ఆత్మజ్ఞానం అంటే ఏమిటి

కోరికలు ఆశలు మానవ జీవితాన్ని ఏలా ప్రభావితం చేస్తాయి.*

మనిషి జీవితమే ఒక చక్ర భ్రమణం.
*ఇక కోరిక, ఆశ అనేవి ఈ చక్ర భ్రమణాన్ని నిర్దేశించే సాధనాలుగా అమరి ఉంటాయి.

*మనిషి జీవితంలో చక్ర భ్రమణం అనేది ఒక భాగంగా చేరి ఉంది. మనం గమనిస్తే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం... దీన్ని ‘యుగచక్రం’ అంటారు. వర్షకాలం, చలికాలం, ఎండకాలం... దీన్ని ‘రుతుచక్రం’ అంటారు. రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు... దీన్ని ‘కాల చక్రం’ అంటారు. బాల్యం, కౌమారం, యౌవనం, వార్ధక్యం... దీన్ని ‘జీవిత చక్రం’ అంటారు. ఇలా సృష్టి, స్థితి, లయ కారకుడైన ఆ పరమేశ్వరుడి నిర్దేశానుసారం మానవ జీవితంలో ‘చక్ర భ్రమణం’ నిరంతరంగా సాగిపోతూనే ఉంటుంది.

*రంగులరాట్నంలో రంగులు కింది నుంచి పైకి, పైనించి కిందికి తిరుగుతున్నట్టే మనిషి జీవితంలో సుఖానుభవాలు, దుఃఖానుభవాలు... ఒకదాని వెంట మరొకటిగా కలుగుతూనే ఉంటాయి. ఈ సత్యం తెలిసికూడా మనిషి మనసును మాయపొర కమ్మేయడంతో రాగబంధాలకు లోనైన మనిషి జీవితంలో నిరంతరం అయిన దానికి, కాని దానికి బాధపడుతుంటాడు.

*మనిషి జీవిత ప్రయాణం ఎక్కడికి అంటే గమ్యం వైపు నీ పయనం అంటాం. అయితే ఏది గమ్యం అనేదే జటిలమైన ప్రశ్న! మరి గమ్యాన్ని నిర్దేశించేది కోరిక. అలాంటి కోరికను ప్రేరేపించేవి మూడు- ధనం, సుఖం, కీర్తి. అయితే ఎంత ధనం కావాలి, ఎంత సుఖాన్ని అనుభవించాలి, ఎంత కీర్తిని మూట కట్టుకోవాలి? ఈ ‘ఎంత ’ అనేదానికి ‘అంతం ’ ఉందా? చాలామంది విషయంలో అంతమనేది లేనే లేదు, అసలే ఉండదు అనే చెప్పాలి. ఎందుకంటే మనిషి జీవితంలో- బాల్యం అమాయకంగాను, కౌమారం జిజ్ఞాసతోను, యౌవనం ఆశలతోనూ గడిచిపోతాయి. వార్ధక్యం వచ్చేసరికే అసలు సమస్య మొదలవుతుంది.

*జీవిత చరమాంకంలోనూ ఈ మనిషిలోని కోరిక చావదు. ఇంకా ధనం కావాలి, ఇంకా సుఖాలు కావాలి, ఇంకా కీర్తి ప్రతిష్ఠలు కావాలి. ఇంకా, ఇంకా, ఇంకా... ఈ ఇంకా అనే పరుగును ఎక్కడ ఆపాలో తెలియకపోవడమే మనిషి దుఃఖానికి హేతువుగా మారుతుంది. అలాగని కోరికే లేకుండా జీవించడం సాధ్యమే కాదు. అయితే ఆ కోరిక ఎంతవరకు అనే విచక్షణే మనిషి సుఖదుఃఖాలను నిర్ణయిస్తుంది. అది ఎలాగో పరిశీలిద్దాం !..

*ఉరిశిక్ష పడిన ఓ నేరస్థుడికి శిక్ష అమలుపరచేందుకు తలారి సిద్ధమయ్యాడు. ఉరికొయ్యకు అతడి కాళ్లూచేతుల్ని తాళ్లతో కట్టివేసి, పరిసరాలు కనిపించకుండా ముఖానికి నల్లటి ముసుగును కప్పేశాడు. ఇష్టదైవ ప్రార్థన చేసుకోవడానికి ఆ జైలు అధికారి అతడికి ఒక నిమిషం వ్యవధిని ఇచ్చాడు. ఆఖరి క్షణాల్లో ఉన్న ఆ నేరస్థుడికి కేవలం తన పాదాలు మాత్రమే కనిపిస్తున్నాయి.

*అప్పుడే ఒక తేలు అతడి పాదానికి అంగుళం దూరంలో అతడికి కనిపించింది. అది తనను ఎక్కడ కుడుతుందో అనే ప్రాణ భయంతో అతడు తన కాలివేళ్లను వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు. మరి మరణ శిక్ష అనుభవించ బోతూ కూడా తేలుకాటు నుంచి తప్పించుకోవడానికి అతడు ప్రయత్నిస్తున్నాడు అంటే, చూశారా ! అతనికున్న ఇంకా బతకాలని ఆశను. మరికొద్ది క్షణాల్లో ఉరిశిక్షను అనుభవించబోతున్న అతడికీ ప్రాణాలమీద ఇంకా ఆశే ! మనిషి మరణించేదాకా ఇంకా తాను జీవించాలనే ఆశను కలిగి ఉండటం అనేది మనిషి యొక్క నైజం! మరి ఈ కోరికలకు, ఆశలకు ఒక హద్దు, అంతం అంటూ లేవా ? చూద్దాం !..

*ఒక అడవిలో ఒక మహారుషి తపస్సు చేసుకుంటున్నాడు దీక్షగా. ఆ రుషి యొక్క గొప్పతనం గురించి ఆ నోటా ఈ నోటా విన్న ఆ దేశ రాజు ఆయనను ఒకసారి దర్శించుకునేందుకు అడవికి వెళ్లాడు. కానీ అంతకు ముందురోజే ఆ రుషి హిమాలయాలకు వెళ్ళిపోయాడని తెలిసి, ఆయన దర్శన భాగ్యం కలగనందుకు బాధపడిన రాజు, అలౌకిక సంపద కలిగిన ఆ రుషి తిరిగి వస్తాడనే నమ్మకంతో ఆయనకోసం అన్ని వసతులతో కూడిన ఒక గొప్ప మందిరాన్ని నిర్మించాడు. రాజు గారు ఊహించినట్లే కొంతకాలం తరవాత తిరిగివచ్చిన ఆ రుషి తాను తపస్సు చేసిన చెట్టు స్థానంలో వెలసిన ఆ గొప్ప మందిరం వైపు ఆశ్చర్యంగా చూడగా, అక్కడివాళ్లు ఈ మందిరాన్ని రాజుగారు మీకోసమే ప్రత్యేకంగా నిర్మించి ఇచ్చారు స్వామీ అని సెలవిచ్చారు. విరాగి అయిన రుషి అన్ని వసతులతో వైభవంగా ఉన్న ఆ మందిరం వైపు నిర్వికారంగా చూసి దాన్ని వదిలేసి దూరంగా ఉన్న మరో చెట్టు కింద కూర్చుని తిరిగి తాను తపస్సు చేసుకోవడం ఆరంభించాడు! మరి అంత గొప్ప వైభవంతో కూడుకున్న ఆ మందిరాన్ని తనకోసమే నిర్మించి ఇచ్చారని తెలిసినా ఆ రుషి దానిని తృణప్రాయంగా భావించి వదిలేశాడు. ఎందుకంటే బ్రహ్మజ్ఞానం తప్ప మరే కోరికా లేకపోవడం రుషి యొక్క నైజం. ప్రాణంకోసం తపించే మామూలు మనిషి స్థాయి నుంచి, ఈ ప్రాణమే శాశ్వతం కాదు అనే పరిపక్వ స్థితికి చేరడమే ఆత్మజ్ఞాన దర్శనం అంటే. అలాంటి వారే కోరికలకు, ఆశలకు అతీతంగా జీవించ గలుగుతారు. అలాంటి వారే చక్ర భ్రమణంలో తనను తాను తెలుసుకుంటూ, జీవన ప్రస్థానంలో అన్ని దశలనూ దాటుకుంటూ మహాప్రస్థానం వైపు అడుగులు వేయగలుగుతారు. అలాంటి గొప్ప వారే ‘నిగ్రహం, నిర్మోహం, నిరాపేక్షత ’ అనే త్రిలక్షణాలను త్రికరణ శుద్ధిగా ఆచరించ గలుగుతారు. అలా చేయగలిగితే అంతర్యామిని చేరుకునే అలౌకికమైన ఆనందం సిద్ధిస్తుంది. అందుకు ఒక గురువును ఆశ్రయించి ఆయన ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందడమే మీరంతా చేయవలసినది.

*సర్వే జనా సుఖినోభవంతు*

Image may contain: 1 person, sitting