బ్రహ్మంగారు కాలజ్ఞానం వ్రాసిన రవ్వలకొండ ప్రదేశం

బ్రహ్మంగారు కర్నూలు జిల్లాలోని బనగానపల్లె మండలంలో గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంటిలో పశువులకాపరి గా ఉంటూ రవ్వలకొండ లో కాలజ్ఞానం వ్రాసారు. ఆవుల చుట్టూ గీతగీసి రవ్వలకొండ లో కాలజ్ఞాన రచన గావించారు బ్రహ్మంగారు. రవ్వలకొండ బనగానపల్లె కు 1.5 కిలోమీటర్ల దూరంలో ఒక కొండపైన ఉన్నది. ఈ కొండ గుహాలలో కూర్చొని బ్రహ్మంగారు కాలజ్ఞానం వ్రాసారు కనుక కొండలను 'బ్రహ్మంగారి కొండలు' అని కూడా పిలుస్తారు.

చరిత్ర

1601లో బీజాపూరు సుల్తాను ఇస్మాయిల్‌ ఆదిల్‌ షా బనగానపల్లె కోటను రాజా నంద చక్రవర్తిని ఓడించి వశపరచుకున్నాడు. ఆక్రమిత ప్రాంతాన్ని, కోటను ఈ విజయం సాధించిన సేనాధిపతి, సిద్ధు సంబల్‌ ఆధీనంలో 1665 వరకు ఉన్నాయి. మహమ్మద్‌ బేగ్‌ ఖాన్‌-ఇ రోస్బహాని బనగానపల్లె జాగీరుపై శాశ్వత హక్కు పొందాడు. కాని అతడు మగ వారసులు లేకుండా చనిపోవడంతో జాగీరు అతని మనవడూ దత్తపుత్రుడూ అయిన ఫైజ్‌ ఆలీ ఖాన్‌ బహదూరుకు ధారాదత్తమైంది. మొగలు చక్రవర్తిఔరంగజేబు 1686లో బీజాపూరును ఆక్రమించుకొన్నపుడు, దక్కనులో అతని ప్రతినిధిగా పనిచేసే ఫైజ్‌ ఆలీ మేనమామ, ముబారిజ్‌ ఖాన్‌దయవల్ల ఫైజ్‌ ఆలీ ఖాన్‌ స్థానం పదిలంగానే ఉంది.

బనగానపల్లె సంస్థాన పటము

అప్పటినుండి బనగానపల్లెను మొగలు చక్రవర్తుల సామంతులుగా కొన్నాళ్ళు, ఆ తరువాత 1724లో మొగలుల నుండి స్వాతంత్ర్యం ప్రకటించుకొన్న హైదరాబాదు నిజాము సామంతులుగా కొన్నాళ్ళు ఫైజ్‌ వారసులే పాలించారు. అతడు కూడా మగ వారసులు లేకుండా మరణించడంతో, అతని మనుమడు హుసేన్‌ ఆలీ ఖాన్‌ బనగానపల్లెకు ప్రభువయ్యాడు. అతని పాలన చివరి రోజుల్లో మైసూరు రాజు హైదరాలీ సామ్రాజ్య‌ విస్తరణ చేయడాన్ని గమనించి అతనికి సామంతుడిగా మారిపోయాడు. 1783లో హుసేను మరణించాక, అతని కుమారుడు, చిన్నవాడైన గులాం మొహమ్మదాలి -మామ రాజ ప్రతినిధిగా- రాజయ్యాడు. ఒక ఏడాది లోనే హైదరాలి వారసుడైన టిప్పు సుల్తాను వాళ్ళను బనగానపల్లె నుండి తరిమివేయగా, వాళ్ళు హైదరాబాదులోతలదాచుకున్నారు. మళ్ళీ 1789లో బనగానపల్లెకు తిరిగి వచ్చారు. తరువాత కొన్నాళ్ళకు, దగ్గరలోని చెంచెలిమల జాగీరును వియ్యం ద్వారా కలుపుకున్నారు.1800తొలినాళ్ళలో బనగానపల్లె బ్రిటిషు ఇండియాలో ఒక సంస్థానంగా మారిపోయింది. ఆర్థిక లావాదేవీలలో జరిగిన లొసుగుల కారణంగా 1832 నుండి 1848 వరకు ఒకసారి, 1905లో కొన్ని నెలలపాటు మరోసారి బనగానపల్లె పరిపాలనను మద్రాసు ప్రెసిడెన్సీ గవర్నరు తన అధీనంలోకి తీసుకున్నాడు. 1901లో బనగానపల్లె సంస్థానం 660 చకి మీ ల వైశాల్యంతో 32,264 జనాభాతో ఉండేది. తెలుగు ప్రాంతాల్లో హైదరాబాద్ మినహా బనగానపల్లె మాత్రమే సంస్థానం స్థాయి పొందింది, మిగిలినవన్నీ జమీందారీల హోదాలోనే ఉండేవి. [1]1948లో కొత్తగా ఏర్పడిన భారత దేశంలో బనగానపల్లె సంస్థానం కలిసిపోయింది; మద్రాసు రాష్ట్రం లోని కర్నూలు జిల్లాలో భాగమయింది. 1953లో కర్నూలుతో సహా మద్రాసు రాష్ట్రపు ఉత్తర జిల్లాలు కలిసి ఆంధ్ర రాష్ట్రంగాఏర్పడ్డాయి.