పక్షవాతం - పరిహారం

ఒకరోజు పరమాచార్య స్వామి వారి దర్శనానికి ఒక శ్రీవైష్ణవ కుటుంబం వచ్చింది. వారు శ్రీమద్రామానుజాచార్యులుస్థాపించిన శ్రీవైష్ణవ సాంప్రదాయం పాటించే వారైనప్పటికి మహాస్వామి వారిపై వారికి అచంచల భక్తి విశ్వాసం. సాక్షాత్ శ్రీమన్నారాయణుడే పరమాచార్యస్వామి వారి రూపంలో అవతరించారని వారి నమ్మకం.
వారి కుటుంబ పెద్ద అనారోగ్యం పాలైనందున అతన్ని కూడా వెంటపెట్టుకుని వారు శ్రీమఠానికి వచ్చారు. అనుకోకుండా ఆ కుటుంబ యజమానికి పక్షవాతము, చిత్తభ్రమ కలిగాయి. దాని నివారణ కోసం ధన్వంతరి స్వరూపమైన మహాస్వామి వారి వద్దకు వచ్చారు.
పరమాచార్య స్వామీ వారు వారిని లోపలికి పిలిచి వారిని కూర్చుండ చేసి, వారి బాధను విన్నారు. మహాస్వామి వారు ఒక చిన్న మట్టికుండను, నీటిని తెమ్మన్నారు. వాటిని తెచ్చిన తరువాత, వారు ధరించిన మాలలో నుండి కొన్ని తులసి దళాలను అందులో ఉంచారు. వారు వైష్ణవ సాంప్రదాయులు కావున వారిని ఈ శ్లోకం జపించమని చెప్పారు.
అచ్యుతానంత గోవింద నామోచ్చారణ భేషజాత్।
నశ్యంతి సకల రోగః సత్యం సత్యం వదామ్యహం ॥
ఆ కుటుంబ సభ్యులు అందరూ మహాస్వామి వారు చెప్పినట్టు చేసారు. మహాస్వామి వారు కొంత నీటిని అతనిపై చెల్లారు. తరువాత అక్కడున్నవారిలో ఒక బలమైన వ్యక్తి ఎవరైనా రోగి తలపై గట్టిగా ఒక గుద్దు గుద్దమన్నారు. అక్కడున్నవారందరూ కొంచం తటపటాయిస్తూ రోగిని కొట్టడానికి చేతులు రాక ఊరకుండిపోయారు. పక్షవాతంతో పడిఉన్న రోగిని ఎలా కొడతారు?
కాని మహాస్వామి వారి లీలలు అత్యద్భుతం. చివరగా ఒక బలాఢ్యుడైన ఒక వ్యక్తి చెయ్యడానికి సిద్ధపడ్దాడు. రోగి దగ్గరకు వచ్చి పిడికిలిని గట్టిగా బిగించి తలపైన ఒకటివ్వడానికి తన రెండుచేతులను పైకెత్తాడు.
అంతే అచేతనంగా పడిఉన్న అతను వెంటనే మాట్లాడుతూ, "ఎందుకు నన్ను కొట్టడానికి ప్రయత్నిస్తున్నావు?" అని అడిగాడు. కుటుంబసభ్యులు ఆశ్చర్యచకితులయ్యారు. చలనమే లేని ఆ ఇంటి పెద్ద మాట్లాడడంతో అందరూ సంతోషపడ్డారు. పరమాచార్యస్వామి వారి అనంతమైన దయ వారు విదిలించిన కొన్ని నీటి చుక్కలు ఆ రోగికి స్వస్థత చేకూర్చి, అతనిలో చేతన కలిగించి, బుద్ధిని మెల్కొలిపింది.
కుటుంబసభ్యులందరూ ఎంతో ఆనందంతో కళ్ళ నీరు కార్చుతూ, మహాస్వామి వారికి తమ కృతజ్ఞతలు తెలియజేస్తూ సాష్టాంగ నమస్కారాలు చేసి వారి అశీర్వచనాలు పొంది ధన్యులయారు.