తన్ను తాను తెలుసుకొనక బ్రహ్మాండమంతయు పరిశీలించినను వృధా శ్రమయే మిగులుతుంది. తన నిజస్ధితిలోనే అఖిలాండకోటి బ్రహ్మాండ ములు విలీనమై యున్నవి. బాహ్య కర్మకాండ తతంగమంతయు మన తృప్తి కొరకే. మనసు జోడించని, హృదయశుద్ధిలేని కేవల బాహ్యాడంబర ములు నిజదైవమును మెప్పించలేవు. సర్వధరిత, సర్వభరిత, సర్వాధార, సర్వాకర్షణ చిన్మయ చైతన్య సర్వశక్తి కేంద్రుడైన విశ్వగర్భుని నుండియే సమస్త దివ్యశక్తులు ఉదయిస్తున్నాయి. అహమచల, అనంతాత్మాలయ, సర్వాకార, సర్వస్వరూప, సచ్చిదానంద నిలయ, బ్రహ్మవిద్వరిష్ఠా గరిష్ఠ, తురీయాతీతుడే సర్వేశ్వరుడు.

విశ్వాంతరాళములోని నక్షత్రములను, గెలాక్సీలను చూడవలయుననిన సుదూరమునకు దృష్టిని సారించగలిగిన దూరదర్శిని అవసరము. సుజ్ఞాన దృష్టి దీనికి పైది. దూరదర్శినులకందని నక్షత్రములు గలవు. పదిహేనువందల కోట్ల సంవత్సరములవరకు ఇవి వ్యాపించి యున్నవని శాస్త్రజ్ఞుల అంచనా. ఆపై అత్యద్భుత నక్షత్ర మండలములు గలవు. ఖగోళ శాస్త్రవేత్తలకు కూడా అంతుచిక్కని రహస్యమిది. నక్షత్రములను, గ్రహమండలములను ఒక్కొక్కచోట వాటి పరిమిత కక్ష్యలో నిలిపి పరిభ్రమింపజేసే శక్తి ఏమిటి? అదియే అనిర్వచనీయ చిన్మయ చైతన్య సర్వశక్తి దైవం.

సూర్యునిమీద కోటి డిగ్రీల వేడిమిగలదు. సూర్యుడు భూమికంటె పరిమాణంలో పదమూడు లక్షల రెట్లు పెద్ద. బరువులో మూడులక్షల రెట్లు ఎక్కువ. ఐదువందల కోట్ల సంవత్సరములుగ సూర్యుడు వెలుగు చున్నాడు. ఇంకను కోట్ల సంవత్సరములు సూర్యుడు ప్రకాశించును. వేల సూర్యగోళములు ఒకేసారి వెలిగితే విడుదలయ్యే శక్తి ఒక విస్పోటనం. ఇవి సెకనులో వెలిగిపోతాయి. అనంత సృష్టికి మూలకారణం ఏమిటి? ఇది శాస్త్రవేత్తలకు సవాల్! మిలియన్ లక్షల కోట్ల కాంతి సంవత్సరములు ప్రయాణంచేసి విశ్వాంతం ముగిసినది. ఇకపై ఏమియును లేదని భావించినను, ఆ ఏమిలేని కాళీ ప్రదేశం శూన్యం మాత్రం కాదు. ఇది చిన్మయ చైతన్య ప్రభావమేగాని ఇంకేమియును కాదు.

దేహాభిమాన ప్రాణభయం ఉన్నంతవరకు పరతత్త్వ జ్ఞానసిద్ధి కలుగదు. విద్యుత్ బల్బులోని విద్యుత్తు అంతర్ముఖముగ వెళ్ళిపోయినచో చివరకు విద్యుత్కేంద్రమే తానగును. అలాగే దేహమనెటి బల్బులోని దేహియనెటి బాహ్య స్ఫురణ వీడి, దేహేంద్రియ మనో పరిమితుల నతిక్ర మించి సర్వాంతర్ముఖముగ పయనించెనేని సర్వాత్మ మహాసాగర స్వరూపంగా వర్ధిల్లగలదు. సమస్త మత గ్రంధముల సారమిదియే. తనకు తానుగ సన్మార్గ ప్రవేశితుడు కావాలి. ఎవరికి వారే ప్రేరణ పొంది ఉద్ధరించుకోవాలి.

చిల్లర మంత్ర తంత్రములు మనుష్యులను భ్రమింపజేస్తాయి. స్ధితికుదురని వారలు రసాయనాలతో మాయా వాతావరణమును సృష్టించి ప్రజలను భ్రమింప జేయుదురు. అమాయక ప్రజలు వాటిని నిజమని నమ్మి వారికి దైవత్వమును ఆపాదించుదురు. నిజ దైవస్ధితి వీటికి అతీతం. మనలో అవతారులు కానివారు ఎవరూ లేరు. ప్రతి ప్రాణి ఒక అవతారమే. మనందరిలో అవిభాజ్య దైవాంశ దాగియున్నది. దీనిని వెలికి తీసి ప్రదర్శించాలి.

చేతిక్రింద ప్రచారకుల గుంపు వుండిన సాయంత్రం వరకు సామాన్య వ్యక్తిని సత్పురుషునిగ, జగద్గురువుగ, అవతారమూర్తిగ నమ్మించవచ్చు. కాని పిదప అయోమయ దు:ఖ స్ధితి తధ్యం. వేర్లులేని కొమ్మలవంటివి స్ధితికుదురని చేష్టలు. తన్ను తానెరింగి ఆత్మార్చన శీలియైన ఘనుడు భగవంతుని నిండా అర్చించిన వాడగును. అందులకే నిన్ను నీవెరింగి నీ నిజాత్మ స్ధితిలో స్వస్వరూప ప్రజ్ఞతో వర్ధిల్లాలి. ఇదియే సమస్త మత ధర్మముల సారం. సమస్త పూజల సారాంశం.

నీ నిజస్ధితిని విస్మరించిన పరిజ్ఞానమెంతైనా దైవస్ధానమున శోభిల్లనేరదు.అందులకే నిన్ను నీవు తెలుసుకో. నీ నిజస్ధితి అవిభాజ్యం, అఖండం. నీ పరిధిలో నీవు నిశ్చలుడవై నిలువనేర్చుకో. ఎవరిని మందలించినా నేను అంటారు. ఆ నేను ఎవరు? ఆ నేను స్త్రీయా, పురుషుడా? ఆ నేనుకు వయస్సెంత? శరీరంలో నేననునది ఏ భాగము. శరీరము నేనుకాదు. శరీర నిలుకడకు ఆధారముగ నేనున్నానని తెలుసుకో. ఈ ఆత్మ నేనుకు కులమతములు లేవు. స్త్రీ పురుష బేధంలేదు. చావుపుట్టుకలు లేవు. అదియే సజీవాత్మ. జాగ్రత్, స్వప్న, సుషుప్తి, తురీయ స్ధితిలో సైతం ఈ నేను అవిచ్చిన్నముగ భాసిల్లుచున్నది. ఇట్టి నేను పరిజ్ఞానమే పరలోక దైవరాజ్య ప్రవేశం. మీలో ఎందరు ఈ పరిజ్ఞాన మును కలిగియున్నారో పరీక్షించుకోండి. జీవాత్మ నేనుకు హృదయ మందిరమే సరియైన ఆలయం. ఈ లోకంలో నిర్మించిన దేవాలయములన్నియు ను బాహ్యవేడుకేలు మాత్రమే. సమస్త యాత్రలకు మూలం నేను అని తెలుసుకో. నీవు లేకుండ, నీవు పోకుండ ఏ యాత్రలు వర్ధిల్లనేరవు. నీతో సర్వం ఏకీభవించి యున్నదని రూఢిపరచుకో.

ఆకాశము శబ్ధగుణ రూపమైనది. ఆకాశమునకావల పరమ నిశ్శబ్ధము, కేవల పరమశివ అచలాద్వైతం నిండి భాసిల్లుచున్నది. ఇట్టి శివస్వరూప శక్తివలన పంచభూతములు ఆవిర్భవించినవి. పంచమూతముల సం యోగమే జగత్తు. సంసారము, పంచభూతములు అన్నియును భగవంతుని శక్తిలోనే ఇమిడియున్నవి. కావుననే దానికి విభూతి యోగమని పేరు వచ్చినది. అనంతుడు, అవ్యక్తుడు, సర్వవ్యాపియైన దేవదేవుడు దేహధారియైనపుడు జీవుడని పిలువబడు ను. జీవుడు అల్పజ్ఞుడు. భగవంతుడు అన్నింటికి కర్తయై జీవుల యంత్రముగ గిరగిర త్రిప్పుచున్నాడు.

ఈశ్వరునివలె జీవుడుకూడ శుద్ధ చిన్మాత్రు

డేగాన బేధంలేదు. మమాత్మా సర్వ భూతాంతరాత్మ. నా ఆత్మే సర్వ భూతములలో భాసిల్లుచున్నదని భావించి కేవలం ఆత్మౌపమ్య భావనిష్ఠలో నిలచిన జ్ఞాని సర్వమును తనలో, సర్వములో తనను దర్శించ గలుగును. ఇట్టి అఖండాత్ముని దైవస్ధితిలో పూజించినను దోషంలేదు. ఇట్టి అఖండ జ్ఞానమును ప్రతివారు సంపాదించి అనుభూతి చెందాలి. గుణముల లో మార్పురాకుండ గుడ్డలు మార్చుకోగానే సరిపోదు. వస్త్రాలంకార ములు బాహ్య దంబాచారమును సూచించును. శక్తికిమించిన వేషధారణ హానికరము. సబ్బు బిళ్ళలపైనున్న కాగితములు ఎంత సొగసుగ కనిపించినను ఎందుకు కొరగావు. స్ధితికుదురని కేవల వేషధారులు సబ్బు బిళ్ళలపైగల కాగితములవంటి వారు. ఓ వివేకి! ఎంతకాలము గంటలు మ్రోగించి మంత్రాలు వల్లిస్తావు. ఈ పూజా పునస్కారములు ఎంత వరకు నిలువగలవు. దూప, దీప, నైవేద్యాలు నీ తృప్తికొరకే. అవి భగ వంతుని ఎంతమాత్రం స్పృశించలేవు. నిన్ను, నీ నిజాత్మ స్ధితిని గుర్తించక కాలయాపన చేయరాదు. సత్యదేవునకు ప్రతేక స్ధలంలేదు. ఉన్నదంతా తనకు తానైన నేనే. ఈ నేను తప్పిస్తే ఇంకేమియునులేదు. మణుల లో దారమువలె సర్వాంతర్యామిగ ఉన్నదంతా నేనని నిశ్చయించుకో. ఇదియే సమస్త సాధనల ఫలితాల ప్రత్యక్ష మార్గం. దేహమనంబులు తానని భావించుటయే దు:ఖహేతువు. ఈ భ్రమ తొలగటమే బ్రహ్మత్వం.

జాగ్రత్స్వప్న సుషుప్త్యావస్ధలలో నీవున్నావుగాని జాగ్రత్ లో తోచేవి సుషుప్తిలో లేవు. ఆ సమయంలోకూడ నీవున్నావు. మనో సంకల్పాలే ప్రపంచ భావనకు ఆధారం. ఆత్మలోనే మనసు పుట్టి లయిస్తుందిగాన ఆత్మే అన్నింటికి మూలం. నీవు నీలో యున్నావు. శరీరంలో సూదిమొన వంటి కేంద్రం వుంది. దానినుండి నేను నేననే సోహం స్ఫురిస్తుంది. ఇది అజ్ఞానిలో మూతబడి ఉంటుంది. నిర్వికల్ప సమాధి స్ధితిలో శాశ్వతముగ తెరువబడి ఉంటుంది. అరుణాచల రమణుడు ఈ నేను భావమును స్పష్టంగ గ్రహించగలిగారు. ప్రతి మానవుడు ఈ నేను సాక్షాత్కారం పొందనేర్వా లి. ప్రశాంతమైన మనసుతో నిరంతరం నేనెవరు? అని ప్రశ్నించుకుంటూ ఉండిన క్రమముగ హృదయ కేంద్రానికి చేరుకోవచ్చు. ఇలా చేరగానే ఆత్మ స్ఫూర్తి కలుగును. తలంపు, భ్రమలులేని నిత్య ప్రత్యక్షానుభవ మైన ఆత్మ స్ఫూర్తిలో నేను పరిశుద్ధమై అవిచ్చిన్నంగా ప్రకా శిస్తుంది.

సమస్త నాడులకు హృదయమునుండే శక్తి వస్తుంది. హృదయమే శక్తి స్ధానం. గుదస్ధానమునుండి వెన్నెముకలోని వెన్నుపూసలద్వారా సుషుమ్న నాడి సహస్రారపర్యంతం అంతమౌతుంది. సిద్ధుల నిమిత్తం యోగులు ఈ నాడిని సాధించుటకై ధ్యానించెదరు. దీనిని ఆత్మ నాడి, పరా నాడి, అమృత నాడి అనెదరు. ఇది శక్తి కేంద్రమైన హృదయంలో పుట్టి సహస్రారంలో కలుస్తుంది. సుషుమ్న నాడికి సైతం ఆత్మ నాడియే శక్తినిస్తుంది. యోగ శాస్త్రం సహస్రారం అంతటికి మూలమంటుంది. పురుష సూక్తం హృదయమంటుంది. ఎట్టి సందేహములకు తావులేని ప్రత్యక్షాను భవమైన నేనుపై దృష్టి నిలిపిన ఆ నేనే ఆత్మలోకి తీసుకెళుతుంది. “నేను” విచారణను మించిన ధ్యానంగాని, సమాధిగాని లేదు. హృదయమే జీవునికి మూలస్ధానం. ఇది ఆత్మయొక్క పరమ కేంద్రం. దీనిని చూడటానికి ప్రయత్నించక అది నీవై ఉండనేర్చుకో. అసలైన ‘నేను’ స్ఫురణతో సదా విహరించ నేర్చుకో.