు అని చెప్పారు. అది తనకి ఎవరు ఇచ్చారు అని అడుగగా అందరూ అతను “వినాయకరం” అని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. “ఆ ఘటం నీకు ఇచ్చినవారికే ఇప్పుడు దాని అవసరం వచ్చింది” అని జాకిర్ గారు చెపారు. అప్పుడు అతను వినాయకరం గారి వద్ద నుండి “ఈ ఘటం నాకు చాలా ఉపయోగపడింది” అని ఒక లేఖని కూరుతూ ఆ ఘటాన్ని ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. ఇంకా ఆశ్చర్యపోవల్సిన విషయం ఏమిటంటే వినాకరం కచేరిలో వాయించడానికి సరిపడా శృతి ఆ ఘటానికుంది.

మరొక్కసారి అమెరికా వెళ్తూ జర్మనీలో విమానం తప్పినందువల్ల సరదాగా ఒక సంగీత వాద్య పరికరాలు అమ్మే దుకాణానికి వెళ్ళారు. వారి వినాయకరం అని తెలుసుకుని ఆ దుకాణదారుడు వారికి ఒక ఘటాన్ని చూపించి దాని నాణ్యత తెలుపమన్నారు. అది ఒక జర్మనీ వనిత తయారుచేసినది. దాని శృతి శబ్ధ స్వరం అచ్చంగా భారతదేశంలో తయారు చేసినదానివలే ఉన్నదని చెప్పారు.

సంతోషంతో ఆ యజమాని, వారు వద్దని వారిస్తున్నా దాన్ని వారికి బహూకరించాడు. వారు అమెరికా వెళ్ళిన తరువాత చూస్తే తెచ్చుకున్న ఘటం పగిలిపోయి ఉంది. వారికి బహూకరించిన ఘటాన్నే వారు కచేరీలో వాడారు. ఆ ఘటం శృతి జి (5 కట్తై) అది కచేరి యొక్క ఆధార శృతి సి (1 కట్తై)కి సరిగ్గా సరిపోయింది. దాన్ని పరమాచార్య స్వామి వారి ఘటంగా భావించి వారి పూజామందిరంలో ఉంచుకున్నారు వినాయకరం గారు.

--- పద్మశ్రీ టి.హెచ్. వినాయకరం, చెన్నై - శక్తివికటన్ ప్రచురణ

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।